పశ్చిమ గోదావరిలోని తాళ్లపూడి మండలం అన్నదేవర పేట నా స్వస్థలం. గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న కుటుంబం మాది. నాన్న సత్యనారాయణ వరప్రసాద్ రైతు. అమ్మ ఝాన్సీ రమాదేవి గృహిణి. పాఠశాల విద్యాభ్యాసం రాజమండ్రిలోనే సాగింది. ఇంటర్మీడియెట్ వైజాగ్‌లో పూర్తి చేశాను. భీమవరంలోని ఓ కళాశాలలో 2012లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను.
చదువులో చురుగ్గా:
చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్నా. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రయత్నిస్తా. అలా అని నిత్యం పుస్తకాలకే పరిమితమై పోలేదు. ఇంట్లో వాళ్లతో సరదాగా గడుపుతాను. పదోతరగతిలో 88 శాతం మార్కులు సాధించా. ఇంటర్మీడియెట్ 93 శాతం, బీటెక్‌లో 78 శాతం మార్కులు సొంతం చేసుకున్నా. నా పాఠశాల రోజుల్లో రాజమండ్రిలో రామకృష్ణమఠం నిర్వహించే క్విజ్, చర్చలు, గ్రూప్ డిస్కషన్ పోటీల్లో పాల్గొన్నాను.
సివిల్స్ నా చిన్ననాటి కల
సివిల్స్ సాధించాలనేది నా చిన్ననాటి కల. స్కూల్ డేస్‌లోనే సివిల్స్‌పై అవగాహన వచ్చేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. మా మామయ్యలు కూడా ప్రభుత్వ సర్వీసుల్లోనే పనిచేస్తున్నారు. వారి గెడైన్స్‌తోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సివిల్స్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నాను.
తొలిసారి ఇంటర్వ్యూ చేజారింది!
బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. హైదరాబాద్‌లోనే కోచింగ్ తీసుకున్నాను. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2013లో తొలిసారిగా ప్రయత్నించాను. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించా. కానీ ఇంటర్వ్యూలో విఫలమయ్యా. ఇంటర్వ్యూ సరళిపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడమే దానికి కారణం. అయినా నిరుత్సాహ పడకుండా యథావిధిగా మరో ప్రయత్నానికి ప్రిపరేషన్ ప్రారంభించాను. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లోనే ఉంటూ ప్రిపేరయ్యాను.
మరింత సన్నద్ధంగా!
తొలిసారి సివిల్స్ రాసినప్పుడు ఇంటర్వ్యూలో అవకాశం చేజారిందనే బాధ ఉన్నప్పటికీ ప్రిలిమ్స్, మెయిన్స్ విజయాల స్ఫూర్తిగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాను. చేసిన పొరపాట్లను విశ్లేషించుకుని మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యా. మెయిన్స్‌లో కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. గత ఇంటర్వ్యూలో ప్రశ్నలు- జవాబులుగా ఇంటర్వ్యూ సాగింది. కానీ నిజానికి సివిల్స్ ఇంటర్వ్యూ అని కాకుండా సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ అంటారు. మొదటిసారి ఇంటర్వ్యూలో నా పర్సనాలిటీని పూర్తిగా వ్యక్తం చేయలేకపోయాను. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంటర్వ్యూను ఎదుర్కొన్నాను. కానీ రెండోసారి ఇంటరాక్టివ్‌గా సమాధానాలిచ్చాను. నేను చెప్పిన సమాధానాల్లోంచే ప్రశ్నలు అడగడం ద్వారా ఇంటర్వ్యూ మంచి డిస్కషన్‌లా జరిగింది.
ఓపిక అవసరం!
సివిల్స్‌లో విజయం సాధించాలంటే ప్రధానంగా ఓపిక ఉండాలి. కష్టపడి చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో నిర్వహించే సివిల్స్‌లో ఎక్కడ అపజయం పాలైనా మొదట్నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సిందే. కాబట్టి ఏ దశలోనూ నిరుత్సాహ పడకుండా ముందుకెళ్లాలి.
సివిల్స్ లక్ష్యం.. నా చిన్ననాటి కల
Published Thu, Jul 9 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement