‘ప్రమోట్‌’కు ఒకటే ప్రమాణం! | Promotion for next year only if have 20 credits: engineering education | Sakshi
Sakshi News home page

‘ప్రమోట్‌’కు ఒకటే ప్రమాణం!

Published Sat, Jan 4 2025 5:53 AM | Last Updated on Sat, Jan 4 2025 5:53 AM

Promotion for next year only if have 20 credits: engineering education

20 క్రెడిట్స్‌ ఉంటేనే వచ్చే ఏడాదికి ప్రమోషన్‌

ఇంజనీరింగ్‌ విద్యలో అన్ని యూనివర్సిటీల్లో ఒకే పద్ధతి ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకే తరహా ప్రమోషన్‌ విధానం తీసుకురావాలని ప్రభుత్వం సాంకేతిక విద్య విభాగానికి సూచించింది. ఇంజనీరింగ్‌లో కనీసం 20 క్రెడిట్స్‌ ఉంటేనే తర్వాతి ఏడాదికి ప్రమోట్‌ చేసే విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. దీనిపై త్వరలో అన్ని వర్సిటీల వీసీలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. 

ఇప్పటికే క్రెడిట్‌ పాయింట్లను బట్టి మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి ప్రమోట్‌ చేస్తున్నారు. అయితే ఈ విధానం ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఉంది. దీంతో కొన్ని వర్సిటీల విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్‌ విద్య కొనసాగుతోంది.  

ప్రస్తుతం ఒక్కో చోట ఒక్కో విధానం 
వర్సిటీల్లో ఒక్కో సెమిస్టర్‌కు 20 చొప్పున, ఏడాదికి 40 క్రెడిట్స్‌ ఉంటాయి. ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో బీటెక్‌ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి మొదటి సంవత్సరంలో 50 శాతం క్రెడిట్స్‌ సాధించాలి. కానీ జేఎన్‌టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్‌ పొందితే సరిపోతుంది. మిగతా సంవత్సరాల విషయంలోనూ ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్‌ విధానం ఉంది. నాలుగేళ్లకు కలిపి మొత్తం 160 క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయి. 4వ సంవత్సరంలో 160 క్రెడిట్స్‌ సాధించాల్సి ఉంటుంది. 

అయితే యూనివర్సిటీలకు వేర్వేరు సిలబస్‌ ఉండటం వల్ల కూడా క్రెడిట్‌ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్‌ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్‌ ఉంటాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ఫస్టియర్‌ ఇంజనీరింగ్‌లో ఐదు థియరీ సబ్జెక్టులు, మూడు ల్యాబ్‌లు ఉంటాయి. విద్యార్థి పాసయ్యే ఒక్కో సబ్జెక్టుకు దానికి సంబంధించిన క్రెడిట్‌ పాయింట్లు అతని ఖాతాలో పడతాయి. విద్యార్థులు ఎక్కడ తేలికగా ప్రమోట్‌ అవుతారో చూసుకుని ఆ వర్సిటీని ఎంచుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement