ఆలోచనలు సాగిస్తున్న ప్రభుత్వం
విశాఖలో జరిగే విద్యాసదస్సులో దీనిపై చర్చ
హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో సంస్కరణల దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, పరిశ్రమలకు అవసరమైన రీతిలో నిపుణులను తయారుచేయడం లక్ష్యంగా సంస్కరణలపై కసరత్తు సాగిస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు చేయడానికి అధికారులు కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కాలేజీల నుంచి బయటకు వచ్చే ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణత ఉండేలా తీర్చిదిద్దాలన్నది దీని సారాంశం. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో సబ్జెక్టులపై అవగాహన కలిగించేలా కాలేజీల్లో బోధనాభ్యసనాన్ని మొదటి మూడేళ్లకు కుదించనున్నారు. నాలుగో ఏడాది పూర్తిగా అప్రెంటిస్‌షిప్‌ను అమలుచేయనున్నారు. ఇందుకోసం కాలేజీలను పరిశ్రమలకు అనుసంధానిస్తారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసి బయటకు వచ్చే విద్యార్థి తరువాత అప్రెంటిస్‌షిప్ కోసం ఆయా పరిశ్రమల చుట్టూ తిరుగుతున్నారు.
అవకాశం లేని వారు అదీ చేయడం లేదు. దీన్ని నివారించేందుకు విద్యార్థులు కాలేజీల్లో ఉండగానే అప్రెంటిస్‌షిప్‌ను పూర్తిచేయించాలన్నది ఉద్దేశం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వీరిని తయారుచేస్తే కోర్సు పూర్తయ్యేనాటికి ఆయా పరిశ్రమల్లోనే వారికి ఉద్యోగాలు దొరకడమో, లేకుంటే ఆ అనుభవంతో వేరే చోట్ల అవకాశాలు దక్కించుకోగలుగుతారని భావిస్తున్నారు. విశాఖపట్నంలో యూనివర్సిటీల ఉపకులపతులు, విద్యారంగ నిపుణులు, ఇతర ప్రముఖులతో త్వరలో నిర్వహించబోయే సదస్సు ఎజెండాలో దీన్ని ముఖ్యాంశంగా చేరుస్తున్నారు. దీనిపై కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని విద్యాశాఖవర్గాలు వివరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా ఏటా లక్షకు పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు.
ఇంజనీరింగ్ చివరి ఏడాది అప్రెంటిస్‌షిప్!
Published Sun, Oct 5 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement