సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్–2023 పరీక్షలు కొత్త సిలబస్‌తో జరగనున్నాయి. సిలబస్‌లో మార్పులు చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన జాయింట్ అడ్మిషన్ బాడీ (జేఏబీ) ఇప్పుడు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ jeeadv. ac.in లో పొందుపరిచింది.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మూడు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చింది. 2023 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త సిలబస్‌ను అనుసరించాల్సి ఉంటుంది. పాత సిలబస్‌లోని కొన్ని అధ్యాయాలను తొలగించి, కొత్తగా కొన్ని చేర్చారు. జేఈఈ మెయిన్‌తో అనుసంధానంగా ఉండేలా నూతన సిలబస్‌ను రూపొందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కోచింగ్ తీసుకోని విద్యార్థులు కూడా విజయం సాధించడం సిలబస్ మార్పు ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు.
మార్పులు ఇలా
జేఈఈ అడ్వాన్స్‌డ్ గణితంలో కొత్తగా గణాంకాలు (స్టాటిస్టిక్స్)ను జోడించారు. దీనికి బదులుగా త్రిభుజం పరిష్కారం (సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్) అంశాన్ని తొలగించారు. భౌతిక శాస్త్రంలో సెమీకండక్టర్లు, కమ్యూనికేషన్ అంశాలను మినహాయించారు. వీటికి బదులుగా జేఈఈ మెయిన్‌లోని కొన్ని అంశాలు జోడించారు. మెయిన్‌లోని ఫోర్స్‌డ్ అండ్ డాంపడ్ ఆసిల్లేషన్స్, ఈఎమ్ వేవ్స్, పోలరైజేషన్ అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చారు. అదే విధంగా కెమిస్ట్రీలోనూ మార్పులు చేశారు.
సీబీఎస్‌ఈ విద్యార్థులకు సులువు
కొత్త సిలబస్‌లో ఎక్కువగా సీబీఎస్‌ఈ అంశాలను చేర్చారు. దీనివల్ల సీబీఎస్‌ఈ విద్యార్థులకు కొంత సులువుగా ఉంటుందని, ఇంటర్మీడియట్ చదివే వారికి కొంత ఇబ్బందికరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ విద్యార్థులు గతంలోకంటే ఎక్కువ సిలబస్‌ని అనుసరించాల్సి వస్తుందన్నారు. కొత్త సిలబస్ జేఈఈ మెయిన్‌కు అనుసంధానంగా ఉండేలా చేయడం వల్ల మెయిన్‌కి ప్రిపేర్ అయిన వారు అవే అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.
సిలబస్‌ను పెంచినప్పటికీ, పరీక్ష సులువుగా మారే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మెయిన్‌లోని అధ్యాయాలు అడ్వా న్స్‌డ్‌లో చేర్చినందున సిలబస్ పెరిగినట్లు పైకి కనిపించినప్పటికీ, అవే అంశాలు కనుక అంతగా భారం ఉండదని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ఐఐటీలలో వివిధ కోర్సులు చదవాలనుకొనే వారు కొత్త ఫార్మాట్ ఆధారంగా ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు.
పరీక్షలు ఇలా..
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీఈఈడీ), అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (యూసీఈఈడీ) కింద ఈ కొత్త పేపర్ నమూనా, సిలబస్ ప్రవేశపెట్టినట్లు జేఏబీ ప్రకటించింది. కొత్త విధానంలో ప్రవేశ పరీక్ష పార్ట్–ఎ, పార్ట్–బిలుగా రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్–ఎ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మూడు విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి.
న్యూమరికల్ ఆన్సర్ టైప్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎన్‌ఏటీ, ఎంఎస్క్యూ, ఎమ్సీక్యూ) ఉంటాయి. పార్ట్–బి లో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి డ్రాయింగ్, మరొకటి డిజైన్ ఆప్టిట్యూడ్. పార్ట్ – బి లోని ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా ఇస్తారు. అభ్యర్థులు దానికి సమాధానాన్ని ఇన్విజిలేటర్ అందించిన జవాబు పుస్తకంలో మాత్రమే రాయాలి. ప్రశ్నలకు సంబంధించిన చిత్రాల డ్రాయింగ్ అందులోనే చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment