నేనో నిరుద్యోగి.. చదివింది ఇంజనీరింగ్‌ | AICTE Survey on Engineering Education | Sakshi
Sakshi News home page

నేనో నిరుద్యోగి.. చదివింది ఇంజనీరింగ్‌

Published Fri, Aug 11 2017 1:27 AM | Last Updated on Fri, Aug 17 2018 6:05 PM

నేనో నిరుద్యోగి.. చదివింది ఇంజనీరింగ్‌ - Sakshi

నేనో నిరుద్యోగి.. చదివింది ఇంజనీరింగ్‌

ఉద్యోగం ఇవ్వని ఇంజనీరింగ్‌ విద్య.. నైపుణ్యాల కొరతే ప్రధాన సమస్య
అడ్డగోలుగా కాలేజీలు.. ప్రమాణాలు మాత్రం శూన్యం.. దేశవ్యాప్తంగా 32.88% మందికే ఉద్యోగాలు
ఏటా ఇంజనీరింగ్‌ చదువుతున్న వారు 15 లక్షల పైనే.. ఉద్యోగాలు లభిస్తున్నది 4.95 లక్షల మందికే
►  తెలంగాణలో 28.3% శాతం మందికే ఉద్యోగాలు.. రెండేళ్లుగా మెరుగుపడుతున్న పరిస్థితి..  


అరవింద్‌.. వయసు 26 ఏళ్లు.. ఊరు నల్లగొండ జిల్లా తేరట్‌పల్లి. ఇంజనీర్‌ కావాలన్నది అతడి చిన్నప్పటి ఆశయం.. దానికి తగ్గట్టే బీటెక్‌ చదివాడు. 2012లో ఓ కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.. బీటెక్‌ పూర్తిచేశాడు గానీ ఇంజనీర్‌ కావాలన్న అతడి ఆశయం మాత్రం అలాగే ఉండిపోయింది. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఓరల్‌లో అంతా ఇంగ్లిష్‌లోనే సమాధానమివ్వాలి.. అరవింద్‌ అక్కడ తడబడ్డాడు.. నేటికీ నిరుద్యోగిగానే మిగిలిపోయాడు.  

సాక్షి, హైదరాబాద్‌ :  ఇంజనీరింగ్‌ విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతోంది. కొరవడిన నాణ్యతా ప్రమాణాలు, సబ్జెక్టుపై పట్టులేకపోవడం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లోపం వంటి కారణాలతో దాదాపు 67% మందికిపైగా ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు గానే మిగిలిపోతున్నారు.

దేశవ్యాప్తంగా ఏటా 15 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్‌ విద్య పూర్తిచేసుకుంటున్నా.. వారిలో 32.88% మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇవీ కూడా కాలేజీల యాజమాన్యాలు చెప్పిన లెక్కలే. వాస్తవంగా ఈ శాతం మరింత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తెలంగాణలో కేవలం 28.31 శాతం మందికి, ఏపీలో 27.92% మందికే ఉద్యోగావకాశాలు లభిస్తుండడం గమనార్హం.

ఏఐసీటీఈ సర్వేలోనే..
తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి 2016–17 విద్యా సంవత్సరంలో 1,18,419 మంది ఇంజనీరింగ్‌ విద్యను పూర్తిచేసుకున్నారు. ఇందులో 33,529 మందికి (28.31%) మాత్రమే ఉద్యోగావకాశాలు లభించాయి. ఏపీలో గతేడాది 1,47,699 మంది ఇంజనీరింగ్‌ పూర్తి చేయగా.. 41,312 మందికే (27.97%) ఉద్యోగాలు వచ్చాయి. ఇవి లెక్కలు కూడా సాక్షాత్తు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్వయంగా తేల్చినవి కావడం గమనార్హం.

ఎన్నో కారణాలతో..
ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లభించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో నైపుణ్యాల కొరత, మార్కెట్‌ అవసరాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడం, ఇంగ్లిషు భాషా సమస్య వంటివి ప్రధానమైనవి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ఇంజ నీరింగ్‌ కాలేజీలు, వాటిల్లో ప్రమాణాల లేమి, మౌలిక సౌకర్యాల కొరత, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా బోధన జరపకపోవడం వంటి వాటి కారణంగా ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాల లేమి కనిపిస్తోంది.

పీపుల్‌ స్ట్రాంగ్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్, లింక్‌డ్‌ఇన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోనే ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీబాక్స్‌ ఎంప్లాయబిలిటీ స్కిల్‌ టెస్టు (వెస్ట్‌) పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 5.2 లక్షల మంది అభ్యర్థుల అభిప్రాయాలను సేకరించారు. ఇక అస్పైరింగ్‌ మైండ్స్‌ అనే సంస్థ చేసిన అధ్యయనంలోనూ ఇవే అంశాలు వెల్లడయ్యాయి. వీటితోపాటు పారిశ్రామిక రంగంలో, మార్కెట్‌లో అవసరాల కంటే ఏటా రెట్టింపు సంఖ్యలో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు బయటకు రావడమూ కారణమని తేలింది. మరోవైపు మంచి నైపుణ్యం ఉన్న అభ్యర్థుల కోసం డిమాండ్‌ కూడా పెరుగుతుండడం గమనార్హం.

మెరుగవుతున్న పరిస్థితి
గత ఒకటీ రెండేళ్లుగా ఉద్యోగాలు పొందుతున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల శాతం స్వల్పంగా పెరిగింది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా గతేడాది ఉద్యోగాలు పొందిన వారి శాతం  పెరిగింది. తెలంగాణలో 2015–16లో 26.79% మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించగా... 2016– 17లో 28.31% మందికి ఉద్యోగాలు వచ్చాయి. పొరుగు రాష్ట్రం ఏపీలో 2015–16లో 25.30% మందికి ఉద్యోగాలురాగా.. 2016–17లో 27.97% మందికి లభించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement