సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. ఆ విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో ముద్రించి ఇచ్చారు. ఈ విద్యార్థులు 2025లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు. వీటిని సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లో నిర్వహించనున్నారు.
ఆ తరువాత నుంచి వచ్చే బ్యాచ్‌ల విద్యార్థులు సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లోనే అభ్యసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022–23, 2023–24 విద్యాసంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆతరువాత నుంచి పూర్తిగా సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి.
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి
ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షలను.. అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్‌ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్, కంటిన్యూ ఇవాల్యుయేషన్ – సీసీఈ) విధానం ప్రకారం గతంలో ఎస్సెస్సీ పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి.
అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు, పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది. పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది.
సీబీఎస్‌ఈ విధానాన్ని అనుసరించనున్నందున 2025 నుంచి జరిగే టెన్త్ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2022–23)లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు.
తొలివిడతగా 1,092 స్కూళ్లకు రానున్న సీబీఎస్‌ఈ గుర్తింపు
రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సీబీఎస్‌ఈ గుర్తింపునకోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్‌ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1,092 స్కూళ్లకు తొలివిడతగా ఈ గుర్తింపు రానుంది. ఈ స్కూళ్ల విద్యార్థులకు సీబీఎస్‌ఈ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి.
నేరుగా ఆ బోర్డే ఈ స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది. సీబీఎస్‌ఈ గుర్తింపులేకున్నా దాని సిలబస్, ప్యాట్రన్‌ను మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులకు మాత్రం ఎస్సెస్సీ బోర్డు ద్వారా.. సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment