‘నిట్’కు త్వరలో శాశ్వత డైరెక్టర్
Published Sun, Mar 5 2017 1:58 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌కు త్వరలో శాశ్వత డైరెక్టర్ నియామకం కానున్నారని, ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నుంచి వచ్చే అడ్‌హక్ ఫ్యాకల్టీల రాకలో ఇబ్బందులు, బోర్డు ఆఫ్ గవర్నెన్స్ తదితర సమస్యలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిశానన్నారు. నిట్‌కు సంబంధించిన అన్ని సమస్యలను ఆయనకు వివరించానని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి శుక్రవారం స్పందించారని, నిట్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. నిట్ కార్యకలాపాల కోసం త్వరలో శాశ్వత కమిటీని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. డైరెక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారని, 30 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాబోయే విద్యాసంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థులకు సరిపడే బస, భోజన సదుపాయాల కోసం నిట్ ప్రాంగణంలో తాత్కాలిక నిర్మాణాలు పూర్తికానున్నాయన్నారు. ఆటోనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియ పూరై్తందని మంత్రి చెప్పారు.
Advertisement