ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ సంక్రమణ కారణంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2021 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూలై 3న జరగాల్సిన ఈ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. పరీక్ష కొత్త తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని తెలిపింది.
జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారిలో అత్యధిక మార్కులు కలిగిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కరోనా మహమ్మారి కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికే జేఈఈ– మెయిన్ 2021 ఏప్రిల్, మే సెషన్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అర్హత పరీక్ష అయిన మెయిన్ వాయిదా పడినందువల్ల అడ్వాన్స్‌డ్‌ను ఇప్పుడు నిర్వహించే అవకాశం లేదు.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయం షిఫ్టులో ఉంటుంది. రెండవది మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా విద్యార్థులు దేశంలోని 23 ఐఐటీల్లో బాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్, డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో ప్రవేశాలకూ ఇదే అర్హత పరీక్ష. ప్రతి సంవత్సరం ఈ ప్రవేశ పరీక్షను 7 జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీలు నిర్వహిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment