electronics and communication
-
రష్మిక ఫేక్ వీడియో : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి రెడ్ సిగ్నల్
న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్‌ఫేక్‌లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్లో మరోసారి గుర్తు చేసింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే మూడేళ్ల దాకా జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. ప్రభుత్వం, లేదా బాధిత వ్యక్తులు కోరిన వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్‌కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి. ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. అలాగే అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇవ్వడం తోపాటు ఇలాంటి ఫేక్ వీడియోపై సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
స్టార్టప్‌ల కోసం ‘సమృధ్’ కార్యక్రమం
న్యూఢిల్లీ: దేశీయంగా 300 పైచిలుకు ఐటీ స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) తాజాగా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. స్టార్టప్ యాక్సెలరేటర్ ఆఫ్ మెయిటీ ఫర్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ (సమృధ్) పేరిట బుధవారం దీన్ని ఆవిష్కరించింది. సిలికాన్ వేలీకి చెందిన వైకాంబినేటర్ తరహా యాక్సిలరేటర్గా దీన్ని రూపొందించినట్లు మెయిటీ ప్రత్యేక కార్యదర్శి జ్యోతి ఆరోరా తెలిపారు. దీనికి ఎంపికైన అంకుర సంస్థల్లో కనీసం 100 స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమృధ్ కింద స్టార్టప్‌లకు సీడ్ ఫండింగ్ రూపంలో నిధులపరమైన తోడ్పాటు, మార్గదర్శకత్వం, మార్కెట్లోకి విస్తరించేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ మొదలైనవి లభిస్తాయి. ఎంపికైన అంకుర సంస్థలకు ఈ పథకం కింద మెయిటీ రూ. 40 లక్షల దాకా సీడ్ ఫండ్, ఆరు నెలల పాటు మెంటార్షిప్ అందిస్తుంది. స్టార్టప్‌లకు నిధుల కొరత పెద్ద సమస్య కాదని, ఐడియాను ఉత్పత్తిగా మార్చే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు తగు మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
హైదరాబాద్‌లో ప్రి సర్టిఫికేషన్, ట్రైనింగ్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఉన్న భౌగోళిక అనుకూలత దృష్ట్యా హైదరాబాద్‌లో ప్రి సర్టిఫికేషన్, ట్రైనింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) డైరెక్టర్ డాక్టర్ రెజీ మథాయ్ ప్రకటించారు. గతేడాది రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విభాగం, ఏఆర్ఏఐ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రెజీ నేతృత్వంలోని ఏఆర్ఏఐ బృందం రెండురోజుల పర్యటనకుగాను శనివారం రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఈవీ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి నేతృత్వంలోని అధికారులు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ ప్రతినిధులు ఏఆర్ఏఐ బృందంతో టీ వర్క్స్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రి సర్టిఫికేషన్, ట్రెయినింగ్ ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన వసతుల కోసం రావిర్యాలలోని ‘ఈ సిటీ’ని కూడా ఏఆర్ఏఐ బృందం సందర్శించింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనరంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతోందని, ప్రిసర్టిఫికేషన్, టెస్టింగ్ ల్యాబ్ వల్ల కొత్త యూనిట్లు ఏర్పాటు చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రెజీ మథాయ్ పేర్కొన్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆవిష్కరించిన ఈ పాలసీ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని, ప్రిసర్టిఫికేషన్ ల్యాబ్ రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తుందని సుజయ్ వెల్లడించారు. కొత్తగా రెండు ఈవీ పార్కులు, టీ వర్క్స్, టీ హబ్ తదితరాలతో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను భారీగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఆర్ఏఐకి ఆటోమోటివ్ రంగంలో పరిశోధన, అభివృద్ధి సంస్థగా ప్రాముఖ్యత ఉంది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఏఆర్ఏఐకి చెన్నైలోనూ ప్రాంతీయ కార్యాలయం ఉంది. -
పెట్టుబడులతో రండి.. ప్రోత్సాహకాలు పొందండి
సాక్షి, అమరావతి: కేంద్రం తరహాలోనే ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టి 1,000 మందికి ఉపాధి కల్పించే సంస్థలకు పదేళ్లపాటు అమ్మకాలపై ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. 2020–21ని బేస్ సంవత్సరంగా పరిగణించి అమ్మకాలను లెక్కిస్తారు. రూ.500 కోట్ల పెట్టుబడి.. 4,000 మందికిపైగా ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు ఆయా పెట్టుబడుల ఆధారంగా మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నారు. త్వరలో విడుదల చేయనున్న ఐటీ–ఎలక్ట్రానిక్స్ పాలసీ సందర్భంగా ఈ పీఎల్ఐ స్కీంను కూడా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్‌కు వివరించామని, ఆయన కొన్ని సూచనలు చేశారని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. వాటిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే నూతన పాలసీని విడుదల చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీఎల్ఐ స్కీం కింద దేశంలో పెట్టుబడులు పెట్టే సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేలా ఈ నూతన విధానం రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాగా, వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ 100 బిలియన్ డాలర్ల నుంచి 400 బిలియన్ డాలర్లకు చేరుతుందని.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో పీఎల్ఐ స్కీం ప్రవేశపెట్టనున్నట్లు ఈ మధ్య కలిసిన జపాన్ ప్రతినిధి బృందానికి సీఎం వైఎస్ జగన్ వివరించారు. చదవండి: (ఆర్టీసీ బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు) -
సివిల్స్ లక్ష్యం.. నా చిన్ననాటి కల
పశ్చిమ గోదావరిలోని తాళ్లపూడి మండలం అన్నదేవర పేట నా స్వస్థలం. గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న కుటుంబం మాది. నాన్న సత్యనారాయణ వరప్రసాద్ రైతు. అమ్మ ఝాన్సీ రమాదేవి గృహిణి. పాఠశాల విద్యాభ్యాసం రాజమండ్రిలోనే సాగింది. ఇంటర్మీడియెట్ వైజాగ్‌లో పూర్తి చేశాను. భీమవరంలోని ఓ కళాశాలలో 2012లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. చదువులో చురుగ్గా: చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్నా. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రయత్నిస్తా. అలా అని నిత్యం పుస్తకాలకే పరిమితమై పోలేదు. ఇంట్లో వాళ్లతో సరదాగా గడుపుతాను. పదోతరగతిలో 88 శాతం మార్కులు సాధించా. ఇంటర్మీడియెట్ 93 శాతం, బీటెక్‌లో 78 శాతం మార్కులు సొంతం చేసుకున్నా. నా పాఠశాల రోజుల్లో రాజమండ్రిలో రామకృష్ణమఠం నిర్వహించే క్విజ్, చర్చలు, గ్రూప్ డిస్కషన్ పోటీల్లో పాల్గొన్నాను. సివిల్స్ నా చిన్ననాటి కల సివిల్స్ సాధించాలనేది నా చిన్ననాటి కల. స్కూల్ డేస్‌లోనే సివిల్స్‌పై అవగాహన వచ్చేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. మా మామయ్యలు కూడా ప్రభుత్వ సర్వీసుల్లోనే పనిచేస్తున్నారు. వారి గెడైన్స్తోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సివిల్స్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. తొలిసారి ఇంటర్వ్యూ చేజారింది! బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. హైదరాబాద్‌లోనే కోచింగ్ తీసుకున్నాను. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2013లో తొలిసారిగా ప్రయత్నించాను. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించా. కానీ ఇంటర్వ్యూలో విఫలమయ్యా. ఇంటర్వ్యూ సరళిపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడమే దానికి కారణం. అయినా నిరుత్సాహ పడకుండా యథావిధిగా మరో ప్రయత్నానికి ప్రిపరేషన్ ప్రారంభించాను. