‘విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి’
మండి(హిమాచల్‌ప్రదేశ్): దేశంలో ఇంజనీరింగ్ విద్యాసంస్థలు లెక్కకుమించి పుట్టుకురావడంతో సాంకేతిక విద్యలో నాణ్యత, ప్రమాణాలు దెబ్బతింటున్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆయా సంస్థల్లో సరైన మౌలిక సదుపాయాలూ ఉండడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం మండిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) స్నాతకోత్సవంలో పాల్గొనాల్సిన ఆయన హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోవడంతో వెళ్లలేకపోయారు. దీంతో సందేశాన్ని పంపారు. ఇటీవలి ఓ సర్వేలో ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితాలో భారత్‌లోని ఒక్క విద్యాసంస్థకూ ఉత్తమ ర్యాంకు లభించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోదగ్గ ఉన్నతవిద్యా సంస్థలు దేశంలో కొన్నే ఉన్నాయని పేర్కొన్నారు.