జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆన్‌లైన్ పరీక్ష! | Online exam to be conducted for JEE adavanced | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆన్‌లైన్ పరీక్ష!

Published Tue, Sep 8 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆన్‌లైన్ పరీక్ష!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆన్‌లైన్ పరీక్ష!

* 2016 నుంచి అమలుకు సన్నాహాలు
* ఆబ్జెక్టివ్ విధానం రద్దు    
ఊహించి రాసే పద్ధతికి చెక్ పెట్టే యోచన
వీలైతే డిస్క్రిప్టివ్ విధానంలో పేపరు
ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు
* కేంద్రానికి సిఫారసు చేసిన ఉన్నత స్థాయి కమిటీ
* అక్టోబర్‌లో జేఈఈ నోటిఫికేషన్?

 
 సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో (బీటెక్) ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై ఐఐటీ ప్రవేశాల జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. దీంతోపాటు జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఐఐటీల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జేఏఎం) పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నాయి.
 
 ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపరు-1, పేపరు-2 పరీక్షలను 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని జేఏబీ భావిస్తోంది. అలాగే ఆబ్జెక్టివ్ విధానాన్నీ రద్దు చేయాలన్న ఆలోచనలు చేస్తోంది. ఆబ్జెక్టివ్ విధానం వల్ల ప్రశ్నపత్రంలో ఇచ్చే నాలుగు ఆప్షన్లలో (జవాబులు) విద్యార్థులు ఏదో ఒక దానిని ఊహించి సమాధానాన్ని టిక్ చేస్తుండటం వల్ల వారికి ఆ అంశంపై అవగాహన ఉండటం లేదని, ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు సంబంధించిన పూర్తి ఫార్ములా తెలియకుండానే ఐఐటీల్లోకి వచ్చేస్తున్నారన్న భావన నెలకొంది. అందుకే ఆబ్జెక్టివ్‌ను రద్దుచేసి జవాబును విద్యార్థే రాసే విధానం తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో ఒక సమస్యకు సంబంధించిన ఫార్ములా (స్టెప్ బై స్టెప్) తెలిస్తేనే తుది (ఫైనల్) జవాబు విద్యార్థికి తెలుస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని తెచ్చే అంశంపై పరిశీలన జరుపుతోంది. లేదంటే డిస్క్రిప్టివ్‌లో ఒక పేపరును పెడితే బాగుందటున్న ఆలోచనలు చేస్తోంది.
 
 ఎన్‌ఐటీల్లో ప్రవేశాల్లో మార్పులు
 ఎన్‌ఐటీ ప్రవేశాల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకును ఖరారు చేస్తున్నారు. ఆ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. అలాగే ఐఐటీల్లో ప్రవేశాలు పొందే విద్యార్థి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడంతోపాటు సంబంధిత ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్ష రాసిన వారిలో టాప్-20 పర్సంటైల్ ఉండాలన్న నిబంధన ఉంది. లేదా ఇంటర్‌లో 75 శాతం మార్కులుంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందులో పెద్దగా సమస్య లేకపోయినా.. అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులు విద్యార్థుల మార్కుల జాబితాలను పంపడంలో సమస్యలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆలస్యంగా జాబితా పంపుతుండగా, కొన్ని రాష్ట్రాలు తప్పులతడకతో జాబితాలు పంపుతున్నాయి. దీంతో ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేయాలని, పూర్తిగా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల మార్కులు/ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
 
 వాటిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటే 2016 నుంచి అవి అమల్లోకి రానున్నాయి. మరోవైపు 2016లో ప్రవేశాలు, షెడ్యూలుకు సంబంధించి ఈనెల 17న జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, జేఈఈ మెయిన్ నోటిఫికేషన్‌ను వచ్చే నెల మొదటి వారంలో ఇచ్చి, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి, ఏప్రిల్ మొదటి వారంలో ఆఫ్‌లైన్ పరీక్ష, 2, 3 వారాల్లో ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. తుది ఫలితాలను జూన్ చివర్లో లేదా జూలైలో ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement