కాగజ్‌నగర్ రూరల్ : కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామ సమీపంలో 21వ శతాబ్ది గురులకు విద్యాలయం కోసం నిర్మించిన అధునాతన భవనాలు నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 12 కోట్లతో నిర్మించిన అధునాన భవనాలు నాలుగేళ్లుగా నిరూపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
ఇంటర్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌తోపాటూ ఇతర సాంకేతిక విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 21వ శతాబ్ధి గురుకులాలను మంజూరు చేసింది. ఎంసెట్‌లో సీటు రాని విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఇంజనీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైస్ రాజశేఖర్‌రెడ్డి 21వ శతాబ్ధి గురుకులాలకు రూపకల్పన చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలికి అప్పగించారు.
ఇందులో భాగంగా జిల్లాలోని కాాగజ్‌నగర్ మండలం గన్నారంలో గురుకుల భవనాలు నిర్మించారు. గ్రామ సమీపంలోని 50 ఎకరాల భూమి కేటాయించి రూ. 12 కోట్లు విడుదల చేశారు. 12 కోట్లతో భనవ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎనిమిది బ్లాకులు, 384 గదులతో అధునాతన సౌకర్యాలతో భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాక్‌కు మూడు అంతస్తులు, ప్రతీ అంతస్తుకు 16 చొప్పున మొత్తం 384 గదులను నిర్మించారు.
2010 సంవత్సరం నాటికే ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు వసతీసౌకర్యం కల్పించేలా అధునాతన ఏర్పాట్లు చేపట్టారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి మృతి చెందడంతో అనంతర కాలంలో ఈ గురుకులాల గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ భవనాలు నిరూపయోగంగా మారాయి.
తెలంగాణ ప్రభుత్వమైనా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ భవనాలను పట్టించుకుని వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 50 ఎకరాల విశాల స్థలంలో అధునాతన భవనాలు నిర్మించి ఉండడంతో ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తేనే భవనాలు వినియోగంలోకి రావడమే కాకుండా ఈ ప్రాంతంకూడా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.
ఇప్పటికే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు ఈ భవనాలను వినియోగంలోకి తెచ్చే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. ఈ భవనాలను గిరిజన యూనివర్శిటీకి కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రశేఖర్‌రావుకు వివరించడం జరిగిందని, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విద్యార్థులకు ఈ భవనాలను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ భవనాలను వినియోగంలోకి తీసుకువస్తే జిల్లాకే తలమానికం కానున్నాయి.
వినియోగంలోకి తెస్తే ప్రతిష్టాత్మకమే..
Published Mon, Oct 6 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement