- 20వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆలిండియా ర్యాంకులు ఆదివారం (ఈ నెల 12న) విడుదల కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను గౌహతి ఐఐటీ పూర్తి చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1.98 లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా.. 1.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ, ఏపీల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 28,951 మందిలో (ఏపీ 14,703, తెలంగాణ 14,248) దాదాపు 21 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో దాదాపు 19 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలు, ఆలిండియా ర్యాంకులను 12న విడుదల చేయనుంది. అలాగే ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 15న ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి ఐఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు.
ఆర్కిటెక్చర్ పరీక్ష, ఐఐటీ ప్రవేశాల షెడ్యూల్
- ఈ నెల 12, 13 తేదీల్లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
- 15న ఉదయం 9 నుంచి మధాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష
- 19న ఏఏటీ ఫలితాలు ప్రకటన
- 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఐఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