వారిని వ్యక్తిగతంగా కలవాలా?
పారిశ్రామికవేత్తలతో ప్రధాని, ఆర్థికమంత్రి భేటీలపై తన తాజా పుస్తకంలో ప్రణబ్ ప్రశ్న
న్యూఢిల్లీ: ‘భారత ప్రధానమంత్రి లేదా ఆర్థిక మంత్రి పారిశ్రామికవేత్తలను వ్యక్తిగతంగా కలవాలా?’.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వీయ అనుభవాలతో విడుదల చేసిన తాజా పుస్తకంలో ఈ ప్రశ్నను సంధించారు. అయితే ఈ ప్రశ్నను ఆయనే జవాబూ ఇచ్చేశారు. పారిశ్రామికవేత్తలతో తనకు వ్యక్తిగతంగా లేదా సమష్టిగా జరిగిన భేటీలు చాలా కీలకమైనవని చెప్పారు. ప్రణబ్ అనుభవాలతో రచించిన ‘ద టర్బులెంట్ ఇయర్స్: 1980-1996’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ గురువారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
ఈ పుస్తకంలో 1988-1991 మధ్య దేశంలో సామాజిక, రాజకీయ సంక్షోభ సమయంలో వీపీ సింగ్‌కు తనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన వివరించారు. రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా నియమితులైన వీపీ సింగ్ పారిశ్రామికవేత్తలతో వ్యక్తిగతంగా సమావేశం అయ్యేవారు కాదని, కానీ తాను ఆర్థికమంత్రి, వాణిజ్య మంత్రిగా ఉన్న సమయంలో వారితో వ్యక్తిగతంగా, సమష్టిగా సమావేశమయ్యే వాడినని, ఇది సంబంధిత రంగాల గురించి పూర్తి అవగాహన చాలా కీలకమని ఆయన తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో విభేదాల గురించి ప్రణబ్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ పదవి నుంచి మన్మోహన్ తప్పుకోవడంలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. తమ మధ్య వృత్తిపరమైన వైరుధ్యాలే తప్ప, మన్మోహన్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సాధించిన అతి పెద్ద విజయం ఏమిటంటే.. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడమే అని చెప్పారు. వీటి కారణంగానే మన దేశ వృద్ధిరేటు పెరిగిందని, మన ఆర్థిక వ్యవస్థ వాస్తవ సామర్థ్యాన్ని తెలుసుకునేలా చేశాయని చెప్పారు.