2017, మే 21న జేఈఈ అడ్వాన్స్‌డ్ | 2017 May JEE Advanced | Sakshi
Sakshi News home page

2017, మే 21న జేఈఈ అడ్వాన్స్‌డ్

Published Tue, Sep 20 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

2017, మే 21న జేఈఈ అడ్వాన్స్‌డ్

2017, మే 21న జేఈఈ అడ్వాన్స్‌డ్

  పరీక్షకు 2.20 లక్షల మందికి అర్హత
  జేఏబీ సమావేశంలో నిర్ణయం

 
 ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ఖరారైంది. జాతీయ స్థాయిలో మే 21న  రెండు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించాలని ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) తాజా సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్‌డ్-2017ను ఐఐటీ- మద్రాస్ నిర్వహించనుంది. అంతేకాకుండా జేఈఈ-2017కు మొత్తం 2,20,000 మందికి అవకాశంకల్పించనున్నారు. గతేడాది వరకు జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసే వారి సంఖ్య రెండు లక్షలుగా మాత్రమే ఉండేది. అయితే రానున్న సంవత్సరంలో కొత్తగా వచ్చే ఐఐటీలు, పెరగనున్న సీట్లను దృష్టిలో పెట్టుకొని అదనంగా20వేల మందికి జేఈఈ-మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పించాలని నిర్ణయించారు.
 
 ఎస్సీ, ఎస్టీలకు ఇంటర్ పర్సంటేజీ తగ్గింపు
 జేఈఈ అడ్వాన్స్‌డ్ విషయంలో జేఎబీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌లో పొందాల్సిన మార్కుల పర్సంటేజీని 70 శాతం నుంచి 65 శాతానికి తగ్గించింది. అలాగే ఓసీ, ఓబీసీ కేటగిరీల విద్యార్థులు 75 శాతం మార్కులు పొందాలనే నిబంధన యథాతథంగా అమలు కానుంది. తాజా నిర్ణయం ప్రకారం- జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే..  ఇంటర్మీడియెట్ బోర్డ్ మార్కుల్లో టాప్ 20 పర్సంటైల్ జాబితాలో లేదా ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షల్లో జనరల్, ఓబీసీ కేటగిరీ విద్యార్థులు 75 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 65 శాతం మార్కులు సాధించాలి.
 
 ఓబీసీ సర్టిఫికెట్, ఏప్రిల్ 1,
 2017 తర్వాతదే

 
  ఓబీసీ (నాన్-క్రిమీలేయర్) విద్యార్థులు సమర్పించాల్సిన కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా 2017, ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిందై ఉండాలని జేఏబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
 
 వీడియో ట్యుటోరియల్స్
 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు భారీగా పోటీపడుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రాంతీయ భాష నేపథ్యం ఉన్న విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. దరఖాస్తు దశ నుంచే వారికి సదరు ప్రక్రియ సులువుగా ఉండేలా వివిధ సదుపాయాలు కల్పించనున్నారు. యూజర్ రిజిస్ట్రేషన్, ర్యాంకుల తర్వాత దశలోని సీట్ల భర్తీ క్రమంలో ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియలకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో వీడియో ట్యుటోరియల్స్, లైవ్ డెమోలను అందుబాటులో ఉంచనున్నారు.
 
 సార్క్ దేశాల్లో సెంటర్ల పెంపు!
 విదేశీ విద్యార్థులను ఆకర్షించే చర్యల్లో భాగంగా సార్క్ దేశాల్లో అడ్వాన్స్‌డ్ సెంటర్ల సంఖ్యను సైతం పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది.
 మెయిన్ ర్యాంకులు.. ఇంటర్ వెయిటేజీ తొలగింపు
 
 ఇప్పటికే ఎంహెచ్‌ఆర్‌డీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్ ఎగ్జామినేషన్ ర్యాంకుల రూపకల్పనలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. గతేడాది వరకు జేఈఈ మెయిన్ ర్యాంకుల రూపకల్పనలో ఇంటర్మీడియెట్ బోర్డ్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉండేది. ఇక నుంచి ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు.
 
 నెలాఖరు నాటికి
 అధికారిక వెబ్‌సైట్

 
 జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్ ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ లోపు జేఈఈ మెయిన్ - 2017 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
 
 జేఈఈ అడ్వాన్స్‌డ్ సమాచారం
 పరీక్ష తేది:    మే 21, 2017
 పరీక్ష విధానం:    రెండు పేపర్లు
 నిర్వాహక ఇన్‌స్టిట్యూట్: ఐఐటీ-మద్రాస్
 మొత్తం ఐఐటీలు:    22

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement