కీలక స్థానాల్లో, బాధ్యతాయుత పదవుల్లో వుండేవారు నిబంధనల చట్రంలో బందీలైతే... అక్కడి నుంచి బయటకు రావడానికి మొండికేస్తే, కనీసం ఆ పరిధిని మించి ఆలోచించడానికి నిరాకరిస్తే సామాన్యులకు సమస్యే. నిబంధనల అమలులో ‘చాదస్తంగా’ వుండే నేతలకూ, అధికారులకూ సుప్రీంకోర్టు తాజాగా ఒక కేసులో ఇచ్చిన తాత్కాలిక ఆదేశం కనువిప్పు కావాలి. సమస్య చాలా చిన్నది. పెద్ద మనసు చేసుకుని అధికారులు తార్కికంగా ఆలోచిస్తే అరక్షణంలో కనుమరుగయ్యే సమస్య అది. కానీ అందుకు సిద్ధపడకపోవడం వల్ల పద్దెనిమిదేళ్ల విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్ర యించాల్సివచ్చింది. ప్రతిష్టాత్మక జేఈఈ పరీక్షల్లో 270వ ర్యాంకు సాధించిన ఆగ్రా విద్యార్థి సిద్ధాంత్ బాత్రా ఆన్‌లైన్‌లో తనకు నచ్చిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కౌన్సెలింగ్‌లో మొదటి రౌండ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న బాత్రాకు సీటు కేటాయించినట్టు బొంబాయి ఐఐటీనుంచి సందేశం కూడా వచ్చింది. తదుపరి ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో పొరబాటు చేశాడు.
తనకు సీటు కేటాయింపు అయింది గనుక ఇతర రౌండ్ల అవసరం లేదనుకుని, దానికి సరిపోతుందనుకుని ‘ఫ్రీజ్’ లింకును క్లిక్ చేశాడు. దాంతో అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుందనుకున్నాడు. కానీ ఎంపిక చేసుకున్న సీటును రద్దు చేసుకోవడానికి దాన్ని ఉద్దేశిం చామని ఐఐటీ అంటోంది. ఏమైతేనేం తుది జాబితాలో అతని పేరు గల్లంతయింది. అప్పటినుంచీ ఎవరిని ఆశ్రయించినా ఆ విద్యార్థి మొర ఆలకించేవారే కరువయ్యారు. వారందరూ చెప్పిన పరిష్కారం ఒకటే– వచ్చే ఏడాది మరోసారి పరీక్షలు రాసి సీటు తెచ్చుకోవాలనే!
పనులు సజావుగా సాగడానికి రూపొందించుకున్న నిబంధనలు ఆ పనులకే ప్రతిబంధకంగా మారకూడదు. గుదిబండలు కాకూడదు. ఆ విద్యార్థి మొదట బొంబాయి ఐఐటీని, అక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. సీట్లన్నీ నిండిపోయాయి గనుక ఈ దశలో ఏం చేయలేమని ఐఐటీ చెప్పిన జవాబుతో హైకోర్టు కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిద్ధాంత్‌కు తాత్కాలిక అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. బొంబాయి ఐఐటీ మొదటే ఇలాంటి ఆలోచన చేసివుంటే దాని నిర్వాహకులను అందరూ అభినందించేవారు. ఎందు కంటే సిద్ధాంత్ అమ్మానాన్నల్ని కోల్పోయి వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో వున్నా క్లిష్టమైన జేఈఈని ఛేదించాడు. మంచి ర్యాంకు తెచ్చుకుని ప్రతిభాశాలినని నిరూపించుకున్నాడు. అలాంటి వాడు తమ సంస్థకే వన్నె తెస్తాడని ఐఐటీ గుర్తించాల్సింది. అతని కోసం ఏం చేయగలమన్న కోణంలో ఆలో చించాల్సింది. డిజిటల్ ప్రపంచం మయసభలాంటిది. అక్కడ ఏమాత్రం ఏమరు పాటుగా వున్నా తలకిందులుకావడం ఖాయం. బ్యాంకు లావాదేవీల్లో సాధారణ పౌరులకు తరచుగా ఎదురయ్యే అనుభవమే ఇది. ఆన్‌లైన్‌లో దేన్నయినా క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే హెచ్చరిక సందేశం కంప్యూటర్ స్క్రీన్‌పై వెంటనే ప్రత్యక్షమయ్యే ఏర్పా టుండాలి. అది స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా వుండాలి. తప్పు చేసిన పక్షంలో అలాంటివారిని హెచ్చ రించడానికి తగిన వ్యవస్థ కూడా వుండాలి. అంతా ఆన్‌లైన్ గనుక మధ్యలో ఇంకేమీ కుదరవంటే జనం నష్టపోతారు.
మన దేశంలో అంతంతమాత్రంగావున్న ఆన్‌లైన్ విధానంలోకి జనాన్ని మళ్లిం చడంలో పాలకులు విజయం సాధించారు. రేషన్ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గరనుంచి, బ్యాంకు లావాదేవీల వరకూ అన్నీ ఆన్‌లైన్‌కే మారుతున్నాయి. కానీ జనానికి సులభంగా బోధపడేలా ఇంటర్ ఫేస్‌లను రూపొందించడంలో, వారికి అర్థమయ్యే భాషలో వివరించడంలో అవి విఫల మవుతున్నాయి. దాంతో ఒక ప్రత్యామ్నాయానికి బదులు మరొకటి ఎంచుకుని జనం ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇప్పటికే అనేకచోట్ల కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే రోబోలతో పనులు కానిస్తుండగా, మున్ముందు వాటి పాత్ర మరింతగా పెరుగుతుందంటున్నారు. మంచిదే. వాటివల్ల పనులు చిటికెలో పూర్తవుతుంటే కాదనేవారుండరు. కానీ ఈ క్రమంలో మనుషులే రోబోలుగా మారకూడదు. గిరి గీసుకుని వుండిపోకూడదు. భిన్నంగా ఆలోచించబట్టే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, ఆరోగ్యశ్రీవంటివి రూపొందించి నిరుపేద వర్గాల వారు సైతం ఉన్నత చదువులు చదవడానికి, వారికి మెరుగైన వైద్యం లభించడానికి మార్గం సుగమం చేశారు. దేనిలోనైనా సమస్యలుంటాయి. మానవీయ కోణంలో ఆలోచిస్తే వాటికి సులభంగా పరి ష్కారాలు లభిస్తాయి. ఆచరణలో వచ్చే అనుభవాలతో ఆ పరిష్కారాలకు మరింత మెరుగు పెట్టవచ్చు.
ఐఐటీ ఉన్నతాధికార వర్గంలో ఇప్పుడు కనబడిన ధోరణి కొంచెం హెచ్చుతగ్గులతో దాదాపు అన్ని వ్యవస్థల్లోనూ ఉంటున్నది. రెండున్నరేళ్లుగా అంతూ దరీ లేకుండా సాగుతున్న భీమా కోరెగావ్ కేసు విచారణలో ఖైదీలుగా వున్న ఫాదర్ స్టాన్‌స్వామి, పౌరహక్కుల నాయకుడు గౌతం నవలఖాలకు ఎదురైన సమస్యలే ఇందుకు ఉదాహరణ. పార్కిన్‌సన్ వ్యాధి వల్ల మంచినీరు తాగాలన్నా కష్టమ వుతోందని, సిప్పర్, స్ట్రా అందజేయాలని స్టాన్‌స్వామి కోరితే దాన్ని నెరవేర్చడానికి జైలు అధికారులు నెలరోజుల సమయం తీసుకున్నారు. అది కూడా న్యాయస్థానం జోక్యం తర్వాతే. గౌతం నవలఖా కళ్లజోడు కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. ఈ తీరు చూసిన ధర్మాసనం జైలు అధికారులు సున్నితంగా, మానవీయంగా ఆలోచించడం కోసం వారికి ప్రత్యేక పాఠాలు చెప్పించా లేమోనన్న సందేహం వ్యక్తం చేసింది. అనుకోని సమస్యలు తలెత్తినప్పుడు ఉన్నంతలో తక్షణ పరి ష్కారంగా ఏం చేయాలన్న ఆలోచన కలగాలంటే అధికారుల్లో సృజనాత్మకత వుండాలి. బాధితు లపట్ల సహానుభూతి వుండాలి. అప్పుడే మెరుగైన నిబంధనలు అమలులోకొస్తాయి. అలా ఆలోచిం చగలిగేవారే చరిత్రలో నిలిచిపోతారు. అందరికీ మార్గదర్శకులవుతారు.
Comments
Please login to add a commentAdd a comment