IIT Mumbai
-
జోసా కౌన్సెలింగ్‌లో జోష్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఈ ఏడాది భారీ మార్పు కన్పిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం తొలిదశ సీట్లు కేటాయించింది. అయితే ఈసారి ఐఐటీల్లో 900 సీట్లు అదనంగా పెరిగాయి. దీంతో సీట్ల కేటాయింపు కటాఫ్ పెరిగింది. ముంబై ఐఐటీలో బాలికల విభాగంలో గత ఏడాది 305 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 421వ ర్యాంకు కూడా సీటు వచ్చింది. హైదరాబాద్ ఐఐటీలో బాలుర విభాగంలో 585 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 649 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. వరంగల్ నిట్‌లో బాలుర విభాగంలో 1664 ర్యాంకుకు గత ఏడాది సీటొస్తే, ఈసారి 2698 ర్యాంకుకు సీటు వచ్చింది. బాలికల విభాగంలో పోయినసారి 3593 ర్యాంకుకు సీటొస్తే, ఈసారి 4625 ర్యాంకుకు కూడా సీటు వచ్చింది. ఇక ఏపీ నిట్‌లో బాలికల విభాగంలో గత ఏడాది 17873 కటాఫ్ ఉంటే, ఈసారి ఇది 23130కి పెరిగింది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఐఐటీలు మినహా అన్ని జాతీయ కాలేజీల్లో ర్యాంకును బట్టి సీటు కేటాయిస్తారు. ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు ఇస్తారు. జోసా మొత్తం ఐడు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ముంబై ఐఐటీలోనే టాపర్లుజేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ముంబై ఐఐటీకే ప్రాధాన్యమిచ్చారు. టాపర్లంతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపారు. ఓపెన్ కేటగిరీలో ముంబై ఐఐటీలో తొలి ర్యాంకు మొదలుకుని 68వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. బాలికల విభాగంలోనూ 7వ ర్యాంకు సహా 421వ ర్యాంకు వరకూ సీట్లు పొందారు. తర్వాత స్థానంలో ఢిల్లీ ఐఐటీ ఉంది. ఇక్కడ 116లోపు ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. కాన్పూర్ ఐఐటీలోనూ పోటీ ఎక్కువగానే ఉంది. ఓపెన్ కేటగిరీలో 226 ర్యాంకుతో ప్రారంభమై 414 ర్యాంకుతో ముగిసింది. హైదరాబాద్ ఐఐటీలో సీఎస్సీ ఓపెన్ కేటగిరీలో 431వ ర్యాంకుతో మొదలై 649వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. చివరి కౌన్సెలింగ్ వరకు చూడాలి గత కొన్నేళ్ళతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కటాఫ్ ఊహించని విధంగా పెరిగింది. సీట్లు పెరగడమే దీనికి కారణం. విద్యార్థులు చివరి కౌన్సెలింగ్ వరకూ వేచి చూస్తే తప్పకుండా మంచి అవకాశాలు రావచ్చు. రెండో దశ కౌన్సెలింగ్ నుంచి ఆప్షన్లు ఇచ్చే ముందు సీట్ల కేటాయింపుపై కొంత కసరత్తు చేయాలి. – ఎంఎన్ రావు (గణిత శాస్త్ర నిపుణులు) -
ఎక్కడ చదివామన్నది కాదు..! జాబ్ వచ్చిందా? రాలేదా?
అహర్నిశలు కష్టపడి, పోటీ పరీక్షల్లో నెగ్గి ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాగోలా సీటు సంపాదిస్తున్నారు. ఇకేముంది ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు వచ్చింది కదా.. కొలువు గ్యారెంటీ అనుకుంటున్నారేమో. కాలం మారింది. కంపెనీల తీరు మారింది. ప్రముఖ సంస్థలు ఉద్యోగార్థుల్లో చూసే క్వాలిటీ మారింది. దాంతో ఎంతపెద్ద విద్యాసంస్థలో టాప్ ర్యాంకుతో డిగ్రీ పూర్తి చేసినా కొన్నిసార్లు కొలువు దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీ సంస్థల్లో ఐఐటీ-ముంబయికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే కదా. అయితే ఆ సంస్థలోని 36 శాతం గ్రాడ్యుయేట్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల్లో కొలువు సాధించలేకపోయారు. గతంలోనూ ఐఐఎం సంస్థల్లోని విద్యార్థులు కూడా కొలువులు రాక ఇతర మార్గాలను ఎంచుకున్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి. దాంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ చదివామని కాకుండా.. ఏం చదివామనే దానిపై దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం కంపెనీలు ప్రధానంగా మూలధన పెట్టుబడివైపు ఆసక్తి కనబరిచేవి. నిజానికి ఆ సమయంలో సంస్థలు ఆశించిన మేరకు అభివృద్ధి చెందాయి. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులు, బౌగోళిక అనిశ్చితులు, ఖర్చులు తగ్గించుకోవడం, ఉన్నంతలో ఏయే విభాగాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చో తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఉత్పత్తి ఆధారిత కంపెనీలు ప్రధానంగా మిషనరీ, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తాయి. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం వేతనాల రూపంలో తమ ఉద్యోగులపైనే భారీగా పెట్టుబడి పెడుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాస్ట్‌కటింగ్ పేరిట ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో చాలా మంది టెకీలు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు అత్యవసరమైతే తప్పా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒకవేళ రిక్రూట్మెంట్ చేసినా టాప్ ఇన్స్టిట్యూట్ల నుంచే కొలువులు భర్తీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఐఐటీ, ఐఐఎంల్లో చదివినా కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేవని సంస్థలు గ్రహిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని పక్కనపెట్టేస్తున్నాయి. పైగా ఐఐటీ, ఐఐఎంలో చదివిన వారు అధిక వేతనాలు ఆశిస్తున్నారు. ఇదికూడా ఒకింత ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అవుతోంది. దాంతో ప్రముఖ సంస్థల్లో చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐఐటీ ముంబయిలో తాజాగా 2000 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరైతే 712 మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 2023లో 85 మంది ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.కోటికి పైగా జీతాలతో ఉద్యోగాలు వచ్చినట్లు ముందుగా ప్రకటించారు. కానీ దాన్ని సవరించి కేవలం 22 మందికే ఈ వేతనం వరిస్తుందని కంపెనీలు చెప్పడం గమనార్హం. ఐఐఎంల్లోనూ అదే తీరు.. ఐఐఎం విద్యార్థులను కంపెనీలు ప్రధానంగా మేనేజ్మెంట్ స్థాయిలో ట్రెయినీలుగా నియమించుకుంటాయి. ప్రస్తుత అనిశ్చితుల గరిష్ఠ వేతనాలు కలిగిన టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా కంపెనీలు ఆలోచించడం లేదనే వాదనలున్నాయి. ఒకవేళ కొన్ని కంపెనీలు తమ అవసరాల కొద్దీ ఉద్యోగాలు కల్పించినా దాదాపు 10-15 శాతం వేతనాలు తగ్గించి ఆఫర్ లేటర్లు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఐఐఎంలో చదివి కొన్నేళ్లు ఉద్యోగం చేసి కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారిపై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపుతారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ ఊసే లేకుండాపోయిందని నిపుణులు చెబుతున్నారు. కనీసం రిటైల్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల్లో సైతం ఉద్యోగాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: క్రియేటివిటీ పేరుతో అరాచకం..! భారత్‌లో నిరక్షరాస్యత, అరకొర పారిశ్రామికోత్పత్తి, నాసిరకం నైపుణ్యాలు తదితరాలు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. భారత్, చైనా వంటి దేశాలు తమ యువతకు సరైన ఉపాధి కల్పిస్తే ప్రపంచ జీడీపీ ఒక్కపెట్టున విజృంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కాలంతో పాటు సాంకేతికతలూ మారుతున్నాయి. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో వృత్తి శిక్షణ ఇస్తే కొత్త తరం ఉద్యోగాలకు కావాల్సిన సిబ్బంది తయారవుతారు. అధునాతన సాంకేతికతల వినియోగం, ఇంక్యుబేషన్ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ఐఐటీల్లో మరిన్ని సీట్లు.. కటాఫ్ మేజిక్‌లో మార్పు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లను పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పాయి. కొన్ని ఆన్లైన్ కోర్సులను కూడా అందించాలనే ప్రతిపాదనను ఐఐటీలు చేశాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచి్ఛకంగా ఎంచుకున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది కనీసం 4 వేల కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగే వీలుంది. ప్రస్తుతం ఐఐటీల్లో 15 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ముంబైకి మొదటి ప్రాధాన్యం సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే ముంబై ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఈ కాలేజీని జేఈఈ అడ్వాన్స్ ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిచ్చారు. తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. ముంబై ఐఐటీల్లో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని ఐఐటీలు భావిస్తున్నాయి. ఎన్ఐటీల్లో చాన్స్ పెరిగేనా? వచ్చే సంవత్సరం ఎన్ఐటీల్లో కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల కొంతమంది ఐఐటీల్లో చేరతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ 2022లో 1,996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2023లో బాలురకు 3,115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుంది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్ ను ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం గమనార్హం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. ఈసారి సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
ఓటరు మనసు పసిగట్టే..ఏఐ మంత్రం!
రోజురోజుకు సరికొత్తగా మారుతూ వస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్–ఏఐ) అసెంబ్లీ రాజకీయ సమరాంగణంలోకి కూడా అడుగుపెట్టింది. ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలను వడపోసి ఓటర్ల నాడి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ పార్టీల నాయకుల పట్ల ప్రజల మనోగతాన్ని విశ్లేషించబోతోంది. ముంబై ఐఐటీ విద్యార్థులు ఈ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. కృత్రిమ మేధపై అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన విద్యార్థులు, హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి.. ఒక ప్రాజెక్టు వర్క్‌గా దీనిని చేపట్టాలని నిర్ణయించారు. విద్యార్థుల ప్రయోగ ఫలితాలను సీనియర్ ప్రొఫెసర్లు విశ్లేషించనున్నారు. వివిధ సర్వేల మాదిరిగానే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా ఓటర్ల మూడ్‌ను గుర్తించి ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీన్ని ప్రయోగ స్థాయిలోనే చూడాలని.. ఎన్నికల ఫలితాలతో ఏఐ పరిశీలన సమాచారాన్ని సరిపోల్చిచూడాలని ముంబై ఐఐటీ విద్యార్థులు నిర్ణయించారు. ఇది విజయవంతమైతే వివిధ ఎన్నికల్లో మరింతగా పరిశీలన జరిపే ఆలోచనలో ఉన్నారు. బహిరంగ సభల నుంచి కూడా.. ఆన్లైన్ విద్యావిధానంలో ఆయా విద్యార్థులు క్లాసులు సరిగా వింటున్నారా, లేదా? అన్నది పసిగట్టేందుకు కృత్రిమమేధను ఉపయోగిస్తుంటారు. ఆకస్మికంగా అనుబంధ ప్రశ్నలు వేయడం, వచ్చే సమాధానాల ద్వారా విద్యార్థి ఏకాగ్రతను గుర్తించడం చేస్తుంటారు. వైద్యరంగంలోనూ రోగి అందుకున్న వైద్యసేవల ఆధారంగా, తీసుకున్న మందుల ద్వారా భవిష్యత్ వ్యాధులను ఏఐ అంచనా వేస్తోంది. ఇలాంటి విజయాలను ఆధారంగా చేసుకుని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రజల మానసిక ధోరణిని తెలుసుకునే కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసేందుకు ప్రయోగాలు చేపట్టింది. దీని ఆధారంగానే ఇప్పుడు ముంబై ఐఐటీ విద్యార్థులు ఎన్నికల్లో ప్రజల మూడ్‌ను తెలుసుకునే ప్రయోగానికి సిద్ధమయ్యారు. ముఖ్యనేతల సభలకు హాజరయ్యే ప్రజల ఫొటోలు, వీడియోలను సదరు సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు. అందులోని జనం హావభావాలను కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ నిశితంగా పరిశీలిస్తుంది. కోడ్ భాషలో కొన్ని సంకేతాలు పంపుతుంది. వీటిని విశ్లేషించడం ద్వారా ఆ సభలో ఓటరు తీరు ఎలా ఉంది? అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది పరిశీలిస్తారు. నాయకుడు మాట్లాడిన అంశాలపై ప్రజలు ఏరకంగా స్పందించారనేదానిపై అంచనా వేస్తారు. సోషల్ మీడియాలో పసిగట్టేలా.. ఫేస్బుక్,ఎక్స్(ట్విట్టర్),ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి పోస్టులు సాధా రణంగా వారి పొలిటికల్ మూడ్‌ను స్పష్టం చేస్తాయని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ఓ పరిశీలనలో గుర్తించింది.యువత సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలో ఐఐటీ విద్యార్థులు కొన్ని నియోజకవర్గాల్లో యువత సామాజిక పోస్టులను ఏఐ ప్రోగ్రామ్‌కు జోడించి, మెజారిటీ యూత్ మనోభావాలను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు. ఇది వ్యక్తిగత సమాచారం కిందకు ఏమీ రాదని న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రయోగాన్ని యువత వరకే పరిమితం చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, వాటిపై సానుకూల, ప్రతికూల ఫలితాలను కూడా ఏఐ విశ్లేషించే వీలుందని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు ఏదైనా పథకంపై వివిధ వర్గాల నుంచి మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్‌ను ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్ ద్వారా విశ్లేషించి.. ఆపథకం ప్రభావంపై అంచనా వేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ఏఐతోనే ప్రధాన సర్వేలు అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. పైథాన్‌తోపాటు పలు రకాల సాంకేతిక లాంగ్వేజీల ఆధారంగా నిపుణులు ఏఐ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. యూట్యూబ్‌లో మనం ఓ వీడియో చూస్తున్నప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటో అంచనా వేసి, అదే తరహా వీడియోలు వరుసగా వస్తుండటానికి అలాంటి ప్రోగ్రామ్‌లే కారణం. ఇంతగా అభివృద్ధి చెందిన ఏఐ.. ఇప్పుడు రాజకీయంగా ఓటర్ల నాడిని వందశాతం విశ్వసనీయతతో పసిగడుతుందని చెప్పవచ్చు. ఈ తరహా ప్రయోగాల్లో ఐఐటీ విద్యార్థులు చూపిస్తున్న ఆసక్తిని అభినందించాల్సిందే. స్టాన్‌ఫర్డ్‌లో ఈ తరహా ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. – ఎన్వీ రమణారావు, ఎన్ఐటీ డైరెక్టర్, రాయ్‌పూర్ వివిధ టూల్స్ క్రోడీకరణతో కచ్చితమైన ఫలితాలు క్లౌడ్ థింకింగ్ ఇప్పటికే విస్తరించింది. అనేక రకాల సమాచారం నిక్షిప్తమైంది. కృత్రిమ మేధ కూడా ఒక టూల్. రాజకీయ సర్వేల్లో దీని భాగస్వామ్యం ఇప్పటికిప్పుడు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కాకపోతే క్లౌడ్ ఆధారిత డేటా విశ్లేషణతో భవిష్యత్‌లో దీని ప్రాధాన్యత ఉందనేది సుస్పష్టం. – ఎస్జీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్, ఎంవీఎస్ఆర్ కాలేజీ - వనం దుర్గాప్రసాద్ -
సర్వీస్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ బ్యాంకు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సర్వీస్ చార్జీల విషయంలో ఐఐటీ-బాంబే ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం సంచలనంగా మారింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి 2015-2020 మధ్య రూ.300 కోట్లు సర్వీస్ ఛార్జీల రూపంలో బ్యాంకు వసూలు చేసినట్లు ఆ అధ్యయనం ముఖ్య సారాంశం. ఎస్బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఇలా సేవల పేరుతో అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఐఐటీ-బాంబే బాంబు పేల్చింది. సర్వీస్ చార్జీల విషయంపై ఎస్బీఐ వివరణ ఇచ్చింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు గల ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల వినియోగించిన తర్వాత ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. 2016 జూన్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయని, ఈ ఛార్జీలపై ఖాతాదారులకు ముందుగానే సమాచారం ఇస్తున్నామని ఎస్బీఐ వివరణ ఇచ్చింది. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు 2012 ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. అయితే అదనపు సేవలు పొందే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంటుంది కాబట్టి ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు చెల్లించాల్సిందే అని పేర్కొంది. చదవండి: వామ్మో! ఎస్బీఐ ఛార్జీల రూపంలో ఇంత వసూలు చేసిందా? -
ఐఐటీకి ‘సుప్రీం’ పాఠం
కీలక స్థానాల్లో, బాధ్యతాయుత పదవుల్లో వుండేవారు నిబంధనల చట్రంలో బందీలైతే... అక్కడి నుంచి బయటకు రావడానికి మొండికేస్తే, కనీసం ఆ పరిధిని మించి ఆలోచించడానికి నిరాకరిస్తే సామాన్యులకు సమస్యే. నిబంధనల అమలులో ‘చాదస్తంగా’ వుండే నేతలకూ, అధికారులకూ సుప్రీంకోర్టు తాజాగా ఒక కేసులో ఇచ్చిన తాత్కాలిక ఆదేశం కనువిప్పు కావాలి. సమస్య చాలా చిన్నది. పెద్ద మనసు చేసుకుని అధికారులు తార్కికంగా ఆలోచిస్తే అరక్షణంలో కనుమరుగయ్యే సమస్య అది. కానీ అందుకు సిద్ధపడకపోవడం వల్ల పద్దెనిమిదేళ్ల విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్ర యించాల్సివచ్చింది. ప్రతిష్టాత్మక జేఈఈ పరీక్షల్లో 270వ ర్యాంకు సాధించిన ఆగ్రా విద్యార్థి సిద్ధాంత్ బాత్రా ఆన్లైన్లో తనకు నచ్చిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సెలింగ్‌లో మొదటి రౌండ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న బాత్రాకు సీటు కేటాయించినట్టు బొంబాయి ఐఐటీనుంచి సందేశం కూడా వచ్చింది. తదుపరి ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో పొరబాటు చేశాడు. తనకు సీటు కేటాయింపు అయింది గనుక ఇతర రౌండ్ల అవసరం లేదనుకుని, దానికి సరిపోతుందనుకుని ‘ఫ్రీజ్’ లింకును క్లిక్ చేశాడు. దాంతో అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుందనుకున్నాడు. కానీ ఎంపిక చేసుకున్న సీటును రద్దు చేసుకోవడానికి దాన్ని ఉద్దేశిం చామని ఐఐటీ అంటోంది. ఏమైతేనేం తుది జాబితాలో అతని పేరు గల్లంతయింది. అప్పటినుంచీ ఎవరిని ఆశ్రయించినా ఆ విద్యార్థి మొర ఆలకించేవారే కరువయ్యారు. వారందరూ చెప్పిన పరిష్కారం ఒకటే– వచ్చే ఏడాది మరోసారి పరీక్షలు రాసి సీటు తెచ్చుకోవాలనే! పనులు సజావుగా సాగడానికి రూపొందించుకున్న నిబంధనలు ఆ పనులకే ప్రతిబంధకంగా మారకూడదు. గుదిబండలు కాకూడదు. ఆ విద్యార్థి మొదట బొంబాయి ఐఐటీని, అక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. సీట్లన్నీ నిండిపోయాయి గనుక ఈ దశలో ఏం చేయలేమని ఐఐటీ చెప్పిన జవాబుతో హైకోర్టు కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిద్ధాంత్‌కు తాత్కాలిక అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. బొంబాయి ఐఐటీ మొదటే ఇలాంటి ఆలోచన చేసివుంటే దాని నిర్వాహకులను అందరూ అభినందించేవారు. ఎందు కంటే సిద్ధాంత్ అమ్మానాన్నల్ని కోల్పోయి వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో వున్నా క్లిష్టమైన జేఈఈని ఛేదించాడు. మంచి ర్యాంకు తెచ్చుకుని ప్రతిభాశాలినని నిరూపించుకున్నాడు. అలాంటి వాడు తమ సంస్థకే వన్నె తెస్తాడని ఐఐటీ గుర్తించాల్సింది. అతని కోసం ఏం చేయగలమన్న కోణంలో ఆలో చించాల్సింది. డిజిటల్ ప్రపంచం మయసభలాంటిది. అక్కడ ఏమాత్రం ఏమరు పాటుగా వున్నా తలకిందులుకావడం ఖాయం. బ్యాంకు లావాదేవీల్లో సాధారణ పౌరులకు తరచుగా ఎదురయ్యే అనుభవమే ఇది. ఆన్లైన్లో దేన్నయినా క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే హెచ్చరిక సందేశం కంప్యూటర్ స్క్రీన్‌పై వెంటనే ప్రత్యక్షమయ్యే ఏర్పా టుండాలి. అది స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా వుండాలి. తప్పు చేసిన పక్షంలో అలాంటివారిని హెచ్చ రించడానికి తగిన వ్యవస్థ కూడా వుండాలి. అంతా ఆన్లైన్ గనుక మధ్యలో ఇంకేమీ కుదరవంటే జనం నష్టపోతారు. మన దేశంలో అంతంతమాత్రంగావున్న ఆన్లైన్ విధానంలోకి జనాన్ని మళ్లిం చడంలో పాలకులు విజయం సాధించారు. రేషన్ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గరనుంచి, బ్యాంకు లావాదేవీల వరకూ అన్నీ ఆన్‌లైన్‌కే మారుతున్నాయి. కానీ జనానికి సులభంగా బోధపడేలా ఇంటర్ ఫేస్‌లను రూపొందించడంలో, వారికి అర్థమయ్యే భాషలో వివరించడంలో అవి విఫల మవుతున్నాయి. దాంతో ఒక ప్రత్యామ్నాయానికి బదులు మరొకటి ఎంచుకుని జనం ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇప్పటికే అనేకచోట్ల కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే రోబోలతో పనులు కానిస్తుండగా, మున్ముందు వాటి పాత్ర మరింతగా పెరుగుతుందంటున్నారు. మంచిదే. వాటివల్ల పనులు చిటికెలో పూర్తవుతుంటే కాదనేవారుండరు. కానీ ఈ క్రమంలో మనుషులే రోబోలుగా మారకూడదు. గిరి గీసుకుని వుండిపోకూడదు. భిన్నంగా ఆలోచించబట్టే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ఆరోగ్యశ్రీవంటివి రూపొందించి నిరుపేద వర్గాల వారు సైతం ఉన్నత చదువులు చదవడానికి, వారికి మెరుగైన వైద్యం లభించడానికి మార్గం సుగమం చేశారు. దేనిలోనైనా సమస్యలుంటాయి. మానవీయ కోణంలో ఆలోచిస్తే వాటికి సులభంగా పరి ష్కారాలు లభిస్తాయి. ఆచరణలో వచ్చే అనుభవాలతో ఆ పరిష్కారాలకు మరింత మెరుగు పెట్టవచ్చు. ఐఐటీ ఉన్నతాధికార వర్గంలో ఇప్పుడు కనబడిన ధోరణి కొంచెం హెచ్చుతగ్గులతో దాదాపు అన్ని వ్యవస్థల్లోనూ ఉంటున్నది. రెండున్నరేళ్లుగా అంతూ దరీ లేకుండా సాగుతున్న భీమా కోరెగావ్ కేసు విచారణలో ఖైదీలుగా వున్న ఫాదర్ స్టాన్‌స్వామి, పౌరహక్కుల నాయకుడు గౌతం నవలఖాలకు ఎదురైన సమస్యలే ఇందుకు ఉదాహరణ. పార్కిన్సన్ వ్యాధి వల్ల మంచినీరు తాగాలన్నా కష్టమ వుతోందని, సిప్పర్, స్ట్రా అందజేయాలని స్టాన్‌స్వామి కోరితే దాన్ని నెరవేర్చడానికి జైలు అధికారులు నెలరోజుల సమయం తీసుకున్నారు. అది కూడా న్యాయస్థానం జోక్యం తర్వాతే. గౌతం నవలఖా కళ్లజోడు కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. ఈ తీరు చూసిన ధర్మాసనం జైలు అధికారులు సున్నితంగా, మానవీయంగా ఆలోచించడం కోసం వారికి ప్రత్యేక పాఠాలు చెప్పించా లేమోనన్న సందేహం వ్యక్తం చేసింది. అనుకోని సమస్యలు తలెత్తినప్పుడు ఉన్నంతలో తక్షణ పరి ష్కారంగా ఏం చేయాలన్న ఆలోచన కలగాలంటే అధికారుల్లో సృజనాత్మకత వుండాలి. బాధితు లపట్ల సహానుభూతి వుండాలి. అప్పుడే మెరుగైన నిబంధనలు అమలులోకొస్తాయి. అలా ఆలోచిం చగలిగేవారే చరిత్రలో నిలిచిపోతారు. అందరికీ మార్గదర్శకులవుతారు. -
ముంబై నమూనాతో వరదలకు చెక్
- నాలాల విస్తరణతోపాటు నగరమంతా రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేయాలి - ముంబై ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ కపిల్ గుప్తా సాక్షి, హైదరాబాద్: మానవ తప్పిదాలతోనే హైదరాబాద్ నగరం వరద ముంపునకు గురైందని.. ప్రభుత్వం, ప్రజలు, పౌర సమాజం సమష్టిగా సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరముందని ముంబై ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ కపిల్ గుప్తా పేర్కొన్నారు. ముంబై నగరం 2005లో వరద ముంపునకు గురై భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసిందని, అనంతరం వరదల నివారణ కోసం అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో సైతం ఈ పద్ధతులను అమలు చేస్తే సత్ఫలితాలిస్తాయన్నారు. నాలాలను విస్తరించడంతో పాటు నగరమంతా రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో మూసీ నదికి 1908లో వరదలు సంభవించి బుధవారానికి 108 ఏళ్లు పూర్తై సందర్భంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ముఫకంజా కాలేజీ ఆడిటోరియంలో ‘వర్షాలపై సంసిద్ధత’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంబైలో అమలు చేస్తున్న వరద నిర్వహణ పద్ధతులను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నిజాంపేట చెరువు నుంచి ప్రగతినగర్ చెరువుకు వరద నీటిని తీసుకెళ్లే నాలా కబ్జాలతో కుంచించుకుపోవడం వల్లే భండారి లేఅవుట్ కాలనీ ముంపునకు గురైందన్నారు. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైతే సంబంధిత క్యాచ్మెంట్ ఏరియాల్లో ఏ మేరకు వరదలు వస్తాయి? వరద ముంపు పొంచి ఉండే ప్రాంతాలు ఏవీ? వంటి సమాచారం ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడికక్కడ వర్షపాతాన్ని నమోదు చేసేందుకు ముంబైలో 60 రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేసి వరద తీవ్రతను కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నారన్నారు. నగరంలోని ప్రతి ఇంట్లో కనీసం 1,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకునే విధంగా అండర్ గ్రౌండ్ ట్యాంకులను నిర్మించినా నగరం వరద ముంపునకు గురికాదన్నారు. నాలాలు, మురికి కాల్వల్లో పూడిక, చెత్త పేరుకుపోవడంతో నగరంలో వరద తీవ్రత మరింత పెరిగిందని వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్ అవసరం వర్షాలను ఎదుర్కొనేందుకు నగరం సర్వసన్నద్ధంగా మారేందుకు మాస్టర్‌ప్లాన్ అవసరమని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. రానున్న 200 ఏళ్ల అవసరాలను తీర్చే విధంగా ఈ ప్లాన్ ఉండాలన్నారు. నగరం అంతటా రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేసి.. నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్‌లకు వచ్చే వరద నీటిని అంచనా వేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్తలు డాక్టర్ మురళీధరన్, ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు, బీవీ సుబ్బారావు, డాక్టర్ ఇంద్రాసేన రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ మోహన్ కందా తదితరులు పాల్గొన్నారు. -
ముందు ఐఐటీ ముంబై.. ఆ తర్వాత సివిల్స్
ఇంజనీరింగ్ టాపర్ సాయితేజ హైదరాబాద్: ‘నా తొలి లక్ష్యం ఐఐటీ ముంబైలో సీటు సాధించడమే. ఆ తర్వాత సివి ల్స్ టాపర్‌గా నిలవాలనుకుంటున్నా’ - ఇదీ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 160 మార్కులకు 160 మార్కులు సాధించిన ఇంజనీరింగ్ టాపర్‌తాళ్లూరి సాయితేజ మనోగతం. చదువుల తల్లి ముద్దుబిడ్డసాయి ఏపీ ఎంసెట్‌లోనూ ఏడో ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ఐఐటీ జేఈఈలోనూ 345 మార్కులతో ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. జేఈఈ అడ్వాన్స్‌లోనూ 300కు పైగా మార్కులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తండ్రే తనకు ఆదర్శమంటున్న సాయి, రోజూ ఉదయం ఆరింటి నుంచి రాత్రి 10.30 దాకా చదువుపైనే దృష్టి పెట్టానని వివరించాడు. సివిల్స్‌లో ర్యాంక్ సాధించి ప్రజలకు నేరుగా మెరుగైన సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. జూనియర్ సైన్స్-2014లో గోల్డ్‌మెడల్ సాధించిన సాయి ప్రస్తుతం ముంబైలో జాతీయ స్థాయి ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నాడు. సాయితేజ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తండ్రి చలపతిరావు భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. తన కుమారుడు సివిల్ సర్వెంట్‌గా సేవలందిస్తే చూడాలని ఉందని ఆయన చెప్పారు. లేదంటే సొంతంగా ఐటీ కంపెనీ స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
ఐఐటీ ముంబై ద్వారా ఉచిత సాఫ్ట్వేర్ శిక్షణ
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): ఐఐటీ ముంబై ద్వారా డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు దూరవిద్య విధానంలో సాఫ్ట్వేర్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు ఓయూ ప్లేస్మెంట్ సర్వీస్ డెరైక్టర్ ప్రొఫెసర్ కేవీ అచలపతి తెలిపారు. ఓయూ పరిధిలోని క్యాంపస్ కళాశాలలతో పాటు అనుబంధ, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడవచ్చు. -
ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను బుధవారం ఐఐటీ ముంబయి విడుదల చేసింది. ఒకరోజు ముందుగానే ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో మొత్తం 26, 456 మంది అర్హత సాధించారు. అర్హత సాధించినవారిలో 3,040 మంది బాలికలు ఉన్నారు. తొలి పది ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు పలు ర్యాంకులను దక్కించుకోగా, చెన్నై జోన్‌కు 5 ర్యాంకులు వచ్చాయి. ఎస్సీ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన తురకభవన్కు తొలి ర్యాంకు వచ్చింది. ఎస్టీ విభాగంలో విశాఖ జిల్లాకు చెందిన హర్షమీనాకు తొలి ర్యాంకు దక్కింది. ఓబీసీ విభాగంలో విజయనగరానికి చెందిన సందీప్ కుమార్‌కు తొలి ర్యాంకు దక్కింది. కాగా, ఓపెన్ కేటగిరీలో ఆహ్వాన రెడ్డికి ఆరోవ ర్యాంకు, కామన నాగేందర్ రెడ్డి నాల్గోవ ర్యాంకు దక్కించుకున్నాడు. -
అందరి దృష్టి ఐఐటీ ముంబైపైనే!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన అందరు విద్యార్థుల లక్ష్యం ముంబై ఐఐటీలో చేరడమే. అందులోనూ కంప్యూటర్ సైన్స్‌లో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అందులోనూ చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలను పెడతామని పేర్కొనగా కొంతమంది సివిల్స్ సర్వీసెస్, రొబోటిక్స్‌లో పరిశోధన తమ లక్ష్యాలని తెలిపారు. ఐఐటీలో ర్యాంకు సాధించడానికి తాము రోజూ 10 నుంచి 12 గంటలు చదివామని వివరించారు. పలువురు ర్యాంకర్ల అభిప్రాయాలివీ.. సివిల్స్ నా జీవిత లక్ష్యం సివిల్ సర్వీసెస్ సాధించడమే నా జీవిత లక్ష్యం. మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని కొందుర్గు మండలంలోని ముత్పూర్ గ్రామం. చాలా వెనుకబడిన ప్రాంతం. సివిల్స్ సాధించడం వల్ల మా గ్రామాల్లాంటివాటిని అభివృద్ధి చేయవచ్చు. అయితే ముందు గా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. తరువాత సివిల్స్‌పై దృష్టి పెడతా. నాన్న సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అమ్మ నిర్మల టీచర్. - చింతకింది సాయిచేతన్, రెండో ర్యాంకర్, మహబూబ్‌నగర్ రొబోటిక్స్‌లో పరిశోధన చేస్తా రొబోటిక్స్‌లో పరిశోధన చేయడమే జీవిత లక్ష్యం. ముందుగా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. మాది చిత్తూరు జిల్లా తిరుపతి పక్కనున్న పుత్తూరు. నాన్న సురేష్ ఎయిర్‌ఫోర్స్‌లో వారెంట్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ సుధారాణి టీచర్. - రావూరు లోహిత్, 4వ ర్యాంకర్, చిత్తూరు ప్రతిభావంతులకు ఉపాధి కల్పిస్తా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో చేరుతా. నాన్న సురేష్‌బాబు పారిశ్రామికవేత్త. అమ్మ రాధ కూడా వ్యాపారం చేస్తారు. - సి.జయత్ శంకర్, 5వ ర్యాంకర్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీనే లక్ష్యం ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదువుతాను. సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపిస్తా. ఆ రంగంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నదే లక్ష్యం. నాన్న నారాయణరావు సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు. అమ్మ దీప గృహిణి. - నందిగం పవన్‌కుమార్, 9వ ర్యాంకర్, రంగారెడ్డి ఉపాధి అవకాశాలు పెంచుతా సొంతంగా కంపెనీ స్థాపించాలన్నదే నా లక్ష్యం. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతాను. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరుతా. నాన్న వెంకట్‌రెడ్డి వ్యాపారవేత్త. అమ్మ వనిత గృహిణి. - వి.యశ్వంత్‌రెడ్డి, 10వ ర్యాంకర్, నల్లగొండ(హైదరాబాద్‌లో స్థిరపడ్డారు) మంచి పేరు తెచ్చుకుంటా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాను. త్వరలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటా. నాన్న తిరుపాల్‌రెడ్డి డాక్టర్. అమ్మ ఉమాదేవి కూడా డాక్టరే. - కె.ఉదయ్, 11వ ర్యాంకర్, కర్నూలు సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తా సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తా. తద్వారా ప్రతిభావంతులకు ఉపాధి కల్పించాల న్నదే నా లక్ష్యం. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. నాన్న ఆదినారాయణరెడ్డి దూరదర్శన్‌లో ఉద్యోగి. అమ్మ సుభద్రాదేవి గృహిణి. - ఎన్.దివాకర్‌రెడ్డి, 12వ ర్యాంకర్, కర్నూలు ముందుగా జాబ్ చేస్తా బీటెక్ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగం చేస్తా. ఆ అనుభవంతో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభిస్తా. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే నా లక్ష్యం. మాది తూర్పుగోదావరిజిల్లా ప్రత్తిపాడు. నాన్న వెంకటరమణ ఫ్యాన్సీ స్టోర్స్ చూస్తారు. అమ్మ విజయలక్ష్మి గృహిణి. - కె.వీరవెంకటసతీష్, 14వ ర్యాంకర్, తూర్పుగోదావరి