యువ ఇంజనీర్లకు 'ఉపాధి ఎక్కడ'?  | NO Jobs For New Engineers All Over India | Sakshi
Sakshi News home page

యువ ఇంజనీర్లకు 'ఉపాధి ఎక్కడ'? 

Published Tue, Aug 8 2023 12:47 AM | Last Updated on Tue, Aug 8 2023 3:53 AM

NO Jobs For New Engineers All Over India - Sakshi

నిజామాబాద్‌కు చెందిన సూర్యకిరణ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చేశాడు. ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్సే అతని ప్రధాన సబ్జెక్టు. ఇతను ఓ ప్రముఖ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మైక్రో లెవల్‌ ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఇంత సూక్ష్మ స్థాయి టెక్నాలజీ గురించి అతను పుస్తకాల్లో చదవలేదు. ప్రాజెక్టు సమయంలోనూ దీని జోలికెళ్ళలేదు. దీంతో నైపుణ్యం లేదని కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోనే కాదు..దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ విద్యకున్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఆకర్షణీయమైన వేతనంతో ఏ బహుళజాతి కంపెనీలోనో తక్షణ ఉద్యోగం లేదా డిగ్రీ పూర్తి కాగానే ఎమ్మెస్‌ కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్లి పోవచ్చు. డాలర్‌ డ్రీమ్స్‌ నెరవేర్చుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రధానంగా ఇలాంటి కారణాలతోనే ఇంజనీరింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా కంప్యూటర్‌ సంబంధిత కోర్సులపై క్రేజ్‌ విపరీతంగా పెరిగిపోయింది.

మొత్తం మీద దేశవ్యాప్తంగా ఏటా సగటున 14 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. కానీ ఏటా సగటున కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభిస్తుండటం గమనార్హం. ఇందులోనూ  కేవలం 8 శాతం మందికి మాత్రమే వారు చదివిన విద్యకు తగిన ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వారంతా ఏదో ఒక ఉద్యోగంతో సరిపుచ్చుకుంటున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలు స్పష్టం చేస్తుండటం శోచనీయం.

మన రాష్ట్రంలో 2021–22లో 87 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరారు. వీరిలో 58 శాతం కంప్యూటర్‌ కోర్సుల్లో చేరారు. కానీ ఈ ఏడాదిలో కేవలం 39 వేల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగాలు పొందారు. వీటిల్లో ఎక్కువగా నాన్‌–స్కిల్డ్‌ ఉద్యోగాలే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సాంకేతికతకు సరిపడ నైపుణ్యాలు కొరవడటం, సంబంధిత సబ్జెక్టుపై తగిన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

ఏళ్ల నాటి టెక్నాలజీయే ఇప్పుడూ..! 
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సాంకేతికతను అన్ని రంగాలూ అందిపుచ్చుకుంటున్నాయి. మానవ వనరులతో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వంటి టెక్నాలజీ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తోంది. అయితే వీటి నిర్వహణకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్ల అవసరం ఉంది. కానీ బోధనలో ఎప్పటికప్పుడు మార్పు చెందే టెక్నాలజీని చేర్చడం లేదని, ఏళ్ళ నాటి టెక్నాలజీతోనే ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు.

గత కొన్నేళ్ళుగా కంప్యూటర్‌ సైన్స్‌లో అనేక కొత్త కోర్సులు వస్తున్నాయి. ఇవన్నీ మూడేళ్ళ క్రితమే డిజైన్‌ చేసినవి. కోవిడ్‌ తర్వాత అన్ని రంగాలు తక్కువ మానవ వనరులతో పనిచేసే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను అభివృద్ధి చేశాయి. ఇంటినుంచే బ్యాంకు లావాదేవీలు, ఢిల్లీలో ఉండి ఎక్కడో మారుమూల ఉన్న సోలార్‌ సిస్టమ్‌ను పరిశీలించే విధానాలు వచ్చాయి. కానీ ఈ టెక్నాలజీ విద్యార్థుల వరకూ వెళ్ళడం లేదు. ఇలాంటి పరిస్థితులే యువ ఇంజనీర్ల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు.  

తూతూ మంత్రం ప్రాజెక్టులు 
ఇంజనీరింగ్‌ విద్యలో ప్రాజెక్టులు కీలకం. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చేసేవారు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉండే టెక్నాలజీపై ప్రాజెక్టులు చేయాలి. కానీ ఏదో ఒక ప్రాజెక్టును ఎవరితోనో చేయించుకుని వస్తున్నారని, విధిలేని పరిస్థితుల్లో వాటిని అనుమతించాల్సి వస్తోందని ఒక యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఇక ప్రైవేటు కాలేజీలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. చాలా కాలేజీలకు నాణ్యమైన పరిశ్రమలతో ఎలాంటి సంబంధాలూ లేవు. దీంతో విద్యార్థులకు మంచి ప్రాజెక్టులను సూచించలేకపోతున్నారు.

విద్యార్థులు కూడా ఏదో ఒక ప్రాజెక్టు చేశామనిపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త విషయాలపై దృష్టి పెట్టాలనే ఆలోచనను విద్యార్థి దశలోనే విస్మరిస్తే, కంపెనీలు కోరుకునే కొత్త టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్‌ విద్యకే కాదు..ఉన్నత విద్య మొత్తానికీ ఇదే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిలో, విద్యా విధానంలో మార్పు రావాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అంటున్నారు. 

సాంకేతికతలో మార్పులు అందిపుచ్చుకోవడం లేదు 
ఉన్నత విద్యకు వచ్చిన విద్యార్థి తరగతి గదిలోనే ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే కొత్త విషయాలను రాబట్టే విధానం అభివృద్ధి చెందుతుంది. మెజారిటీ విద్యార్థుల్లో ఇది కన్పించడం లేదు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఇదే ఉపాధికి ప్రధాన అడ్డంకిగా మారింది. 
– ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్‌టీయూహెచ్‌) 

ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి 
75 ఏళ్ళు గడిచినా భారత విద్యా విధానంపై స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ లేదు. అనేక కమిషన్లు వేసినా ఈ దిశగా ముందడుగు వేయలేదు. ఈ కారణంగానే మన అవసరాలకు కావాల్సిన విద్యా విధానాన్ని రూపొందించుకోలేకపోతున్నాం. పరిశోధనాత్మక విద్యకు బడ్జెట్‌ పెంచాల్సిన అవసరం ఉంది. థియరీ విద్యతో పాటు ప్రధానంగా ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి. 
– ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌ (వీసీ, కాకతీయ వర్సిటీ) 

నాణ్యమైన ప్రాజెక్టు వర్క్‌ పెంచాలి  
సాంకేతిక విద్యే కాదు.. ఉన్నత విద్యలోనూ థియరీలోనే ముందుకెళ్తున్నాం. కానీ పుస్తకాల్లో ఉన్నదానికి నిజ జీవితంలోని అనుభవాలు జోడించడం లేదు. థియరీతో పాటు నాణ్యమైన ప్రాజెక్టు వర్క్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనే పెంచాలి. ఈ దిశగా ఏఐసీటీఈ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. ఏదో ఒక ఉపాధి అనుకోవడం కాదు.. ఉన్నత విద్య తర్వాత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. 
– ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ (వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం) 

విద్యార్థి దశలోనే సంస్థలతో భాగస్వామ్యం ఉండాలి  
ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా అన్ని సంస్థలు యాంత్రిక విధానాలను అనుసరిస్తున్నాయి. వీటి నిర్వహణ నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లకే ఉపాధి అవకాశాలుంటాయి. ఉదాహరణకు ఆసుపత్రులు ఏఐ ద్వారా ముందుకెళ్తున్నాయి. ఈ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ తెలియాలంటే ఇంజనీరింగ్‌ చేసేటప్పుడే ఆ విద్యార్థికి  సంస్థలు, కంపెనీలతో భాగస్వామ్యం అవసరం. అప్పుడే భవిష్యత్‌ అవసరాలకు ఇంజనీరింగ్‌ విద్యను ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది. ఈ దిశగా ఉన్నత విద్యలో మార్పులు అవసరం.  
– ఎస్‌.నీలిమ (సీఈవో, అనురాగ్‌ యూనివర్సిటీ) 

నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే విధానం ఉండాలి  
విద్యార్థికి మార్కులు కొలమానంగా ఉండే విద్యా విధానం మారాలి. అందుకే దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని ఓ సంస్థను కోరాం. విద్యార్థిలో ఉండే నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే పరీక్షా విధానం భావి ఇంజనీర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. 
– ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement