
'సీఎం చేతుల్లో భద్రంగా విద్యార్థుల భవిష్యత్'
తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ లో ర్యాంగింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల్లో విద్యార్థుల భవిష్యత్ భద్రంగా ఉందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... విభజన చట్టం ప్రకారం 7 విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఈ నెల 30 నుంచి నిట్ లో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా తయారు చేయాలని చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు. బడ్జెట్ లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామని తెలిపారు.
నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతీ ఇరాని, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, పీతల సుజాత పాల్గొన్నారు.