ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేదు! | Not interested in engineering! | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేదు!

Published Thu, Jan 28 2016 8:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేదు!

ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేదు!

రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై తగ్గుతున్న ఆదరణ


♦ ఆరేళ్లుగా కన్వీనర్ కోటాలో తగ్గుతున్న ప్రవేశాలు
♦ 2010లో 69 వేలకుపైగా భర్తీ.. ఈసారి 56 వేలకే పరిమితం
♦ వచ్చే విద్యా సంవత్సరంలోనూ భారీగా తగ్గనున్న ప్రవేశాలు
♦ సీట్లను తగ్గించేందుకు ఏఐసీటీఈ చర్యలు
♦ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్.. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజీ కోర్సు. ఏ తల్లిదండ్రులను అడిగినా తమ పిల్లాడిని ఇంజనీరింగ్ చదివిస్తామని.. ఏ విద్యార్థిని అడిగినా వారి టార్గెట్ ఒక్కటే ఇంజనీర్ అవుతామని చెప్పేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ అంతకంతకూ తగ్గిపోతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతోంది. గడిచిన ఐదేళ్లలో ఇంజ నీరింగ్‌లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమం గా తగ్గుతూ వస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీలు.. అధ్యాపకులు లేకపోయినా కాలేజీలను కొనసాగిస్తున ్న యాజమాన్యాల వైఖరితో ఇంజనీరింగ్ చేసినా ప్రయోజనం లేకుండా పోతోందన్న నిరాసక్తత తల్లిదండ్రుల్లోనూ.. విద్యార్థుల్లోనూ పెరుగుతోంది.

 నాణ్యతా ప్రమాణాలపై దృష్టి
 రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్రం కూడా ఇంజనీరింగ్‌లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తోంది. ఏటా 40 శాతం మేర ఖాళీగా ఉంటోన్న ఇంజనీరింగ్ సీట్లను తగ్గించే దిశగా కసరత్తు చేస్తోంది. దీంతోపాటు ఇష్టారాజ్యంగా అనుమతులివ్వొద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ సహస్రబుద్దే ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ముగిసిన తర్వాత(గత డిసెంబర్ నాటికి) సీట్లు మిగిలిపోయిన 556 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు 1,422 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి.

మరోవైపు నాణ్యతా ప్రమాణాలపై గతంలో చూసీచూడనట్లు వ్యవహరించిన రాష్ట్ర అధికారులు ఈ విద్యా సంవత్సరం నుంచి పక్కా చర్యలపై దృష్టిసారించారు. మొత్తంగా అటు దేశవ్యాప్తంగా.. ఇటు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కుదింపుపై ప్రభుత్వాలు పక్కా చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కాలేజీల అనుమతుల ప్రక్రియను పక్కాగా చేపట్టాలని నిర్ణయించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో(2016-17) కాలేజీల రద్దు, కోర్సుల రద్దు, సీట్ల తగ్గింపు ప్రక్రియపై జేఎన్‌టీయూ ఈసారి ముందుగానే చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా కాలేజీల రద్దు, కోర్సుల రద్దు, సీట్ల తగ్గింపు కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఏఐసీటీఈ అనుమతుల తర్వాత జేఎన్‌టీయూ చేపట్టాల్సిన అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం ముందుగానే అఫిలియేషన్ ప్రొసీజర్ అండ్ రెగ్యులేషన్స్-2016ను సిద్ధం చేసింది.

 కాలేజీల తీరే కారణం..
 ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకుని విద్యను గాలికొదిలేసిన యాజమాన్యాల వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీలు విద్యా బోధనపై దృష్టి పెట్టలేదు. ఫీజుల కోసమే కాలేజీలను నడుపుతూ ఇంజనీరింగ్ విద్యను వ్యాపారంగా మార్చుకున్నాయి. అధ్యాపకులను నియమించకుండా, బీటెక్ వారితోనే మమా అనిపించేస్తూ ఇంజనీరింగ్ విద్యను భ్రష్టు పట్టించాయి. దీంతో అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ పడిపోయాయి. పేరున్న కాలేజీల్లో తప్ప మిగతా కాలేజీల్లో రిక్రూట్‌మెంట్ జరగడంలేదు.

 

దీంతో ఇంజనీరింగ్ చేసినా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. మార్కెటింగ్‌రంగంలో నెలకు రూ.5 వేలు, రూ.10 వేలకు పనిచేయాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ఏటా 90 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా 15 వేల మందికి కూడా తగిన ఉద్యోగం లభించడం లేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల వల్ల విద్యార్థులకు సబ్జెక్టుతోపాటు భాషా నైపుణ్యాలు లేకపోవడమే దీనికి కారణం. యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్, చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంగ్లిష్, కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో వెనుకబడి ఉన్నట్లు స్పష్టమైంది.
 
 తగ్గిపోతున్న సీట్లు...
 ఆరేళ్ల కిందట(2010-11) కన్వీనర్ కోటాలో 69,690 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరితే.. గత ఏడాది (2014-15) కన్వీనర్ కోటాలో 57,925 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. ఇక 2015-16లో అయితే 56,017 మంది విద్యార్థులే కాలేజీల్లో చేశారు. విచిత్రం ఏంటంటే ఆరేళ్ల కిందట కన్వీనర్ కోటాలో తక్కువ సీట్లు ఉన్నా ఎక్కువ మంది విద్యార్థులు చేశారు. (87,793 సీట్లలో 69,690 మంది చేరారు) ఆ తర్వాత నుంచి సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నా.. కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

 

ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఇంజనీరింగ్‌లో నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించిన కారణంగా కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా సీట్లు రద్దు చేసుకోగా, మరికొన్నింటిలో నాణ్యతా ప్రమాణాల మేరకు జేఎన్‌టీయూహెచ్ సీట్లకు అనుమతిచ్చింది. దీంతో 2015-16లో సీట్ల సంఖ్య తగ్గింది. అయినా వాటిల్లో చేరే వారు లేకుండా పోయారు. కన్వీనర్ కోటాలో 86,313 సీట్లకు అనుమతి ఇచ్చినా 56,017 మంది మాత్రమే చేరారు. 30 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement