
మనోజ్ఞ సాయి
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరి సెషన్ పేపర్–1 పరీక్ష ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానం నిర్వహించిన తొలివిడత పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,52,627 మంది దరఖాస్తు చేయగా 6,20,978 మంది హాజరైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో అభ్యర్థుల స్కోర్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ ఏడాది నుంచి జేఈఈని నాలుగు విడతల్లో నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులవారీగా కేవలం స్కోర్‌ను మాత్రమే విడుదల చేసింది.
మొత్తం నాలుగు విడతల పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు వచ్చిన బెస్ట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటించనుంది. ఫిబ్రవరి సెషన్‌లో 100 ఎన్‌టీఏ స్కోర్ సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆరుగురున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికీ100 స్కోర్ రాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతంశెట్టి చేతన్ మనోజ్ఞసాయి 99.999 స్కోర్ సాధించి రాష్ట్రాల వారీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఏపీకే చెందిన మరో ఆరుగురు అభ్యర్థులు తక్కిన కేటగిరీల్లో అత్యధిక స్కోర్ సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానాల్లో నిలిచారు.
ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో అనుముల వెంకట జయచైతన్య 99.9961682, గుర్రం హరిచరణ్ 99.9942523 స్కోర్లు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఓబీసీ కేటగిరీలో 99.9913217 స్కోర్‌తో బిత్రసాయి సిద్ధి రఘురామ్ శరణ్ రెండో స్థానం, 99.9846474 స్కోర్‌తో గొట్టిపల్లి శ్రీ విష్ణు సాత్విక్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. దివ్యాంగుల కేటగిరీలో ఇద్దరికి 3, 4 స్థానాలు లభించాయి. మల్లిన శ్రీ ప్రణవ్ శేషుకు 99.6393686, తల్లాడ వీరభద్ర నాగసాయి కృష్ణకు 99.6363357 స్కోర్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment