నూనెపల్లె: పాలిసెట్ కౌన్సెలింగ్ పూర్తైది. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను వరుసక్రమంలో ఎంపిక చేసుకున్నారు. ఇక తరగతులకు వెళ్లడమే తరువాయి. అయితే..రాష్ట్రప్రభుత్వం ఎందుకో ఈ విషయంలో నాన్చుతోంది. విద్యార్థులకు కళాశాల (సీట్) కేటాయించకుండా, తరగతులు ప్రారంభించకుండా ఆందోళనకు గురిచేస్తోంది.
పాలిటెక్నిక్ కోర్సు(సాంకేతిక విద్య)కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు చేస్తే ఉద్యోగ అవకాశాలు అధికం. దీంతో చాలా మంది విద్యార్థులు పదోతరగతి పూర్తవగానే పాలిటెక్నిక్ విద్యనభ్యాసించేందుకు ఆసక్తిచూపుతున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది జిల్లా నుంచి 2500 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. ఒక్క నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనే 1044 మంది హాజరయ్యారు.
వీరికి వారం రోజుల్లోగా కళాశాలలను ఎంపిక చేసి, తరగతులను ప్రారంభించాలన్న నిబంధనలున్నాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనలకు తిలోదకాలు ఇస్తోంది. ఓ వైపు కౌన్సిలింగ్ పూర్తి చేసి 10 రోజులు దాటినా కళాశాలల ఎంపిక చేపట్టక పోవడం మరోవైపు ఇంటర్మీడియట్ చేరేందుకు ఉన్న గడువు దాటిపోతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను పాలిటెక్నిక్‌లో చేర్పించాలో.. ఇంటర్‌లో చేర్పించాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు.
ఫీజురీయింబర్స్‌మెంట్స్ ఎత్తేసే ఆలోచన ..
నిబంధనల ప్రకారం జూన్ 9 నుంచి16వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరిగింది. 21వ తేదీన సీట్లు కేటాయింపు, 28న తరగతులు ప్రారంభించాలి. అయితే, ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. జిల్లా నుంచి దాదాపు 2500 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తికాగానే ప్రభుత్వం, సాంకేతిక శాఖ సంయుక్తంగా చర్చించుకొని రీయింబర్స్‌మెంట్‌పై నిర్ణయం ప్రకటించాలి. నేటికి పదిరోజులు గడిచినా అటు ప్రభుత్వం, ఇటు సాంకేతికశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కళాశాల కేటాయింపు, తరగతుల ప్రారంభంలో జాప్యం చేస్తోందని విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
సాంకే‘తికమక’ విద్య
Published Wed, Jul 2 2014 4:57 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement