JEE adavanced
-
అడ్వాన్స్డ్ ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ ఫలితాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ అడ్వాన్స్‌డ్‌పై ఉంది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఈ పరీక్ష జూన్ 4వ తేదీన జరగనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే కష్టపడకపోతే అడ్వాన్స్‌డ్‌లో గట్టెక్కడం అంత తేలికైన విషయమేమీ కాదని నిపుణులు అంటున్నారు. మంచి ర్యాంకు సాధిస్తేనే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ చేసే అవకాశం దక్కుతుందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో సబ్జెక్టులపై పట్టు సాధించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 99 పర్సంటైల్ వచ్చి న వాళ్ళ సంఖ్య ఈసారి వేలల్లో ఉంది కాబట్టి అడ్వాన్స్‌డ్‌లో నెట్టుకురావాలంటే ప్రిపరేషన్ గట్టిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. గణితంపై దృష్టి పెట్టాల్సిందే జేఈఈ మెయిన్స్‌లో గణితం పేపర్ ప్రతి ఏటా కఠినంగానే ఉంటోంది. అడ్వాన్స్‌డ్‌లో ఇది మరింత కష్టంగా ఉంటోంది. ప్రతి సబ్జెక్టుకూ 120 మార్కులుంటాయి. అయితే గణితంలో 20 మార్కులు సాధించడం గగనమవుతోంది. గత సంవత్సరం అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళల్లో ఈ మేరకు సాధించినవారు కేవలం 1,200 మంది మాత్రమే ఉన్నారు. ఇక రసాయన శాస్త్రంలో 20 మార్కులు దాటిన వాళ్ళు 2 వేలు, భౌతిక శాస్త్రంలో 4 వేల మంది ఉన్నారు. అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిలో ఐఐటీ సీట్లకు కేవలం 55 వేల మందినే ఎంపిక చేస్తారు. అందువల్ల వడపోత కఠినంగానే ఉంటుంది. ఈసారి ఎక్కువమంది జేఈఈ మెయిన్స్ రాయడంతో కటాఫ్ కూడా పెరిగింది. కాబట్టి వడపోతకు వీలుగా అడ్వాన్స్డ్ పేపర్లు కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బోంబేదే హవా ఐఐటీల్లో బోంబేకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇందులో సీటు కోసం పోటీ పడుతుంటారు. తొలి 50 ర్యాంకుల్లో 46 మంది బోంబేలోనే చేరడం గమనార్హం. మొదటి వెయ్యి ర్యాంకుల్లో 246 మంది ఇక్కడ ప్రవేశం పొందారు. గత ఏడాది 3,310 మంది బాలికలకు ఇందులో సీట్లు దక్కాయి. ఇక అత్యధికంగా తిరుపతి ఐఐటీలో 20.7 శాతం మంది సీట్లు పొందారు. అతి తక్కువగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 17.7 మంది సీట్లు పొందారు. విదేశీ విద్యార్థులు 145 మంది అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైతే 66 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. కాగా తొలి వెయ్యి ర్యాంకుల్లో ఢిల్లీలో 210, మద్రాసులో 110, కాన్పూర్‌లో 107, ఖరగ్‌పూర్‌లో 93, గువాహటిలో 66, రూర్కీలో 60, హైదరాబాద్‌లో 40, వారణాసిలో 31, ఇండోర్‌లో ఏడుగురు, రోవర్లో ఒకరు చేరారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాలపై ఉత్కంఠ: ర్యాంకెంత? సీటెక్కడ?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పూర్తయింది. ఇందులో అర్హత సాధిస్తే అడ్వాన్స్‌కు వెళ్తారు. అందులో లభించే ర్యాంకు ఆధారంగానే ఐఐటీ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇలా అడ్వాన్స్ ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీటు వస్తే... జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడే విద్యార్థుల్లో అసలైన టెన్షన్ మొదలవుతుంది. జేఈఈ మెయిన్స్‌లో ఎంత ర్యాంకు వస్తుందో? జేఈఈ అడ్వాన్స్‌కు ఎంపిక కాకుంటే..? ఆ ర్యాంకుతో నిట్లు, ఇతర విద్యాసంస్థల్లో సీటు వస్తుందా? రాదా? అనే ఆలోచనతో సమమతమవుతుంటారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే... జేఈఈ మెయిన్స్‌లో 10 వేల పైన ర్యాంకు వస్తే ఎన్ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించడం వృధా అని. అయితే ఇది ముమ్మాటికీ తొందరపాటు చర్యే అంటున్నారు నిపుణులు. ‘గత కొన్నేళ్ళుగా ఏ సంస్థలో ఏ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు? పోటీ ఎలా ఉంది? అనే దానిపై విద్యార్థులు కొంత కసరత్తు చేయాలి. అలాగే తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేచి చూడాలి..’అని స్పష్టం చేస్తున్నారు. కాస్త ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు ఈజీయే! ఎన్ఐటీలు అంటే ఐఐటీల తర్వాత దేశంలో పేరెన్నికగన్న విద్యా సంస్థలు. వీటిల్లో ఏ కోర్సు చేసినా జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంపెనీలు భారీ వేతనాలిచ్చి ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి ఫలానా కోర్సే కావాలి.. ఫలానా ఎన్ఐటీలోనే కావాలనే విషయాన్ని విద్యార్థులు పక్కన బెడితే, కాస్త ఎక్కువ ర్యాంకులోనూ సీటు ఈజీగానే సంపాదించే వీలుందని గత కొన్నేళ్ళ కౌన్సెలింగ్ డేటా చెబుతోంది. వరంగల్, తాడేపల్లిగూడెంలలో ఇలా.. గత ఐదేళ్ల సీట్ల కేటాయింపును పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో 75 వేల వరకు, రిజర్వేషన్ కేటగిరీలో 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా వీటిల్లో సీటు గ్యారెంటీ అని తెలుస్తోంది. వరంగల్ నిట్ సీఎస్ఈలో బాలురకు 3,089 ర్యాంకు, బాలికలకు 3,971 ర్యాంకు వరకు సీటు వస్తుంటే, అదే ఏపీ నిట్ (తాడేపల్లిగూడెం)లో బాలురకు 14 వేలు, బాలికలకు 28 వేల వరకు సీటు వస్తోంది. ఓబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13 వేల వరకు, ఏపీలో 33 వేల ర్యాంకు వరకు సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకైతే గరిష్టంగా 97,139 వరకు, ఎస్టీలకు 48 వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. మెకానికల్ బ్రాంచి ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్‌లో 17 వేల వరకు, ఏపీలో 75 వేల వరకు ర్యాంకులకు సీట్లొచ్చాయి. వీటిల్లో అయితే 50 వేల వరకు.. తిరుచ్చి, సూరత్కల్, క్యాలికట్, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా గరిష్టంగా జేఈఈ ర్యాంకు 50 వేల వరకు వచ్చినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. జేఈఈ మెయిన్స్ ద్వారా 34,319 సీట్లు భర్తీ దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్ఐటీల్లో 23,056, ఐఐఐటీల్లో 5,643, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌తో భర్తీ చేసే ఐఐటీ సీట్లు 16,050 పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లు జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలి జేఈఈ మెయిన్స్ ర్యాంకులు, నిట్‌లలో సీట్లపై విద్యార్థుల్లో అవగాహన తక్కువ. 10 వేలు దాటి ర్యాంకు వస్తే నీరసపడి పోతున్నారు. కానీ ఏ కాలేజీ అయినా సరే, ఏ బ్రాంచీ అయినా ఫర్వాలేదు అనుకుంటే, ఓపెన్ కేటగిరీలో 40 వేల వరకు, రిజర్వేషన్ అభ్యర్థులకు 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా సీటు వచ్చే అవకాశం ఉందని గత కొన్నేళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను అధ్యయనం చేస్తే తెలు స్తుంది. అందువల్ల తొందరపడి ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరవద్దు. – ఎంఎన్ రావు(గణిత శాస్త్ర నిపుణులు) -
జేఈఈ మెయిన్ రెండో సెషన్ యథాతథం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్– 2022–23 సెకండ్ సెషన్ షెడ్యూల్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. ముందుగా ప్రకటించినట్టే మే 24 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఏటీ) తెలిపింది. జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తామని ఐఐటీ బాంబే పేర్కొన్నప్పటికీ మెయిన్ సెకండ్ సెషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌ను ముందు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ బోర్డుల పరీక్షల తేదీలతో అవి క్లాష్ అవుతుండడంతో ఆ తేదీలను ఎన్టీఏ మార్చింది. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు మెయిన్ మొదటి సెషన్ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెకండ్ సెషన్ తేదీల్లో కూడా మార్పులు ఉండొచ్చని విద్యార్థుల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఏ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. జేఈఈ మెయిన్‌లో క్వాలిఫై అయిన టాప్ 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. కాగా జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు సవరించుకోవడానికి ఈసారి అవకాశం లేనందున విద్యార్థులు ముందే తగు జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఏ సూచించింది. న్యూమరికల్ ప్రశ్నలకూ నెగెటివ్ మార్కులు జేఈఈ మెయిన్‌లోని పేపర్–2 సెక్షన్ బీలో న్యూమరికల్ ప్రశ్నలకు గతంలో నెగెటివ్ మార్కులు ఉండేవి కావు. అయితే ఈసారి వాటికి కూడా ఎన్టీఏ నెగెటివ్ మార్కులను ప్రకటించింది. ప్రతి తప్పు సమాధానానికి ఒక్కో మార్కు కోత పడనుంది. ఈ విషయాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకొని సమాధానాలు రాసేటప్పుడు జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. -
JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..!
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. ఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించడానికి ప్రత్యేక మ్యాజిక్ ఫార్ములాలు అంటూ ఏమీలేవు. పక్కా ప్రణాళిక, పట్టుదలతో కూడిన ప్రిపరేషన్ మాత్రమే అడ్వాన్స్‌డ్‌లో విజయానికి దారి చూపుతుంది. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జులై 3న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ఇంజనీరింగ్ చదవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు కోరుకుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించేందుకు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే ప్రిపరేషన్ సాగిస్తుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావాలంటే.. మొదట జేఈఈ మెయిన్ పరీక్షల్లో టాప్‌లో నిలవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నాలుగుసార్లు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్షలు.. ఇప్పటికే రెండుసార్లు జరిగాయి. ఈ ఏడాది ఇలా ఈ ఏడాది జులై 3వ తేదీన అడ్వాన్స్డ్ పరీక్ష జరుగనుంది. కొవిడ్ కారణంగా గతేడాది రాయలేకపోయిన వారు, ప్రస్తుతం అడ్వాన్స్డ్ పరీక్షలకు హాజరుకాబోయే వారితో ఈసారి పోటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి విద్యార్థులు సరైన ప్రణాళికతో సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్‌తో ముందుకు వెళ్తేనే పరీక్షలో విజయం సాధించేందుకు వీలుంటుంది. సన్నద్ధత ఇలా ప్రస్తుత సంవత్సరం జరిగే పరీక్షా స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటిలాగానే ఆన్లైన్ విధానంలో మూడు గంటల కాలవ్యవధితో పరీక్షను నిర్వహించనున్నారు. సిలబస్ విషయానికివస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలుంటాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ఆయా సిలబ్ అంశాలపై దృష్టిపెట్టి ప్రిపరేషన్ కొనసా గించాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్ మ్యాథమెటిక్స్ : జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో మ్యాథమెటిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇందులో సూత్రాలను ఎక్కువగా గుర్తుపెట్టుకోవ డానికి షార్ట్ కట్ మెథడ్స్‌ను తెలుసుకోవాలి. కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్తోపాటు 3డీ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్, పారాబోలా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ తదితర అంశాలపై బాగా పట్టు సాధించాలి. కెమిస్ట్రీ: కెమిస్ట్రీ సబ్జెక్టు కాంబినేషన్ అఫ్ థియరీగా ఉంటుంది. ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్ వంటి కలయికతో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కెమిస్ట్రీ కోసం ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని నోట్‌బుక్‌లో రాసుకోవ డం ద్వారా ఆయా అంశాలను త్వరగా రివిజన్ చేసుకోవ డానికి వీలుంటుంది. ఇందులో కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్, ఆల్కహాల్స్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మోల్కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఫినాల్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డీ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఫిజిక్స్ : ఈ సబ్జెక్టుకు సంబంధించి బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్లపై అభ్యర్థులు పట్టు సాధించాలి. లాజికల్ థింకింగ్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫండమెంటల్స్‌పై పట్టు సాధించడానికి ఎన్సీఈఆర్టీ ఫిజిక్స్ బుక్స్, హెచ్‌సీ వర్మ, డీసీ పాండే ఫిజిక్స్ బుక్స్‌ను చదవాలి. అలాగే ఒక టాపిక్ మొదలు పెట్టినప్పడు దానికి సంబంధించిన సమస్యలను అదేరోజు పూర్తిచేసుకునే విధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఇందులో ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్ వంటివి కీలకమైన టాపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అలాగే సెంటర్ ఆఫ్ మాస్, మూమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. రివిజన్‌కు ప్రాధాన్యం సబ్జెక్టుల వారిగా అన్ని టాపిక్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాత రివిజన్‌కు ప్రాధాన్యం∙ఇవ్వాలి. ఆయా టాపిక్స్‌లోని ముఖ్యమైన అంశాలు తేలిగ్గా గుర్తుకు వచ్చేవిధంగా షార్ట్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రివైజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మాక్ టెస్టులతో స్పీడ్ విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. ఎక్కువగా మాక్‌టెస్టులు, మోడల్ టెస్టులను రాయాలి. దీనివల్ల పరీక్షను వేగంగా నిర్దేశిత సమయంలోపు పూర్తిచేయడానికి వీలవుతుంది. అంతే కాకుండా మాక్ టెస్టులు విద్యార్థులు పరీక్షలో మంచి ప్రతిభ చూపేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఆన్లైన్ పరీక్ష విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! -
ఐఐటీకి ‘సుప్రీం’ పాఠం
కీలక స్థానాల్లో, బాధ్యతాయుత పదవుల్లో వుండేవారు నిబంధనల చట్రంలో బందీలైతే... అక్కడి నుంచి బయటకు రావడానికి మొండికేస్తే, కనీసం ఆ పరిధిని మించి ఆలోచించడానికి నిరాకరిస్తే సామాన్యులకు సమస్యే. నిబంధనల అమలులో ‘చాదస్తంగా’ వుండే నేతలకూ, అధికారులకూ సుప్రీంకోర్టు తాజాగా ఒక కేసులో ఇచ్చిన తాత్కాలిక ఆదేశం కనువిప్పు కావాలి. సమస్య చాలా చిన్నది. పెద్ద మనసు చేసుకుని అధికారులు తార్కికంగా ఆలోచిస్తే అరక్షణంలో కనుమరుగయ్యే సమస్య అది. కానీ అందుకు సిద్ధపడకపోవడం వల్ల పద్దెనిమిదేళ్ల విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్ర యించాల్సివచ్చింది. ప్రతిష్టాత్మక జేఈఈ పరీక్షల్లో 270వ ర్యాంకు సాధించిన ఆగ్రా విద్యార్థి సిద్ధాంత్ బాత్రా ఆన్లైన్లో తనకు నచ్చిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సెలింగ్‌లో మొదటి రౌండ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న బాత్రాకు సీటు కేటాయించినట్టు బొంబాయి ఐఐటీనుంచి సందేశం కూడా వచ్చింది. తదుపరి ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో పొరబాటు చేశాడు. తనకు సీటు కేటాయింపు అయింది గనుక ఇతర రౌండ్ల అవసరం లేదనుకుని, దానికి సరిపోతుందనుకుని ‘ఫ్రీజ్’ లింకును క్లిక్ చేశాడు. దాంతో అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుందనుకున్నాడు. కానీ ఎంపిక చేసుకున్న సీటును రద్దు చేసుకోవడానికి దాన్ని ఉద్దేశిం చామని ఐఐటీ అంటోంది. ఏమైతేనేం తుది జాబితాలో అతని పేరు గల్లంతయింది. అప్పటినుంచీ ఎవరిని ఆశ్రయించినా ఆ విద్యార్థి మొర ఆలకించేవారే కరువయ్యారు. వారందరూ చెప్పిన పరిష్కారం ఒకటే– వచ్చే ఏడాది మరోసారి పరీక్షలు రాసి సీటు తెచ్చుకోవాలనే! పనులు సజావుగా సాగడానికి రూపొందించుకున్న నిబంధనలు ఆ పనులకే ప్రతిబంధకంగా మారకూడదు. గుదిబండలు కాకూడదు. ఆ విద్యార్థి మొదట బొంబాయి ఐఐటీని, అక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. సీట్లన్నీ నిండిపోయాయి గనుక ఈ దశలో ఏం చేయలేమని ఐఐటీ చెప్పిన జవాబుతో హైకోర్టు కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిద్ధాంత్‌కు తాత్కాలిక అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. బొంబాయి ఐఐటీ మొదటే ఇలాంటి ఆలోచన చేసివుంటే దాని నిర్వాహకులను అందరూ అభినందించేవారు. ఎందు కంటే సిద్ధాంత్ అమ్మానాన్నల్ని కోల్పోయి వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో వున్నా క్లిష్టమైన జేఈఈని ఛేదించాడు. మంచి ర్యాంకు తెచ్చుకుని ప్రతిభాశాలినని నిరూపించుకున్నాడు. అలాంటి వాడు తమ సంస్థకే వన్నె తెస్తాడని ఐఐటీ గుర్తించాల్సింది. అతని కోసం ఏం చేయగలమన్న కోణంలో ఆలో చించాల్సింది. డిజిటల్ ప్రపంచం మయసభలాంటిది. అక్కడ ఏమాత్రం ఏమరు పాటుగా వున్నా తలకిందులుకావడం ఖాయం. బ్యాంకు లావాదేవీల్లో సాధారణ పౌరులకు తరచుగా ఎదురయ్యే అనుభవమే ఇది. ఆన్లైన్లో దేన్నయినా క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే హెచ్చరిక సందేశం కంప్యూటర్ స్క్రీన్‌పై వెంటనే ప్రత్యక్షమయ్యే ఏర్పా టుండాలి. అది స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా వుండాలి. తప్పు చేసిన పక్షంలో అలాంటివారిని హెచ్చ రించడానికి తగిన వ్యవస్థ కూడా వుండాలి. అంతా ఆన్లైన్ గనుక మధ్యలో ఇంకేమీ కుదరవంటే జనం నష్టపోతారు. మన దేశంలో అంతంతమాత్రంగావున్న ఆన్లైన్ విధానంలోకి జనాన్ని మళ్లిం చడంలో పాలకులు విజయం సాధించారు. రేషన్ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గరనుంచి, బ్యాంకు లావాదేవీల వరకూ అన్నీ ఆన్‌లైన్‌కే మారుతున్నాయి. కానీ జనానికి సులభంగా బోధపడేలా ఇంటర్ ఫేస్‌లను రూపొందించడంలో, వారికి అర్థమయ్యే భాషలో వివరించడంలో అవి విఫల మవుతున్నాయి. దాంతో ఒక ప్రత్యామ్నాయానికి బదులు మరొకటి ఎంచుకుని జనం ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇప్పటికే అనేకచోట్ల కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే రోబోలతో పనులు కానిస్తుండగా, మున్ముందు వాటి పాత్ర మరింతగా పెరుగుతుందంటున్నారు. మంచిదే. వాటివల్ల పనులు చిటికెలో పూర్తవుతుంటే కాదనేవారుండరు. కానీ ఈ క్రమంలో మనుషులే రోబోలుగా మారకూడదు. గిరి గీసుకుని వుండిపోకూడదు. భిన్నంగా ఆలోచించబట్టే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ఆరోగ్యశ్రీవంటివి రూపొందించి నిరుపేద వర్గాల వారు సైతం ఉన్నత చదువులు చదవడానికి, వారికి మెరుగైన వైద్యం లభించడానికి మార్గం సుగమం చేశారు. దేనిలోనైనా సమస్యలుంటాయి. మానవీయ కోణంలో ఆలోచిస్తే వాటికి సులభంగా పరి ష్కారాలు లభిస్తాయి. ఆచరణలో వచ్చే అనుభవాలతో ఆ పరిష్కారాలకు మరింత మెరుగు పెట్టవచ్చు. ఐఐటీ ఉన్నతాధికార వర్గంలో ఇప్పుడు కనబడిన ధోరణి కొంచెం హెచ్చుతగ్గులతో దాదాపు అన్ని వ్యవస్థల్లోనూ ఉంటున్నది. రెండున్నరేళ్లుగా అంతూ దరీ లేకుండా సాగుతున్న భీమా కోరెగావ్ కేసు విచారణలో ఖైదీలుగా వున్న ఫాదర్ స్టాన్‌స్వామి, పౌరహక్కుల నాయకుడు గౌతం నవలఖాలకు ఎదురైన సమస్యలే ఇందుకు ఉదాహరణ. పార్కిన్సన్ వ్యాధి వల్ల మంచినీరు తాగాలన్నా కష్టమ వుతోందని, సిప్పర్, స్ట్రా అందజేయాలని స్టాన్‌స్వామి కోరితే దాన్ని నెరవేర్చడానికి జైలు అధికారులు నెలరోజుల సమయం తీసుకున్నారు. అది కూడా న్యాయస్థానం జోక్యం తర్వాతే. గౌతం నవలఖా కళ్లజోడు కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. ఈ తీరు చూసిన ధర్మాసనం జైలు అధికారులు సున్నితంగా, మానవీయంగా ఆలోచించడం కోసం వారికి ప్రత్యేక పాఠాలు చెప్పించా లేమోనన్న సందేహం వ్యక్తం చేసింది. అనుకోని సమస్యలు తలెత్తినప్పుడు ఉన్నంతలో తక్షణ పరి ష్కారంగా ఏం చేయాలన్న ఆలోచన కలగాలంటే అధికారుల్లో సృజనాత్మకత వుండాలి. బాధితు లపట్ల సహానుభూతి వుండాలి. అప్పుడే మెరుగైన నిబంధనలు అమలులోకొస్తాయి. అలా ఆలోచిం చగలిగేవారే చరిత్రలో నిలిచిపోతారు. అందరికీ మార్గదర్శకులవుతారు. -
జేఈఈ కౌన్సెలింగ్ 6 రౌండ్లకు కుదింపు!
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర సంస్థల్లో 2020–21 విద్యా సంవత్సరపు ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను ఏడు నుంచి ఆరు దశలకు కుదించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్స్, అడ్వాన్సుడ్ పరీక్షలలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఇప్పటివరకు ఈ సంస్థల్లో ప్రవేశాలకు ఏడు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్–19, లాక్డౌన్ల దృష్ట్యా జేఈఈ మెయిన్స్ రెండో విడత, అడ్వాన్సుడ్ పరీక్షలు ఆలస్యమైన నేపథ్యంలో ఈ రెండు ముగిసిన అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను ఆరు విడతలకు కుదించి సీట్లు భర్తీ చేయడమే మంచిదని జేఈఈ అడ్వాన్సును నిర్వహిస్తున్న ఐఐటీ ఢిల్లీ.. జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి ప్రతిపాదించింది. దీనిపై అన్ని ఐఐటీల నుంచి ఆమోదం వచ్చాక సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డుకు పంపిస్తారు. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్‌ను, జేఈఈ అడ్వాన్సును ఆగస్టు 23న నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్సు ఫలితాలను వారంలో ఇవ్వాలని, అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి ఆరు విడతల్లో పూర్తిచేస్తే అక్టోబర్ మొదటి వారం నుంచే తరగతులను ఆరంభించేందుకు అవకాశముంటుందని భావిస్తున్నారు. కోవిడ్–19 గందరగోళ పరిస్థితులు లేకపోతే సెప్టెంబర్‌లోపే తరగతులను ప్రారంభించేవారు. (1–6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..) -
‘అడ్వాన్స్డ్’గా ఉంటేనే...అదిరే ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ తరహాలో సిద్ధమైతేనే జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సాధించవచ్చని ఐఐటీ నిఫుణులు చెబుతున్నారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల విధానమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఉన్న జేఈఈ మెయిన్ పరీక్ష విధానాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలే విద్యార్థులకు ర్యాంకుల ఖరారులో కీలకం కానున్నాయి. దీంతో జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకుంటేనే పక్కాగా ర్యాంకును సాధించొచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు. ఇప్ప టివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రమే న్యూమరికల్ వ్యాల్యూ పరీక్షల విధానముండగా, ఇప్పుడు జేఈఈ మెయిన్‌లోనూ తేవడంతో విద్యార్థులు అడ్వాన్స్డ్ తరహాలోనే మెయిన్‌కు ప్రిపేర్ అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. న్యూమరికల్ప్రశ్నలకే 60 మార్కులు.. జేఈఈ మెయిన్‌లో గతంలో 360 మార్కులకు పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఇప్పుడు వాటిని 300 మార్కులకు తగ్గించింది. ప్రశ్నల సంఖ్య కూడా 90 నుంచి 75కు కుదించింది. అయితే పరీక్షల్లో అడిగే ప్రశ్నల విధానాన్ని కూడా మార్పు చేయడంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యం గా జేఈఈ మెయిన్ టార్గెట్ చేసుకొని సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇది తప్పనిసరి అని ఐఐటీ నిఫుణుడు ఉమాశంకర్ సూచిస్తున్నారు. ఇక నుంచి నిర్వహించే జేఈఈ మెయిన్ ప్రశ్నల్లో 15 ప్రశ్నలు (ఫిజిక్స్‌లో 5, కెమిస్ట్రీలో 5, మ్యాథ్స్‌లో 5 చొప్పున) న్యూమరికల్ వ్యాల్యూ (సంఖ్యాత్మక సమాధానం వచ్చేవి) సమాధానంగా వచ్చే ప్రశ్నలను ఇవ్వనుంది. అయితే ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఇవ్వలేదు. కేవలం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రమే ఈ ప్రశ్నలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు వాటిని ఎలాగూ నేర్చుకుంటారు కాబట్టి జేఈఈ మెయిన్‌కు ప్రిపరయ్యే విద్యార్థులు న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏటా తెలంగాణ నుంచి 75 వేల వరకు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 80 వేల మంది వరకు విద్యార్థులు జేఈఈ మెయిన్ రాస్తున్నారు. వారిలో మెయిన్ ద్వారా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో దాదాపు 10 వేల మందికి పైగా చేరుతున్నారు. ర్యాంకులపై ప్రభావం.. మొత్తంగా 75 ప్రశ్నలు కాగా ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 300 మార్కులకు జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రం ఉంటుంది. అందులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో 25 ప్రశ్నల చొప్పున ఇస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇచ్చే 25 ప్రశ్నల్లో 5 ప్రశ్నల చొప్పున 15 ప్రశ్నలు న్యూమరికల్ వ్యాల్యూ సమాధానంగా వచ్చేవి ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 60 మార్కులు వాటికే. కాబట్టి ర్యాంకుల ఖరారులో అవే కీలకం కానున్నాయి. కాబట్టి విద్యార్థులు న్యూమరికల్ వ్యాల్యూ సమాధానంగా వచ్చే ప్రశ్నలకు నిర్లక్ష్యం చేయొద్దని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ర్యాంకులు తారుమారు అవుతాయని చెబుతున్నారు. పైగా ఈ 15 ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి బాగా రాస్తే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుందని ఉమాశంకర్ తెలిపారు. అదే మిగతా 60 ఆబ్జెక్టివ్ విధానంలో ఇచ్చే ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. అందులో ఒక్క ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే ఒక మార్కు కోత పడుతుంది. అందుకే నెగిటివ్ మార్కులు లేని న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల్లో స్కోర్ చేసేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు. వచ్చే జనవరి 6 నుంచి 11వ తేదీ మధ్యలో, ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ మధ్యలో నిర్వహించే మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాలని సూచిస్తున్నారు. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే వారికి ఈ మూడు నెలల సమయం కీలకమైందని పేర్కొంటున్నారు. -
మే 19న జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2019 మే 19న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించాలని ఐఐటీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ రూర్కీకి అప్పగించింది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌ను ( jeeadv. ac. in) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుల స్వీరణ, పరీక్ష ఫీజు తదితర పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొంది. ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్‌ను రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దఫా పరీక్షలను 2019 జనవరి 6 నుంచి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించనుంది. వాటి ఫలితాలను అదే నెల 31 నాటికి వెల్లడించనుంది. రెండో దఫా పరీక్షలను 2019 ఏప్రిల్ 6 నుంచి 20 వరకు నిర్వహించి ఫలితాలను ఏప్రిల్ 30 నాటికి విడుదల చేయనుంది. మొత్తానికి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులను మే 1 నుంచి ప్రారంభించనుంది. రెండు దఫాల్లో జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకోనుంది. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం మే 19న పరీక్ష నిర్వహించనుంది. అందులో పేపర్–1, పేపర్–2కు హాజరైన అభ్యర్థులకే ర్యాంకులను ఇవ్వనుంది. వాటి ఆధారంగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలతోపాటు ఐఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈ నెలాఖరులోగా జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల షెడ్యూల్‌తోపాటు ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీ షెడ్యూల్ విడుదల కానుంది. గతేడాది దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 2.24 లక్షల మంది అర్హత సాధించారు. జేఈఈ మెయిన్‌లో టాప్ మార్కులు సాధించిన 2.24 లక్షల మందిలో 1.68 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో ఆ వివరాలను వెల్లడించనుంది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆన్లైన్ పరీక్ష!
