సాక్షి, నల్లగొండ: విద్యార్థులకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ చదువుల వనంగా మారనుంది. మరిన్ని ఉన్నత చదువులకు కేరాఫ్‌గా నిలువనుంది. ఇప్పటికే మూడు విభాగాల్లో అందిస్తున్న పలు కోర్సులకు తోడు తాజాగా ఇంజినీరింగ్ చేరింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి వస్తుంది. మూడు బ్రాంచ్‌లల్లో సీట్లు కేటాయిస్తూ ఉన్నత విద్యాశాఖ నుంచి మంగళవారం క్లియరెన్స్ వచ్చింది.
మూడు బ్రాంచ్‌లతో ప్రారంభం..
2013-14 విద్యా సంవత్సరంలో మూడు బ్రాంచ్‌లతో ఇంజినీరింగ్ విద్యను ప్రారంభిస్తారు. ప్రస్తుత పరిస్థితులో విద్యార్థులు ఆసక్తి కనబర్చుతున్న సీఎస్‌ఈ (కంప్యూటర్ సైన్స్), ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్), ఈఈఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్) బ్రాంచ్‌లు పరిచయం చేస్తున్నారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 సీట్లు కేటాయించారు. ఇప్పటికే ఎంసెట్ -2013 అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీ లన పూర్తయింది. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియా మొదలైంది. వర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో ఇంజినీరింగ్ కళాశాల, ఎంజీయూను ఎంపిక చేసుకోవచ్చు. ఈ మేరకు నూతన కళాశాల కోడ్‌ను కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో చేర్చారు. ఇంజినీరింగ్ కోర్సును పానగల్ క్యాంపస్‌లో నడిపిస్తారు.
గొప్ప పురోగతి...
రాష్ట్రంలో 38 యూనివర్సిటీలున్నాయి. ఉస్మానియా, కాకతీయ, యోగి వేమన యూనివర్సిటీల్లో మాత్రమే ఇంజినీరింగ్ విద్యను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని వర్సిటీలకు 50, 60 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఆయా యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ విద్య అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఎంజీయూ ఏర్పాటైన ఐదేళ్ల కాలంలోనే ఇంజినీరింగ్ విద్య అందించే అవకాశం దక్కడం శుభ పరిణామం. ఎంజీయూతోపాటే తెలంగాణ, పాలమూరు, శాతవాహన వర్సిటీలు ఏర్పాటయ్యాయి.
ఇంజినీరింగ్ కోర్సు ఆఫర్ చేయాలన్న డిమాండ్ ఆ వర్సిటీల నుంచి వచ్చింది. ఈ విషయాన్ని ఎంజీయూ వైస్‌చాన్సలర్ కట్టా నర్సిం హారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంజీయూలో ఇప్పటికే భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు విద్యార్థులకు సరిపడా భవనం ఉంది. ఈ సబ్జెక్టులు బోధించే ప్రొఫెసర్లకు కొరత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెట్టడం పెద్ద కష్టం కాదని సర్కారు భావించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్య అందించడానికి సుముఖత తెలిపింది. ఎంజీయూకు ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణకు అనుమతి రావడం పట్ల నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఎంజీయూలోనూ.. ఇంజినీరింగ్ విద్య
Published Wed, Sep 4 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement