ఇంజనీరింగ్‌పై నో ఇంట్రస్ట్‌! | Students are not interested in engineering education in the state | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌పై నో ఇంట్రస్ట్‌!

Published Sat, Feb 15 2020 1:51 AM | Last Updated on Sat, Feb 15 2020 1:51 AM

Students are not interested in engineering education in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. పలు కోర్సులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరడానికి నిరాసక్తత చూపుతున్నారు. ఇక ఇటు యాజమాన్యాలే కాలేజీల మూసివేత, కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకుంటుండగా, మరోవైపు తగిన వసతులు, ఫ్యాకల్టీ లేక అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు వివిధ కోర్సుల్లో సీట్లకు కోత పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా 4 వేల నుంచి 7 వేల వరకు క్రమంగా సీట్లకు కోత పడుతోంది. దీంతో అనుబంధ గుర్తింపు లభిస్తున్న సీట్ల సంఖ్య తగ్గుతోంది. అనుమతించినా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో దాదాపు 11 వేల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఉన్నత విద్యా మండలి తేల్చిన తాజా పూర్తి స్థాయి లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

నాలుగేళ్లలో 33 కాలేజీలు మూత.. 
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో 2016 నుంచి 2018 వరకు ప్రవేశాల్లో పెద్దగా తగ్గుదల లేనప్పటికీ 2018 నుంచి 2019కి వచ్చేసరికి మాత్రం భారీగానే ప్రవేశాలు తగ్గిపోయాయి. కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా కలుపుకొని 2016 సంవత్సరంలో రాష్ట్రంలోని 220 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,04,758 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. అదే 2019 సంవత్సరం వచ్చేసరికి 187 కాలేజీల్లోని 93,790 సీట్లకే అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. అంటే నాలుగేళ్లలో 33 కాలేజీలు మూతపడగా, 10,968 సీట్లు రద్దయ్యాయి. మరోవైపు విద్యార్థులు చేరకపోవడంతో ప్రవేశాలు తగ్గిపోయాయి. 2016లో 73,686 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరగా, 2019లో 62,744 మంది మాత్రమే ఇంజనీరింగ్‌లో చేరారు. ఇందులో కన్వీనర్‌ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా తగ్గింది. 2016లో 54,064 నుంచి 46,134కు పడిపోయింది. గడిచిన రెండేళ్ల ప్రవేశాలను పరిశీలిస్తే మాత్రం మేనేజ్‌మెంట్‌ కోటాలోనూ చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. 

డిమాండ్‌ లేని కోర్సులకు దూరం.. 
ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీల్లోనే చేర్చేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రమాణాలు పాటించని కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. విద్యార్థులు కూడా తమ ఆలోచనను మార్చుకొని టైంపాస్‌ కోసం ఏదో ఓ కోర్సులో చేరాలనుకోవడం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు లేకపోతే వాటిల్లో చేరేందుకే అస్సలు ఇష్టపడటం లేదని వారంటున్నారు. ఇలాంటి కారణాలతోనే ఏటా 8 నుంచి 15 వరకు కాలేజీలు మూత పడుతూనే ఉన్నాయి.

ఈసారి కూడా 10 కాలేజీలు మూసివేత కోసం జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని కాలేజీలు డిమాండ్‌ లేని కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈసారి మరో 7 వేల వరకు సీట్లు తగ్గిపోవచ్చు. అయితే మార్కెట్‌లో డిమాండున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డాటా, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

అయితే అవి ఇప్పటివరకు అన్ని కాలేజీల్లో లేవు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి మాత్రం జేఎన్‌టీయూలోని అన్ని కాలేజీల్లో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో 3 వేల వరకు సీట్లలో ఆయా కోర్సులకు అనుమతి ఇచ్చే అవకాశముంది. అయినా 2020 ప్రవేశాల్లో 4 వేల వరకు సీట్లు తగ్గే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరోవైపు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రవేశాల్లో తగ్గుదలే తప్ప పెరుగుదల కనిపించడం లేదు. 

ఇంజనీరింగ్‌కు కెమిస్ట్రీ తప్పనిసరి కాదు
ఇంజనీరింగ్‌ చదివేందుకు కెమిస్ట్రీని తప్పనిసరి సబ్జెక్టుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌లో 2021–22 విద్యా ఏడాది నుంచి అమల్లోకి తేనుంది. 2020–21 విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం ఇప్పటికే జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్ష గత జనవరిలో జరిగినందున వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత జేఈఈ మెయిన్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 2020–21 విద్యా ఏడాదిలో ఇది అమలు చేసే అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాము 2020–21 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తామని ఏఐసీటీఈని కోరాయి. దీంతో ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసిన 2020–21 అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌ బుక్‌లోనూ మార్పులు చేసింది. దీంతో మనరాష్ట్రంలో వేలమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.  

తప్పిన తప్పనిసరి కెమిస్ట్రీ.. 
ప్రస్తుతం ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. వాటినే పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులకు మెటీరియల్స్‌ కాంపొజిషన్‌లో మాత్రమే కెమిస్ట్రీ అవసరం అవుతుందని, అదీ ప్రాథమిక అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బీఈ/బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనుకునే వారికి కెమిస్ట్రీ అవసరం లేదని పేర్కొంటున్నారు. అందుకనుగుణంగానే బీఈ/ బీటెక్‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివుండాలని, వాటితో పాటు కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్‌ ఒకేషనల్‌ సబ్జెక్టు/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌/ అగ్రికల్చర్‌/ ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌ను మూడవ సబ్జెక్టుగా చదివిన వారు కూడా అర్హులేనని అప్రూవల్‌ ప్రొసెస్‌ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేసింది. దీంతో ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు పైన పేర్కొన్న సబ్జెక్టులు చదివిన వారు కూడా బీటెక్‌ చేసేందుకు అర్హులే. కాగా, శనివారం జరగనున్న ఎంసెట్‌ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.   

నేడు ఎంసెట్‌ కమిటీ సమావేశం 
సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ కమిటీ సమావేశం ఈ నెల 15న నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. శనివారం ఈ సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ఎంసెట్‌ నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష ఫీజు, అర్హతలకు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామన్నారు. ఈనెల 19న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులకు ఫీజు రాయితీ ఇచ్చే అంశాన్ని ఖరారు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement