ఇంజనీరింగ్‌విద్యను లైట్‌గాతీసుకుంటున్న యువత
ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, సెమినార్ల ఊసే ఎత్తని విధానం
విదేశాల్లో ఉద్యోగాల సాధనలో తప్పని ఎదురీత
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో ఇంజనీరింగ్ విద్యను లైట్‌గా తీసుకున్న విద్యార్థులు..ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటెక్‌లో ముఖ్యమైన నైపుణ్య మెళకువలపై దృష్టి పెట్టకపోవడం అక్కడ చాలామంది స్కిల్ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ప్రాజెక్టులు, ఇంటర్న్ íÙప్‌లు ఇండియాలో సరిగ్గా పూర్తి చేయకపోవడంతో విదేశీ ఉద్యోగాలు చేజిక్కడం లేదు.
ఇంజనీరింగ్‌లో సెమినార్‌ను లైట్‌గా తీసుకోవడం వల్ల విదేశాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రదర్శించలేక పోతున్నారు. ఎంఎస్ కోసం ఏటా 7.50 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. వీరిలో 1.90 లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్లేవారే. ఇందులోనూ అత్యధికంగా అమెరికాకు 90 వేలకుపైగా వెళుతున్నారు.
లీప్ స్కాలర్స్ అధ్యయనం ప్రకారం అమెరికాలో వివిధ దేశాలకు చెందిన 2.25 లక్షల మంది ఏటా స్కిల్ ఉద్యోగాలు పొందుతుంటే, తెలంగాణ విద్యార్థుల వాటా 8 వేలకు మించడం లేదు. మిగతా వారంతా అన్‌స్కిల్డ్, పార్ట్‌టైం ఉద్యోగాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యాలపై దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రవాస భారతీయులు అంటున్నారు.
కలివిడితనమే కీలకం
ఎంఎస్ తర్వాత విదేశాల్లో ఉద్యోగం పొందాలంటే కలివిడిగా దూసుకెళ్లడం కీలకం. ఇంటర్వ్యూలు, సెమినార్లు, గ్రూప్ డిస్కషన్స్‌కు విదేశీ సంస్థలు ప్రాధాన్యమిస్తాయి. నాయకత్వ లక్షణం ఉంటేనే ప్రాజెక్టు ముందుకెళుతుందనే భావనతో ఉంటాయి. చాలామందిలో ఈ లోపం కనిపిస్తోందని యూఎస్‌లో లీడింగ్ సంస్థలో సాఫ్ట్‌వేర్ నిపుణుడు నీరజ్ పంకజ్ తెలిపారు.
అమెరికా వస్తున్న భారతీయ విద్యార్థులకు స్థానిక వసతి, రవాణా, మార్కెట్లు, కరెన్సీ వంటి అంశాలపై కూడా ఆరునెలల వరకూ అవగాహన ఉండటం లేదని తెలిపారు. కేవలం కన్సల్టెన్సీలనే నమ్ముకుంటున్నారని, ఇతరులతో పరిచయాలు పెంచుకునే నైజం ఉండటం లేదన్నారు. ఇంజనీరింగ్‌లో ఇంటర్న్ షిప్‌లు, గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొంటే, సెమినార్లు తరచు చేస్తూ ఉంటే ఈ సమస్య ఉండదన్నారు.
ఏకాగ్రతను దెబ్బతీసే అలవాటు
మనకు, ఇతర దేశాలకు వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలుంటాయి. సంస్కృతి, భాష వంటకాల్లో కూడా అంతే. ఈ అసౌకర్యంతో చాలామంది విద్యార్థుల ఏకాగ్రత దెబ్బ తింటోంది. హోమ్‌సిక్ బారిన పడుతున్నారు. మనవారు సాధారణంగా టూరిస్ట్ గైడ్, టీచింగ్ అసిస్టెంట్, లైబ్రరీ మానిటర్, గిగ్ మార్కెట్‌లో పనిచేస్తుంటారు. ఇవన్నీ పార్ట్‌టైం ఉద్యోగాలే.
వాస్తవానికి ఇండియాలో ఉన్నప్పుడు అసలీ రంగాలపైనే వారికి అవగాహన ఉండటం లేదని, ఇతర దేశాలకు వెళ్లి నేర్చుకోవడం కష్టంగా ఉంటోందని ఆ్రస్టేలియాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు ఆదిత్య తెలిపారు. ఈ అసౌకర్యం వల్ల ప్రధానమైన స్కిల్ ఉద్యోగాలపై ఏకాగ్రత తగ్గుతోందన్నారు. వీసా గడువు పూర్తయ్యే నాటికి కూడా మంచి ఉద్యోగం పొందే స్కిల్ ఉండటం లేదని చెప్పారు.
ఆ నిర్లక్ష్యంతోనే ఒత్తిడి
ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థి ఏకకాలంలో ఎన్నో పనులు చేయాలి. క్లాసులకు హాజరవ్వాలి. అసైన్‌మెంట్లు, గ్రూప్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. ఇంకోవైపు పార్ట్‌టైం ఉద్యోగమూ చేయాలి. వాస్తవానికి ఇవన్నీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇంజనీరింగ్ చేసేప్పుడూ ఇవన్నీ ఉంటాయి. కానీ మనవారు పట్టించుకోవడం లేదని కెనడాలో ఉంటున్న హైదరాబాద్‌వాసి సాయిచరణ్ తెలిపారు.
విదేశాల్లో ఇవన్నీ ఏకకాలంలో చేయాల్సి రావడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రణాళికాబద్ధమైన జీవన విధానం దెబ్బతింటోందన్నారు. సామాజిక అవగాహనతో ఇంజనీరింగ్ విద్య చేసేవారు ఈ ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఆవిష్కరణలు, వాటిపై జరిగే సెమినార్లలో పాల్గొంటే ఈ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం
నాణ్యమైన విశ్వవిద్యాలయం నుంచి వచ్చే విద్యార్థులకే విదేశీ ఉద్యోగాలు తేలికగా లభిస్తున్నాయి. అక్కడే వివిధ అంశాల బోధనకు అవసరమైన వాతావరణం ఉంటుంది. ఇందులోనే పరిశోధన ఉంటుందని నమ్ముతున్నాయి. జ్ఞానాన్నీ, తార్కిక ఆలోచనా నైపుణ్యాన్నీ పెంచుకునే అవకాశాలు విద్యార్థులకు విస్తృతంగా ఉంటాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌లో రాణించే మెళకువలు ఇంజనీరింగ్ నుంచే అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. తరగతిగదిలో లెక్చరర్లు బోధించే సమయం, వారానికి కొన్ని గంటలపాటు పరిమితంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత నేర్చుకోవడం, అవసరమైన సమాచారాన్ని సేకరించగలగడమే విదేశీ విద్య తర్వాత రాణించడానికి మార్గం సుగమం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment