సాక్షి, హైదరాబాద్: బీఈ/బీటెక్ ప్రవేశాలకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో కచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండాలన్న నిబంధనను తొలగించింది. వాటిని ఆప్షనల్‌గానే పేర్కొంది. నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని వెల్లడించింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది.
గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి..
2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ (రివైజ్డ్) 2020–21లో బీఈ/ బీటెక్/ బీఆర్క్/ బీప్లానింగ్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్లడించింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులను విద్యార్థులు తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని స్పష్టం చేసింది. వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది. అందులో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్‌ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ వంటి సబ్జెక్టులో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది. అంటే బీఈ/బీటెక్/బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ప్లానింగ్ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో (12వ తరగతి) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని పేర్కొంది. అయితే తాజాగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్‌ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
మన దగ్గర ఎంపీసీ విద్యార్థులే ఇంజనీరింగ్‌లో చేరుతారు. ఏఐసీటీఈ పేర్కొన్న పలు కాంబినేషన్ల సబ్జెక్టులు మన దగ్గర ఇంటర్మీడియట్‌లో లేవు. పైగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
- పాపిరెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి
అన్ని కోణాల్లో పరిశీలిస్తాం
నిర్దేశిత సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే చాలని పేర్కొన్న ఏఐసీటీఈ నిబంధనను పరిశీలిస్తాం. ఈసారి సాధ్యం అవుతుందా లేదా అన్న దానిపై సబ్జెక్టు నిపుణులతో, యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విభాగం నిపుణులతో చర్చిస్తాం. అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అయితే అర్హతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు/ సంబంధిత బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పినందున ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలితో చర్చిస్తాం. మండలి సూచనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
- ప్రొఫెసర్ గోవర్ధన్, ఎంసెట్ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment