![Confusion in JEE mains schedule again - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/21/Student.jpg.webp?itok=H0KvC0cN)
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2023 నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జేఈఈ–2023కి సంబంధించి షెడ్యూల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలు తేదీలు ప్రచారం అవుతుండడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి జేఈఈ మెయిన్స్‌ను గతంలో ఒక్కసారే నిర్వహించేవారు.
ఒకపక్క బోర్డు పరీక్షలకు తయారవ్వడం, మరోపక్క మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు తొట్రుపాటుతో తక్కువ మార్కులతో అవకాశాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చేది. ఈ కారణాలతో ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా మార్పు చేశారు. జనవరి, మార్చి ఆఖరు లేదా ఏప్రిల్‌లో నిర్వహించేవారు.
జనవరి సెషన్‌కు సంబంధించి నవంబర్‌కు ముందే ఎన్‌టీఏ షెడ్యూల్ విడుదల చేసేది. కానీ, ఈసారి నవంబర్ మూడో వారంలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటివరకు ఎన్‌టీఏ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బోర్డు సహా పలు రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్‌ఈ పరీక్షలు కూడా ఇంచుమించు అదే సమయంలో జరుగుతుంటాయని, దీనివల్ల తాము ఇబ్బందికి గురవుతామని విద్యార్థులు విన్నవిస్తున్నారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి ఎన్‌టీఏ ఒక స్పష్టతనిస్తే ప్రణాళిక ప్రకారం సిద్ధంకావడానికి వీలుంటుందంటున్నారు.
గత ఏడాది తీవ్ర గందరగోళం..
కరోనాతో రెండేళ్ల పాటు జేఈఈ పరీక్షల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా 2022లో కోవిడ్ తగ్గుముఖం పట్టినందున అన్నీ సకాలంలో జరుగుతాయని విద్యార్థులు భావించారు. కానీ, జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఎన్‌టీఏ పలుమార్లు షెడ్యూళ్లు మార్పుచేసి విద్యార్థులను, బోర్డులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్‌ను 2021 నవంబర్, డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను చేపట్టాలి. కానీ, ఎన్‌టీఏ ఐదు రాష్ట్రాల ఎన్నికల సాకుతో 2022 మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ప్రకటించి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అలాగే, తొలి సెషన్ పరీక్షల తేదీల విషయంలో ఆయా రాష్ట్రాల బోర్డు పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16–21 వరకు, మే 24–29 వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని తేదీలను ప్రకటించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహ అనేక రాష్ట్రాల ఇంటర్మీడియెట్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అంతకుముందే ప్రకటించినా వాటిని పట్టించుకోలేదు.
జేఈఈ పరీక్షలను అవే తేదీల్లో ఎన్‌టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీలను ఆ ఏడాది ఏప్రిల్ 22 తరువాత ఉండేలా మార్పులుచేసుకున్నాయి. కానీ, ఎన్‌టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను మార్పుచేసింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు మళ్లీ మార్పు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎన్‌టీఏ మూడోసారి మళ్లీ షెడ్యూల్‌ను మార్పుచేసింది. 2022 జూన్, జులైలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించి ఆయా రాష్ట్రాల బోర్డులను సమస్యల్లోకి నెట్టింది.
ఇలా జేఈఈ మెయిన్–2022 పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేయడంతో ఫలితాల విడుదలపైనా దాని ప్రభావం పడింది. మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6కల్లా ఎన్‌టీఏ విడుదల చేయాల్సి ఉంది. వీటిలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్సుకు అనుమతిస్తారు. కానీ, చివరి నిమిషం వరకు మెయిన్స్ ఫలితాలపై గందరగోళానికి గురిచేసింది. ఈసారి అలాంటి గందరగోళానికి లేకుండా పరీక్షలపై స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment