నూజివీడు, న్యూస్‌లైన్ :
ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి బోధనాపద్ధతులపై యూజీసీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బృందం చైర్మన్, పంజాబ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అరుణ్‌కుమార్ గ్రోవర్ నేతృత్వంలో బృందం సభ్యులు ఆదివారం స్థానిక ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. తొలుత ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డెరైక్టర్ ఇబ్రహీంఖాన్, ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ వి.రాజకుమార్‌లతో బృందం సమావేశమైంది. వీసీ రాజకుమార్ ట్రిపుల్ ఐటీ లక్ష్యం, ప్రగతి, విద్యార్థులకు బోధిస్తున్న విద్యావిధానం, సదుపాయాలు, విద్యార్థుల నాసా పర్యటన, ఇటీవల జరిగిన ప్రాంగణ ఎంపికలు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 80 శాతం పైన ప్రతిభ కలిగిన విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో ఇంజినీరింగు విద్యను అందజేస్తున్నామన్నారు.
విద్యాబోధన, వసతులపై ఆరా...
బృంద సభ్యులు ప్రాంగణంలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలు, సదుపాయాలను పరిశీలించారు. తరగతి గదులు, హాస్టల్‌లో వసతి ఏర్పాట్లు, ఒక్కొక్క గదికి ఉంటున్న విద్యార్థులు ఎంతమంది తదితర అంశాలను డెరైక్టర్ ఇబ్రహీంఖాన్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఆస్పత్రి, అందులో ఏర్పాటుచేసిన సౌకర్యాలపై వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మెస్‌ను సందర్శించి పిల్లలకు నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని పరిశీలించారు. చివరగా ఇంజినీరింగు విద్యకు సంబంధించి ప్రయోగశాలలు, వాటిలోని పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు, మెంటార్లతో సమావేశమై విద్యావిధానంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
శిక్షణ విభాగం ఏర్పాటు చేయండి...
ఏడువేల మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలలో చదువుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్లేస్‌మెంట్ సెల్‌ల తరహాలో విద్యార్థుల ప్రయోజనార్థం కోచింగ్ సెల్ (శిక్షణ విభాగం)ను కూడా ఏర్పాటుచేసి అన్ని రకాల ప్రవేశపరీక్షలకు శిక్షణ కూడా ఆయా ప్రాంగణాల్లోనే నిర్వహించాలని అరుణ్‌కుమార్ గ్రోవర్ సూచించారు.
దీనివల్ల వారి సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం ఆర్జీయూకేటీ అధికారులు యూజీసీ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ మేరకు ట్రిపుల్ ఐటీని సందర్శించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సోమయ్య, సీనియర్ ప్రొఫెసర్లు ఆచార్య రామనర్శింహం, డాక్టర్ రామ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు వెల్లడించిన మెంటార్లు...
ట్రిపుల్ ఐటీ మెంటార్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యూజీసీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఆరేళ్లుగా తాము ఒకే జీతంతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వారు తమకు అనుకూలంగా స్పందించారని, ట్రిపుల్‌ఐటీ విద్యకు పునాది వేసేది మెంటార్లే కాబట్టి మీ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారని మెంటార్లు వివరించారు.
విద్యాబోధనపై యూజీసీ సంతృప్తి
Published Mon, Jan 20 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement