జేఈఈ అడ్వాన్స్‌డ్ టాప్ ర్యాంకర్లను ఆకర్షిస్తున్న విద్యాసంస్థ
తొలి 10 ర్యాంకులు సాధించిన వారంతా అక్కడే చేరిక
టాప్–1000లో ఏకంగా 246 మందికి ప్రవేశాలు
ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ, మద్రాస్‌లకు చోటు
ఈ ఏడాది మహిళల ప్రవేశాల్లో స్వల్పంగా పెరుగుదల
‘జేఈఈ అడ్వాన్స్‌డ్–2024’ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్లకు ఐఐటీ బాంబే (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబే)అగ్రగామి ఎంపికగా కొనసాగుతోంది. ఈ ఏడాది టాప్–10 జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా ఐఐటీ–బాంబేలోనే ప్రవేశాలు పొందారు. మొదటి 25 ర్యాంకుల్లో 24 మంది, 50 ర్యాంకుల్లో 47 మంది, 1000లోపు ర్యాంకుల్లో 246 మంది ఐఐటీ–బాంబే నుంచే ఇంజనీర్లుగా ఎదిగేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంజనీరింగ్ విద్య, పరిశోధన రంగంలో అగ్రగామిగా ఐఐటీ బాంబే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే.. 2018లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదాను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జాతీయ సాంకేతిక విద్యను విస్తరించడంలో భాగంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ ‘జేఈఈ అడ్వాన్స్‌డ్–2024’ నివేదికను విడుదల చేసింది. అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణ, జోసా కౌన్సెలింగ్‌లో కీలకంగా వ్యవహరించిన (జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్–2) ఆచార్య అన్నాబత్తుల రత్నకుమార్ ఏపీకి చెందిన వ్యక్తి కావడం విశేషం.
2024–25 విద్యా సంవత్సరానికి 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా.. 1.80 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో 17,695 మంది 23 ఐఐటీల్లో సీట్లు సాధించారు. వీరిలో భారతీయ పౌరసత్వ మూలాలున్న 88 మంది, ఇద్దరు విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు.
బాంబే తర్వాత ఢిల్లీనే..
దేశంలోని 23 ఐఐటీల్లో ఐఐటీ బాంబే తర్వాత టాప్ ర్యాంకర్ల ఫేవరెట్ ఎంపికగా ఐఐటీ–ఢిల్లీ మారింది. ఇందులో టాప్–50 ర్యాంకర్లలో ఇద్దరు, టాప్–100లో 23 మంది, టాప్–200లో 50 మంది, టాప్–500లో 109, టాప్–1000లో 204 మంది ప్రవేశాలు పొందారు.
ఆ తర్వాత తొలి వెయ్యి ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్‌లో 128 మంది, ఐఐటీ కాన్పూర్‌లో 117 మంది, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 82 మంది, ఐఐటీ గౌహతిలో 69 మంది, ఐఐటీ రూరీ్కలో 55 మంది, ఐఐటీ హైదరాబాద్‌లో 41 మంది, ఐఐటీ వారణాసిలో 23 మంది, ఐఐటీ ఇండోర్‌లో ఐదుగురు, ఐఐటీ గాం«దీనగర్‌లో ఒకరు ప్రవేశాలు పొందారు.
మహిళా విద్యార్థులప్రవేశాలు ఇలా..
గడచిన నాలుగేళ్లతో పోలిస్తే ఐఐటీల్లో సీట్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2024–25 ప్రవేశాల్లో 23 ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ సీట్లు 3,566 ఉండగా.. మొత్తం సీట్లు 17,760కు చేరాయి. వీటిలో 17,695 సీట్లు భర్తీ చేశారు. వీటిలో సుమారు 80 శాతం ప్రవేశాలు పురుషులే పొందుతున్నారు. ఏటా ఐఐటీల్లో ప్రవేశాలు పొందుతున్న మహిళలు మాత్రం కేవలం 3 వేల వరకు మాత్రమే ఉంటున్నారు.
గడచిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 73 మంది మాత్రమే అధికంగా ప్రవేశాలు తీసుకున్నారు. ఐఐటీలో అత్యధికంగా ఖరగ్‌పూర్‌లో 363, వారణాసిలో 301, బాంబేలో 278, రూర్కీలో 275, ఢిల్లీలో 246, కాన్పూర్‌లో 248, మద్రాస్‌లో 231 మందితో పాటు హైదరాబాద్‌లో 120, తిరుపతిలో 50 మంది మహిళలు ప్రవేశాలు పొందారు.
తెలియకుంటే.. మిన్నకుంటే మేలు!
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో విద్యార్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాము కలలుకన్న ఐఐటీల్లో సీట్లు సాధించేందుకు ప్రతి మార్కును లెక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైనస్ మార్కులు ఉండటంతో తెలియని ప్రశ్నల జోలికి వెళ్లడం లేదు. ఇలా పేపర్–1 గణితంలో 7వ ప్రశ్నను 80.31 శాతం మంది విడిచిపెట్టేశారు.
ఇలా ప్రశ్నలు1, 3, 4, 5, 14, 17కు సుమారు 60 శాతానికిపైగా విద్యార్థులు సమాధానాలు రాయలేదు. ఫిజిక్స్‌లో 7వ ప్రశ్నకు అత్యధికంగా 82.32 శాతం మంది సమాధానం ఇవ్వలేదు. ఇలా 2, 3, 6, 16 ప్రశ్నలు 60 శాతానికిపైగా దూరంగా ఉన్నారు. కెమిస్ట్రీలో చాలావరకు జవాబు రాయడానికి ప్రయత్ని0చినట్టు తెలుస్తోంది.
ఇలానే పేపర్–2లో గణితంలో 5వ ప్రశ్నకు అత్యధికంగా 71.11 శాతం మంది, ఫిజిక్స్‌లో 7వ ప్రశ్నకు 72.27 శాతం మంది జవాబు రాయలేదు. మొత్తంగా చూస్తే రెండు పేపర్లలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా నూరు శాతం మంది జవాబు పెట్టకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment