సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యను ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. పాఠ్యపుస్తకాల ముద్రణను వేగవంతం చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మొదటి సంవత్సరం పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో రూపొందించే పనిలో నిమగ్నమైంది. వీటితో పాటు డిప్లొమా పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదింపజేస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాంతీయ భాషలకు చెందిన 226 మంది రచయితలతో 218 పాఠ్యపుస్తకాలను తర్జుమా చేయించి సిద్ధం చేసింది. ఇకపై ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే వారికి భాష అడ్డంకిగా ఉండదని ఏఐసీటీఈ ట్విట్టర్‌లో పేర్కొంది.
నూతన విద్యావిధానంలో భాగంగా దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంజనీరింగ్ విద్యను అందించేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. హిందీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు నిర్ణయించింది. అయితే, ఇంజనీరింగ్ సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేకపోవడం, వాటిని బోధించే సిబ్బంది కూడా లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లోని కాలేజీలు ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఇంజనీరింగ్ విద్యకు సుముఖత చూపడం లేదు.
దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 5 ప్రాంతీయ భాషల్లో 14 ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్‌లోని కొన్ని కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను తమిళ భాషలో అందించేందుకు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గుంటూరు జిల్లాలోని ఒక కాలేజీ తెలుగు మాధ్యమంలో కొన్ని కోర్సులను అందించేందుకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకుంది. ఈ ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్ధులు ఆ భాషలో కానీ, ఆంగ్లంలో కానీ పరీక్షలు రాసేందుకు ఏఐసీటీఈ అనుమతిస్తోంది.
ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలు
Published Sun, Oct 3 2021 4:58 AM | Last Updated on Sun, Oct 3 2021 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment