ముంబై నమూనాతో వరదలకు చెక్
- నాలాల విస్తరణతోపాటు నగరమంతా రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేయాలి
- ముంబై ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ కపిల్ గుప్తా
సాక్షి, హైదరాబాద్: మానవ తప్పిదాలతోనే హైదరాబాద్ నగరం వరద ముంపునకు గురైందని.. ప్రభుత్వం, ప్రజలు, పౌర సమాజం సమష్టిగా సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరముందని ముంబై ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ కపిల్ గుప్తా పేర్కొన్నారు. ముంబై నగరం 2005లో వరద ముంపునకు గురై భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసిందని, అనంతరం వరదల నివారణ కోసం అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో సైతం ఈ పద్ధతులను అమలు చేస్తే సత్ఫలితాలిస్తాయన్నారు. నాలాలను విస్తరించడంతో పాటు నగరమంతా రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
నగరంలో మూసీ నదికి 1908లో వరదలు సంభవించి బుధవారానికి 108 ఏళ్లు పూర్తై సందర్భంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ముఫకంజా కాలేజీ ఆడిటోరియంలో ‘వర్షాలపై సంసిద్ధత’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంబైలో అమలు చేస్తున్న వరద నిర్వహణ పద్ధతులను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నిజాంపేట చెరువు నుంచి ప్రగతినగర్ చెరువుకు వరద నీటిని తీసుకెళ్లే నాలా కబ్జాలతో కుంచించుకుపోవడం వల్లే భండారి లేఅవుట్ కాలనీ ముంపునకు గురైందన్నారు.
ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైతే సంబంధిత క్యాచ్‌మెంట్ ఏరియాల్లో ఏ మేరకు వరదలు వస్తాయి? వరద ముంపు పొంచి ఉండే ప్రాంతాలు ఏవీ? వంటి సమాచారం ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడికక్కడ వర్షపాతాన్ని నమోదు చేసేందుకు ముంబైలో 60 రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేసి వరద తీవ్రతను కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నారన్నారు. నగరంలోని ప్రతి ఇంట్లో కనీసం 1,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకునే విధంగా అండర్ గ్రౌండ్ ట్యాంకులను నిర్మించినా నగరం వరద ముంపునకు గురికాదన్నారు. నాలాలు, మురికి కాల్వల్లో పూడిక, చెత్త పేరుకుపోవడంతో నగరంలో వరద తీవ్రత మరింత పెరిగిందని వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ పేర్కొన్నారు.
మాస్టర్‌ప్లాన్ అవసరం
వర్షాలను ఎదుర్కొనేందుకు నగరం సర్వసన్నద్ధంగా మారేందుకు మాస్టర్‌ప్లాన్ అవసరమని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. రానున్న 200 ఏళ్ల అవసరాలను తీర్చే విధంగా ఈ ప్లాన్ ఉండాలన్నారు. నగరం అంతటా రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేసి.. నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్‌లకు వచ్చే వరద నీటిని అంచనా వేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్తలు డాక్టర్ మురళీధరన్, ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు, బీవీ సుబ్బారావు, డాక్టర్ ఇంద్రాసేన రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ మోహన్ కందా తదితరులు పాల్గొన్నారు.