కొట్టం ఇంజనీరింగ్ విద్యా సంస్థల మూత
► 350 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం
►శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్‌లో చేరాలని
►యాజమాన్యం హుకుం ఎన్‌ఓసీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని
► విద్యార్థుల డిమాండ్
కల్లూరు: ఇంజనీరింగ్ విద్య విభాగంలో ఒక వెలుగు వెలిగిన కొట్టం ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ విద్యా సంస్థలో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈసీ, సీఎస్‌ఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్ కోర్సులు చదువుతున్న 350 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కొట్టం కరుణాకరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లు చిన్నటేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ కాలేజ్ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కళాశాలలోని ల్యాబ్‌పరికరాలను యాజమాన్యం అమ్ముకుని ల్యాబ్ పరీక్షలు, ప్రయోగాలపై వారికి శిక్షణ ఇవ్వలేదు. బస్సు సౌకర్యాలను రద్దు చేయడంతో సొంత వాహనాలు,ఆర్‌టీసీ బస్సులద్వారా కొందరు విద్యార్థులు కాలేజ్‌కు వస్తుండగా మరికొందరు సమీప గ్రామాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
అడ్మిషన్ పొందుతున్న సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తామని యాజమాన్యం చెప్పి మోసం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యా సంస్థలను మూసివేస్తున్న సమాచారం తమకు ఇవ్వలేదని, కేవలం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్‌లో చేరాలని యాజమాన్యం హుకుం జారీచేసిందని ఈసీఈ నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాధవరెడ్డి, శశిధర్, బి.రాజశేఖర్, బి.ఈరన్న తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఉలిందకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు గురువారం వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు ఎన్‌ఓసీ ధ్రువీకరణ పత్రాలు అందేలా చూడాలని కోరుతున్నారు.