సర్టిఫికెట్ వెరిఫికేషన్ రసాభాస
- ఎంసెట్ 3 ర్యాంక్ కార్డు వచ్చినా..అర్హత లేదన్న అధికారులు
- అర్ధరాత్రి వరకూ వేచి ఉండేలా చేయడంపై విద్యార్థుల ఆగ్రహం
- ఈస్ట్ మారేడుపల్లి పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఆందోళన
హైదరాబాద్: నగరంలో ఎంసెట్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రసాభాసగా మారింది. ఈస్ట్ మారేడుపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఎంసెట్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే వందలాది మంది విద్యార్థులు వెరిఫికేషన్ సెంటర్‌కు వచ్చారు. భారీ వర్షంలో అర్ధరాత్రి 12 వరకూ వేచి ఉన్నవారికి చివరి నిమిషంలో మీరు క్వాలిఫై కాలేదని చెప్పడంతో వారంతా నిర్ఘాంతపోయారు. తమకు ర్యాంక్ కార్డు, వెరిఫికేషన్‌కు రమ్మని మెసేజ్ వచ్చిందని అధికారులతో వాదనకు దిగారు. ఉదయం వచ్చిన తమ నుంచి రూ.2 వేలు ఫీజు కట్టించుకున్నారని, సర్టిఫికెట్లను పరిశీలించకుండా వేచి ఉండమన్నారని విద్యార్థులు చెప్పారు.
చివరికి అర్ధరాత్రి క్వాలిఫై మార్కులు రాలేదని పరిశీలనకు అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించా రు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాగమణి నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్, ఎంసెట్‌లో ఓసీలకు 50%, బీసీలకు 40% మార్కులు వస్తేనే అర్హత సాధించినట్టని విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. ఆ విషయం తమకు తెలియదని, తమతో ఎందుకు డబ్బులు కట్టించారని నిలదీశారు. ప్రిన్సిపాల్ వీసీకి సమాచారమందించ గా.. వారి డబ్బులు తిరిగివ్వమనడంతో రూ.2 వేలను అందించి పంపేశారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకూ 36 వేల ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగింది.