సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. దీంతో ఈ ఏడాది జేఈఈ పరీక్షల ప్రక్రియ ముగిసింది. అడ్వాన్స్‌డ్ ఫలితాలు సెప్టెంబర్ 11న వెలువడనున్నాయి. 12వ తేదీన కౌన్సెలింగ్ మొదలవుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్తా కష్టంగానే ఉన్నట్టు నిపుణులు, విద్యార్థులు తెలిపారు.
గణితం అత్యంత కష్టంగా, సుదీర్ఘ ప్రశ్నలతో ఉంటే, ఫిజిక్స్ కాస్త మధ్యస్తంగా ఉందని, ఇందులోనూ సుదీర్ఘ ప్రశ్నలతో సమయం ఎక్కువ పట్టిందని విద్యార్థులు తెలిపారు. కెమెస్ట్రీ సాధారణంగా, స్కోర్ ఎక్కువ చేసేలా ఉండటం కొంత ఊరటనిచ్చిందని చెప్పారు. రెండు పేపర్లలోని మూడు సబ్జెక్టుల్లో మిక్స్‌డ్ కాన్సెప్ట్ ప్రశ్నలే వచ్చాయని నిపుణులు విశ్లేషించారు.
చుక్కలు చూపించిన మేథ్స్
అడ్వాన్స్‌డ్ కోసం రెండేళ్ళుగా సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కూడా మేథ్స్ సబ్జెక్టులో వచ్చిన ప్రశ్నలు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. ఊహించిన చాప్టర్స్ నుంచే ప్రశ్నలు వచ్చినా జవాబులు రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకున్నట్టు విద్యార్థులు తెలిపారు. సీక్వెన్స్ అండ్ సిరీస్, కాంప్లెక్స్ నంబర్స్, డిఫైన్ అండ్ ఇంటిగ్రేషన్స్, లిమిట్స్ ఫంక్షన్స్, అప్లికేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ డెరైవేటివ్, ప్రొబబులిటీ వంటి చాప్టర్లకు సంబంధించిన ప్రశ్నలు కొంత కష్టంగానే ఉన్నట్టు తెలిపారు.
ఫిజిక్స్‌లో ఆప్టిక్స్, కైన్‌మ్యాటిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ, రొటేషనల్ మోషన్, థర్మోడైనమిక్స్, సర్‌ఫేస్ టెన్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మేగ్నటిజమ్ చాప్టర్ల ప్రశ్నలు కొన్ని తేలికగా, మరికొన్ని మోడరేట్‌గా ఉన్నట్టు నిపుణులు విశ్లేషించారు. కెమిస్ట్రీలో అన్ని చాప్టర్ల ప్రశ్నలు తేలికగా సమాధానం చెప్పేలా ఉన్నాయన్నారు.
ఎవరు ఎన్ని మార్కులు సాధిస్తే అర్హత?
అడ్వాన్స్‌డ్ కష్టంగా ఉండటం వల్ల క్వాలిఫయింగ్ మార్కులు అదే రీతిలో ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 360 మార్కులకు ప్రతి ప్రతి సబ్జెక్టులో 5 శాతం మార్కులతో ఓపెన్ కేటగిరీలో 60 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్టేనని చెబుతున్నారు. ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ కేటగిరీలు ప్రతి సబ్జెక్టులో 4 శాతంతో 50 కనీస మార్కులు, ఎస్సీలు ప్రతి సబ్జెక్టులో 2 శాతంతో 25 కనీస మార్కులు సాధిస్తే ఐఐటీల్లో సీట్ల పోటీకి అర్హత పొందినట్టేనని విశ్లేషిస్తున్నారు. పేపర్ విధానం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం వచ్చే మార్కులకు ర్యాంకులను జేఈఈ అధ్యాపకులు లెక్కగట్టారు.
ఊహించిన చాప్టర్ల నుంచి వచ్చినా కఠినమే..
అనుకున్న చాప్టర్ల నుంచే వచ్చినా ప్రశ్నలు కఠినంగానే ఉన్నాయి. పోటీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ర్యాంకులు కూడా అదేవిధంగా ఉండే అవకాశం ఉంది. కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసే వీలుంది. మొత్తం మీద గతంతో పోలిస్తే ఈసారి కాస్తా హార్డ్‌గానే అడ్వాన్స్‌డ్ పేపర్ ఇచ్చారు.
– ఎంఎన్ రావు (జేఈఈ ప్రత్యేక బోధకుడు)
Comments
Please login to add a commentAdd a comment