
సాక్షి, అమరావతి: నూతన విద్యావిధానంలో పేర్కొన్న మేరకు ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు కానుందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీటెక్ వంటి సాంకేతిక కోర్సులను స్థానిక భాషల్లో నిర్వహించడం ఎంతవరకు సాధ్యమన్నది చర్చ సాగుతోంది. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుల అమలు కష్టమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక భాషల్లో సాంకేతిక పదజాలం ఏది?
స్థానిక భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలంటే ముఖ్యంగా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన సాంకేతిక పదజాలం ప్రాంతీయ భాషల్లో లేదు. వాటిని ఏదోలా తర్జుమా చేసినా విద్యార్థులకు పదాలు అర్థమవడం కష్టమే. ప్రస్తుతం ఇంజనీరింగ్ సహా అనేక అంశాల పరిజ్ఞానం ఆంగ్లంలోనే లభ్యమవుతోంది. ఆ భాషలో నైపుణ్యమున్న వారికే ఆ పరిజ్ఙానం ఎక్కువగా పొందగలుగుతున్నారు.ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులను నిర్వహించడం, అభ్యసించడం కష్టమే కాకుండా అలా చదువులు పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగ అవకాశాలు దక్కవు
ప్రస్తుతం ప్రపంచంలో ఇంగ్లిషు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికే ప్రాధాన్యం దక్కుతోంది. తెలుగు వంటి స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహించడం చాలా కష్టం. అందరూ ఎల్‌కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమానికి మొగ్గుచూపుతున్న తరుణంలో తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రారు. తెలుగులో ఇంజనీరింగ్ చేసేవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకురావు.
– చొప్పా గంగిరెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు
ఆప్షన్ మాత్రమే
ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలన్నది జాతీయ నూతన విద్యావిధానంలో పాలసీగా పెట్టినా అది ఆప్షన్ మాత్రమే. దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కొన్ని ఎంపికచేసిన ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా తర్జుమా చేయించారు. కాలేజీలు తమకు నచ్చితే అమలు చేయవచ్చు. వద్దనుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమంలోనే బీటెక్ కోర్సులను కొనసాగించవచ్చు. అది వారిష్టం.
– సతీష్‌చంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నతవిద్యాశాఖ
Comments
Please login to add a commentAdd a comment