‘టాప్’ లేచిపోతోంది | Confusion in counselling of Engineering education | Sakshi
Sakshi News home page

‘టాప్’ లేచిపోతోంది

Published Fri, Jul 10 2015 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

‘టాప్’ లేచిపోతోంది

‘టాప్’ లేచిపోతోంది

గందరగోళంగా ఇంజనీరింగ్ విద్య
ఇతర రాష్ట్రాల బాట పడుతున్న టాపర్స్
ఇప్పటికే రెండుసార్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా
ఎప్పుడు చేపడతారో స్పష్టత కరువు
తప్పెవరిదైనా బలవుతున్నది విద్యార్థులే
వేలాదిగా మైగ్రేషన్ సర్టిఫికెట్లు తీసుకున్న వైనం
ఈసారీ ఆగస్టులో తరగతుల ప్రారంభం అనుమానమే
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య గందరగోళంగా మారింది. దీంతో విద్యార్థులు డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు. కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం కారణంగా ఎంసెట్‌లో టాపర్లు జేఈఈ ర్యాంక్ ఆధారంగా దూరప్రాంతమైనా సరే ఎన్‌ఐటీల్లో చేరిపోతున్నారు. ఎంసెట్‌లో 2,000 లోపు ర్యాంక్ సాధించి జేఈఈలో 5 వేల లోపు ర్యాంక్ సాధించిన విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో ఎన్‌ఐటీలు, జేఈఈ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహించే ఇతర రాష్ట్రాల కాలేజీల్లో చేరిపోతున్నారు. ఇక్కడ కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగానే దాదాపు 5 వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పట్టారు. మరో 5 వేల మంది దాకా డీమ్డ్ యూనివర్సిటీల్లో చేరిపోయారు. చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 62 వేల మందిలో 50 వేల మంది ఇక్కడ చేరడం గగనమే. ఏటా ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. కాలేజీ యాజమాన్యాల ఇష్టారాజ్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇంజనీరింగ్ ప్రవేశాల్లో జాప్యం జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, తెలంగాణ విద్యా మండలి గొడవల కారణంగా గతేడాది ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు విద్యార్థులకు రెండో దశ కౌన్సెలింగ్ లేకుండా పోయింది. ఫలితంగా ఇష్టంలేని బ్రాంచీల్లో విద్యార్థులు చేరాల్సి వచ్చింది. కాలేజీ, కోర్సును మార్చుకునే అవకాశం విద్యార్థులకు లేకుండా పోయింది. ఇక ఈసారి కాలేజీల అఫిలియేషన్ల గొడవతో గందరగోళం నెలకొంది.
 
 అసలేం జరుగుతోంది?: ఈసారి ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా 1,28,162 మంది పరీక్ష రాశారు. అందులో 90,556 మంది విద్యార్థులే(70.65 శాతం) అర్హత సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 62,777 మంది హాజరయ్యారు. మరోవైపు ఎంసెట్‌లో అర్హత సాధించినా 12 వేల మంది ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాలేదు. అందులో కనీసంగా ఆరేడు వేల మంది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. వారికి ఇంతవరకు ర్యాంకులు ఇవ్వలేదు. ఈలోగా జేఎన్‌టీయూహెచ్ పరిధిలో కాలేజీల అఫిలియేషన్ల గందరగోళం మొదలైంది. 220 కాలేజీల్లో మొదట 76 వేల సీట్లకు జేఎన్‌టీయూ అనుబంధ గుర్తింపు ఇచ్చింది. చాలా కాలేజీల్లో పలు కోర్సులకు కోత పెట్టింది. ఆ తరువాత కాలేజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని వివిధ కాలే జీల్లో కోర్సులకు అనుమతించడంవల్ల మరో 18 వేల వరకు సీట్లు వచ్చాయి. మొత్తానికి సీట్ల సంఖ్య 90 వేలు దాటింది. కానీ కోర్సులకు కోతపడిన కాలేజీలు, అనుబంధ గుర్తింపును నిరాకరించిన 25 కాలేజీలు, అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోని మరో 45 కాలేజీలు, తమ కాలేజీల్లో అన్ని వసతులు ఉన్నా కోర్సులకు కోత పెట్టారని 50 కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి.
 
 గురువారమే విచారణను కోరలేదెందుకు?
 గతనెల 28వ తేదీన జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను, సీట్ల వివరాలను ప్రకటించింది. దీంతో వెంటనే ఉన్నత విద్యామండలి ఈ నెల 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. కాని కాలేజీలు కోర్టును ఆశ్రయించడంతో దానిని 8వ తేదీకి వాయిదా వేసింది. చివరకు అదీ వాయిదా పడింది. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌కు కోర్సులను రద్దు చేసే అధికారమే లేదని, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలు, సీట్లను కౌన్సెలింగ్‌లో పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. దాన్ని అమలు చేస్తే మరో 50 వేల సీట్లు వచ్చేవి. సకాలంలో ప్రవేశాలు పూర్తయ్యేవి. కాని ప్రభుత్వ ఆదేశాలతో జేఎన్‌టీయూహెచ్ డివిజన్ బెంచ్ అప్పీల్‌కు వెళ్లింది. మొదట లంచ్ మోషన్‌కు వెళ్లింది. అడ్మిట్ కాలేదు. దీంతో సాధారణంగానే బుధవారం అప్పీల్ పిటిషన్ వేసింది. గురువారం లిస్ట్‌లో ఉంది. కాని ప్రభుత్వం అర్జెన్సీ ఉందని, విచారించాలని గురువారం కోర్టును కోరలేదు. ముందుగా లంచ్ మోషన్‌కు వెళ్లిన జేఎన్‌టీయూహెచ్ గురువారంనాడు ఎందుకు త్వరగా విచారించాలని కోరలేదన్న ప్రశ్నపై సమాధానం లేకుండా పోయింది.
 
 విద్యార్థుల ప్రయోజనాలు చూడాలి
 ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాల కోసమే పనిచేయాలి. యాజమాన్యాల కోసం కాదు. సకాలంలో ప్రవేశాలు చేపట్టాలి. కోర్టు తీర్పు ఇచ్చాక కాలేజీల నాణ్యతపై మళ్లీ అప్పీల్‌కు వెళ్లడం సరికాదు. పారదర్శకత లేకుండా, గోప్యత ప్రదర్శిస్తే గందరగోళం తప్పదు.    
 - మధుసూదన్‌రెడ్డి,
     ఇంటర్ విద్య జేఏసీ కన్వీనర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement