Paliset Counseling
-
పాలిసెట్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పదో తరగతి విద్యార్హతతో నేరుగా సాంకేతిక విద్యాభ్యాసానికి అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి గాను పాలిసెట్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ, నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు పనిచేస్తాయి. ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలనకు అనుగుణంగా సిబ్బందిని నియమించి, కంప్యూటర్ సిస్టమ్‌లను సిద్ధం చేశారు. ఈనెల 30 నుంచి జూన్ 6 వరకు కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి ఒంటి గంట, మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఉండాల్సిన ధ్రువపత్రాలు ఎస్ఎస్సీ మార్కుల మెమో, ఆధార్ కార్డు, 4 నుంచి 10 తరగతుల వరకు స్టడీ సర్టిఫికెట్లు లేదా రెసిడెన్సియల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల ధ్రువపత్రం, ఎన్సీసీ/స్పోర్ట్స్/మైనార్టీ/ఆంగ్లో ఇండియన్ ధ్రువపత్రాలు, ర్యాంకు కార్డు ఒరిజినల్స్‌తో పాటు వాటి జెరాక్స్ కాపీలు తీసుకు రావాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కడికి వెళ్లాలి? దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్, ఎన్సీసీ సర్టిఫికెట్ల ఉన్న వారు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వారికి కేటాయించిన తేదీల ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతరులు వారికి సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లాలోని మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలకు తేదీల వారిగా కేటాయించిన ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. -
సాంకే‘తికమక’ విద్య
నూనెపల్లె: పాలిసెట్ కౌన్సెలింగ్ పూర్తైది. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను వరుసక్రమంలో ఎంపిక చేసుకున్నారు. ఇక తరగతులకు వెళ్లడమే తరువాయి. అయితే..రాష్ట్రప్రభుత్వం ఎందుకో ఈ విషయంలో నాన్చుతోంది. విద్యార్థులకు కళాశాల (సీట్) కేటాయించకుండా, తరగతులు ప్రారంభించకుండా ఆందోళనకు గురిచేస్తోంది. పాలిటెక్నిక్ కోర్సు(సాంకేతిక విద్య)కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు చేస్తే ఉద్యోగ అవకాశాలు అధికం. దీంతో చాలా మంది విద్యార్థులు పదోతరగతి పూర్తవగానే పాలిటెక్నిక్ విద్యనభ్యాసించేందుకు ఆసక్తిచూపుతున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది జిల్లా నుంచి 2500 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. ఒక్క నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనే 1044 మంది హాజరయ్యారు. వీరికి వారం రోజుల్లోగా కళాశాలలను ఎంపిక చేసి, తరగతులను ప్రారంభించాలన్న నిబంధనలున్నాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనలకు తిలోదకాలు ఇస్తోంది. ఓ వైపు కౌన్సిలింగ్ పూర్తి చేసి 10 రోజులు దాటినా కళాశాలల ఎంపిక చేపట్టక పోవడం మరోవైపు ఇంటర్మీడియట్ చేరేందుకు ఉన్న గడువు దాటిపోతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను పాలిటెక్నిక్‌లో చేర్పించాలో.. ఇంటర్లో చేర్పించాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్స్ ఎత్తేసే ఆలోచన .. నిబంధనల ప్రకారం జూన్ 9 నుంచి16వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరిగింది. 21వ తేదీన సీట్లు కేటాయింపు, 28న తరగతులు ప్రారంభించాలి. అయితే, ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. జిల్లా నుంచి దాదాపు 2500 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ పూర్తికాగానే ప్రభుత్వం, సాంకేతిక శాఖ సంయుక్తంగా చర్చించుకొని రీయింబర్స్‌మెంట్‌పై నిర్ణయం ప్రకటించాలి. నేటికి పదిరోజులు గడిచినా అటు ప్రభుత్వం, ఇటు సాంకేతికశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కళాశాల కేటాయింపు, తరగతుల ప్రారంభంలో జాప్యం చేస్తోందని విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 291 మంది హాజరు
ఎచ్చెర్ల క్యాంపస్ :శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2014 వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. రెండో రోజైన మంగళవారం 40 వేలు లోపు ర్యాంకర్ల పత్రాలను సిబ్బంది పరిశీలించగా 311 మంది హాజరయ్యారు. ఇప్పటివరకూ 817 మంది ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తియింది. కాగా బుధవారం 60 వేలు లోపు ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన 50 వేల లోపు ర్యాంకర్లు ఈ నెల 12,13 తేదీల్లో కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.16వ తేదీవ రకు కౌన్సెలింగ్ జరగనుంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనను అడ్మిషన్లు ఇన్చార్జి మేనేజర్ కె.శివకుమార్, అధ్యాపకులు మల్లిబాబు పర్యవేక్షించారు.