* 2016 నుంచి అమలుకు సన్నాహాలు * ఆబ్జెక్టివ్ విధానం రద్దు * ఊహించి రాసే పద్ధతికి చెక్ పెట్టే యోచన * వీలైతే డిస్క్రిప్టివ్ విధానంలో పేపరు * ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు * కేంద్రానికి సిఫారసు చేసిన ఉన్నత స్థాయి కమిటీ * అక్టోబర్‌లో జేఈఈ నోటిఫికేషన్? సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో (బీటెక్) ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై ఐఐటీ ప్రవేశాల జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది. దీంతోపాటు జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఐఐటీల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జేఏఎం) పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న జేఈఈ అడ్వాన్స్డ్ పేపరు-1, పేపరు-2 పరీక్షలను 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని జేఏబీ భావిస్తోంది. అలాగే ఆబ్జెక్టివ్ విధానాన్నీ రద్దు చేయాలన్న ఆలోచనలు చేస్తోంది. ఆబ్జెక్టివ్ విధానం వల్ల ప్రశ్నపత్రంలో ఇచ్చే నాలుగు ఆప్షన్లలో (జవాబులు) విద్యార్థులు ఏదో ఒక దానిని ఊహించి సమాధానాన్ని టిక్ చేస్తుండటం వల్ల వారికి ఆ అంశంపై అవగాహన ఉండటం లేదని, ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు సంబంధించిన పూర్తి ఫార్ములా తెలియకుండానే ఐఐటీల్లోకి వచ్చేస్తున్నారన్న భావన నెలకొంది. అందుకే ఆబ్జెక్టివ్‌ను రద్దుచేసి జవాబును విద్యార్థే రాసే విధానం తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో ఒక సమస్యకు సంబంధించిన ఫార్ములా (స్టెప్ బై స్టెప్) తెలిస్తేనే తుది (ఫైనల్) జవాబు విద్యార్థికి తెలుస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని తెచ్చే అంశంపై పరిశీలన జరుపుతోంది. లేదంటే డిస్క్రిప్టివ్‌లో ఒక పేపరును పెడితే బాగుందటున్న ఆలోచనలు చేస్తోంది. ఎన్ఐటీల్లో ప్రవేశాల్లో మార్పులు ఎన్ఐటీ ప్రవేశాల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకును ఖరారు చేస్తున్నారు. ఆ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. అలాగే ఐఐటీల్లో ప్రవేశాలు పొందే విద్యార్థి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడంతోపాటు సంబంధిత ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్ష రాసిన వారిలో టాప్-20 పర్సంటైల్ ఉండాలన్న నిబంధన ఉంది. లేదా ఇంటర్లో 75 శాతం మార్కులుంటే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందులో పెద్దగా సమస్య లేకపోయినా.. అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులు విద్యార్థుల మార్కుల జాబితాలను పంపడంలో సమస్యలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆలస్యంగా జాబితా పంపుతుండగా, కొన్ని రాష్ట్రాలు తప్పులతడకతో జాబితాలు పంపుతున్నాయి. దీంతో ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేయాలని, పూర్తిగా జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల మార్కులు/ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వాటిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటే 2016 నుంచి అవి అమల్లోకి రానున్నాయి. మరోవైపు 2016లో ప్రవేశాలు, షెడ్యూలుకు సంబంధించి ఈనెల 17న జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, జేఈఈ మెయిన్ నోటిఫికేషన్‌ను వచ్చే నెల మొదటి వారంలో ఇచ్చి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి, ఏప్రిల్ మొదటి వారంలో ఆఫ్‌లైన్ పరీక్ష, 2, 3 వారాల్లో ఆన్లైన్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. తుది ఫలితాలను జూన్ చివర్లో లేదా జూలైలో ప్రకటించే అవకాశం ఉంది.