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లోనే ఉంటూ ప్రిపేరయ్యాను. మరింత సన్నద్ధంగా! తొలిసారి సివిల్స్ రాసినప్పుడు ఇంటర్వ్యూలో అవకాశం చేజారిందనే బాధ ఉన్నప్పటికీ ప్రిలిమ్స్, మెయిన్స్ విజయాల స్ఫూర్తిగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాను. చేసిన పొరపాట్లను విశ్లేషించుకుని మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యా. మెయిన్స్‌లో కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. గత ఇంటర్వ్యూలో ప్రశ్నలు- జవాబులుగా ఇంటర్వ్యూ సాగింది. కానీ నిజానికి సివిల్స్ ఇంటర్వ్యూ అని కాకుండా సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ అంటారు. మొదటిసారి ఇంటర్వ్యూలో నా పర్సనాలిటీని పూర్తిగా వ్యక్తం చేయలేకపోయాను. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంటర్వ్యూను ఎదుర్కొన్నాను. కానీ రెండోసారి ఇంటరాక్టివ్‌గా సమాధానాలిచ్చాను. నేను చెప్పిన సమాధానాల్లోంచే ప్రశ్నలు అడగడం ద్వారా ఇంటర్వ్యూ మంచి డిస్కషన్లా జరిగింది. ఓపిక అవసరం! సివిల్స్‌లో విజయం సాధించాలంటే ప్రధానంగా ఓపిక ఉండాలి. కష్టపడి చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో నిర్వహించే సివిల్స్‌లో ఎక్కడ అపజయం పాలైనా మొదట్నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సిందే. కాబట్టి ఏ దశలోనూ నిరుత్సాహ పడకుండా ముందుకెళ్లాలి. -
ఎంజీయూలోనూ.. ఇంజినీరింగ్ విద్య
సాక్షి, నల్లగొండ: విద్యార్థులకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ చదువుల వనంగా మారనుంది. మరిన్ని ఉన్నత చదువులకు కేరాఫ్‌గా నిలువనుంది. ఇప్పటికే మూడు విభాగాల్లో అందిస్తున్న పలు కోర్సులకు తోడు తాజాగా ఇంజినీరింగ్ చేరింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి వస్తుంది. మూడు బ్రాంచ్‌లల్లో సీట్లు కేటాయిస్తూ ఉన్నత విద్యాశాఖ నుంచి మంగళవారం క్లియరెన్స్ వచ్చింది. మూడు బ్రాంచ్‌లతో ప్రారంభం.. 2013-14 విద్యా సంవత్సరంలో మూడు బ్రాంచ్‌లతో ఇంజినీరింగ్ విద్యను ప్రారంభిస్తారు. ప్రస్తుత పరిస్థితులో విద్యార్థులు ఆసక్తి కనబర్చుతున్న సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్), ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్), ఈఈఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్) బ్రాంచ్‌లు పరిచయం చేస్తున్నారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 సీట్లు కేటాయించారు. ఇప్పటికే ఎంసెట్ -2013 అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీ లన పూర్తయింది. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియా మొదలైంది. వర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో ఇంజినీరింగ్ కళాశాల, ఎంజీయూను ఎంపిక చేసుకోవచ్చు. ఈ మేరకు నూతన కళాశాల కోడ్‌ను కౌన్సెలింగ్ వెబ్సైట్లో చేర్చారు. ఇంజినీరింగ్ కోర్సును పానగల్ క్యాంపస్‌లో నడిపిస్తారు. గొప్ప పురోగతి... రాష్ట్రంలో 38 యూనివర్సిటీలున్నాయి. ఉస్మానియా, కాకతీయ, యోగి వేమన యూనివర్సిటీల్లో మాత్రమే ఇంజినీరింగ్ విద్యను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని వర్సిటీలకు 50, 60 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఆయా యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ విద్య అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఎంజీయూ ఏర్పాటైన ఐదేళ్ల కాలంలోనే ఇంజినీరింగ్ విద్య అందించే అవకాశం దక్కడం శుభ పరిణామం. ఎంజీయూతోపాటే తెలంగాణ, పాలమూరు, శాతవాహన వర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇంజినీరింగ్ కోర్సు ఆఫర్ చేయాలన్న డిమాండ్ ఆ వర్సిటీల నుంచి వచ్చింది. ఈ విషయాన్ని ఎంజీయూ వైస్‌చాన్సలర్ కట్టా నర్సిం హారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంజీయూలో ఇప్పటికే భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు విద్యార్థులకు సరిపడా భవనం ఉంది. ఈ సబ్జెక్టులు బోధించే ప్రొఫెసర్లకు కొరత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెట్టడం పెద్ద కష్టం కాదని సర్కారు భావించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్య అందించడానికి సుముఖత తెలిపింది. ఎంజీయూకు ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణకు అనుమతి రావడం పట్ల నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.