కొత్త ఆలోచనలకు స్వేచ్ఛ ఉండాలి
- అకడమిక్ ఐడియాలకు అడ్డుకట్ట వేయవద్దు
- రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: విద్యా రంగంలో కొత్త ఆలోచనలకు స్వేచ్ఛ ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కొత్త ఆలోచనలకు అడ్డుకట్ట వేసేలా తలుపు మూయవద్దని, ఆలోచనలు ఫలప్రదమయ్యే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. దేశంలో ఉన్నత విద్యను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు గుర్తింపును సాధించగలుగుతారని చెప్పారు. ‘ద ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్’ అనే పుస్తకానికి సంబంధించిన తొలి కాపీని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నుంచి ప్రణబ్ ముఖర్జీ స్వీకరించారు.
2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన కార్యకలాపాల ఆధారంగా ‘ద ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్’ పుస్తకాన్ని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ రూపొందించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను సందర్శించడం ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా రాష్ట్రపతి చెప్పారు. దేశంలోని ఐఐటీలు మొదలైన వాటి నుంచి బయటకు వచ్చిన ప్రతిభ అంతర్జాతీయ కంపెనీల కోసం పనిచేస్తోందని, దేశం కోసం శ్రమించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.