సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్– 2022–23 సెకండ్ సెషన్ షెడ్యూల్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. ముందుగా ప్రకటించినట్టే మే 24 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌ఏటీ) తెలిపింది. జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తామని ఐఐటీ బాంబే పేర్కొన్నప్పటికీ మెయిన్ సెకండ్ సెషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌ను ముందు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే వివిధ బోర్డుల పరీక్షల తేదీలతో అవి క్లాష్ అవుతుండడంతో ఆ తేదీలను ఎన్టీఏ మార్చింది. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు మెయిన్ మొదటి సెషన్ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెకండ్ సెషన్ తేదీల్లో కూడా మార్పులు ఉండొచ్చని విద్యార్థుల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌టీఏ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. జేఈఈ మెయిన్‌లో క్వాలిఫై అయిన టాప్ 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. కాగా జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలు సవరించుకోవడానికి ఈసారి అవకాశం లేనందున విద్యార్థులు ముందే తగు జాగ్రత్తలు పాటించాలని ఎన్‌టీఏ సూచించింది.
న్యూమరికల్ ప్రశ్నలకూ నెగెటివ్ మార్కులు
జేఈఈ మెయిన్‌లోని పేపర్–2 సెక్షన్ బీలో న్యూమరికల్ ప్రశ్నలకు గతంలో నెగెటివ్ మార్కులు ఉండేవి కావు. అయితే ఈసారి వాటికి కూడా ఎన్‌టీఏ నెగెటివ్ మార్కులను ప్రకటించింది. ప్రతి తప్పు సమాధానానికి ఒక్కో మార్కు కోత పడనుంది. ఈ విషయాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకొని సమాధానాలు రాసేటప్పుడు జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment