మండేకు నేతల ఘన నివాళి
* ప్రజానాయకుడిని కోల్పోయాం: రాష్ట్రపతి
* నిజమైన మాస్ లీడర్: ప్రధాని
* బీజేపీ ఆఫీసుకెళ్లి నివాళులర్పించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండేకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా వివిధ పార్టీల నేతలు ఘన నివాళి అర్పించారు. ఆయన్ను గొప్ప ప్రజా నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కొనియాడారు. నిరంతరం సామాన్యుల కోసం పనిచేసిన నాయకుడిని పోగొట్టుకోవడం బాధాకరమని రాష్ట్రపతి ప్రణబ్ తన సంతాప సందేశంలో పేర్కొనగా ముండే మరణం అందరికీ తీరని లోటని ఉప రాష్ట్రపతి అన్సారీ పేర్కొన్నారు. ముండే మరణం తనను షాక్‌కు గురిచేసిందని, ఆయన మరణంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నానని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన్ను నిజమైన మాస్ లీడర్‌గా అభివర్ణించారు. ముండే మరణం దేశానికి తీరని లోటని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు.
ముండే ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానంటూ సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కంటతడిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముండే కుటుంబానికి సంతాపం తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు ముండే మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచిన ముండే పార్థివదేహాన్ని అన్సారీ, మోడీ, రాహుల్ గాంధీ, ఎల్.కె. అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, అనంత్ కుమార్, హర్షవర్ధన్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, వీహెచ్‌పీ చీఫ్ అశోక్ సింఘాల్ తదితరులు కూడా ముండే పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని బీజేపీ ఆఫీసు నుంచి పూలతో అలంకరించిన సైనిక వాహనంలో ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబై తరలించారు.
వై.ఎస్. జగన్ సంతాపం...
గోపీనాథ్ ముండే ఆకస్మిక మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ముండే మృతికి సంతాపం తెలియజేశారు.
ముండే కు నివాళులర్పించిన కిషన్‌రెడ్డి,నాగం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాలమృతి పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లారు. ముండే భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్‌లు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, అరుణజ్యోతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముండే చిత్రపటం ముందు నివాళులర్పించారు. ముండే కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఆలస్యంగా వస్తానంటూ..
బుధవారం ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు కాస్త ఆలస్యంగా వస్తానంటూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు చెప్పిన గోపీనాథ్ ముండే అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం అందరినీ కలచి వేసింది. సొంత నియోజకవర్గానికి వెళ్తున్నందున లోక్‌సభ సభ్యుడిగా తన ప్రమాణస్వీకారానికి ఆలస్యంగా వచ్చేందుకు అనుమతించాలంటూ ముం డే సోమవారం రాత్రే తనను కోరారని...అందుకు తాను అంగీకరించానని, ఈలోగా ఈ ఘోరం జరిగిపోయిందని చెబుతూ వెంకయ్య నాయుడు ఉద్వేగానికి గురయ్యారు.