న్యూఢిల్లీ: దేశీయంగా 300 పైచిలుకు ఐటీ స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) తాజాగా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. స్టార్టప్ యాక్సెలరేటర్ ఆఫ్ మెయిటీ ఫర్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్, డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ (సమృధ్) పేరిట బుధవారం దీన్ని ఆవిష్కరించింది. సిలికాన్ వేలీకి చెందిన వైకాంబినేటర్ తరహా యాక్సిలరేటర్‌గా దీన్ని రూపొందించినట్లు మెయిటీ ప్రత్యేక కార్యదర్శి జ్యోతి ఆరోరా తెలిపారు.
దీనికి ఎంపికైన అంకుర సంస్థల్లో కనీసం 100 స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమృధ్ కింద స్టార్టప్‌లకు సీడ్ ఫండింగ్ రూపంలో నిధులపరమైన తోడ్పాటు, మార్గదర్శకత్వం, మార్కెట్లోకి విస్తరించేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ మొదలైనవి లభిస్తాయి. ఎంపికైన అంకుర సంస్థలకు ఈ పథకం కింద మెయిటీ రూ. 40 లక్షల దాకా సీడ్ ఫండ్, ఆరు నెలల పాటు మెంటార్‌షిప్ అందిస్తుంది. స్టార్టప్‌లకు నిధుల కొరత పెద్ద సమస్య కాదని, ఐడియాను ఉత్పత్తిగా మార్చే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు తగు మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment