కుంటాల పరవళ్లు.. మరిన్ని నెలలు!
కుంటాల జలపాతం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
- ఎగువన కుప్టి వద్ద రిజర్వాయర్ నిర్మాణం
- అక్కడినుంచి అవసరమైనప్పుడల్లా నీటి విడుదల
సాక్షి, హైదరాబాద్: కుంటాల... రాష్ట్రంలో అతిపెద్ద జలపాతం.. 147 అడుగుల ఎత్తు నుంచి జాలువారే వరద పాలపొంగులాగా వెల్లువెత్తుతూ కనువిందు చేస్తుంది. కానీ... వానాకాలం దాటితే ఈ జలపాతంలో నీటి జాడ దాదాపు కనుమరుగవుతుంది. మళ్లీ జలపాతం పరవళ్లు చూడాలంటే వానాకాలం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. వెరసి ఈ జలపాతం పరవళ్లు నాలుగు నెలలే కనిపిస్తాయి. దీంతో పర్యాటకులు నిరాశకు గురవ తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరవళ్ల సమయాన్ని మరికొన్ని నెలల పాటు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
నీరు జాలువారే సమయాన్ని పెంచటమే కాకుండా, అవసరమైతే ప్రత్యేక సందర్భాల్లో నీటి పరవళ్లను ఆవిష్కరించేందుకు వీలుగా ఈ ప్రణాళికను రూపొందిస్తోంది. దీంతోపాటు జలపాతాన్ని అతి దగ్గరి నుంచి చూసేందుకు వీలుగా ప్రత్యేక సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించటంతోపాటు జలపాతం దిగువన ఉన్న విశాలమైన స్థలంలో ప్రత్యేక సరస్సును రూపొందించి అందులో బోటు షికారుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘కుప్టి’తో కావల్సినప్పుడల్లా నీళ్లు...
నిర్మల్ జిల్లా నేరెడిగొండ మండలంలోని కుంటాల వద్ద ఈ జలపాతం ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చే వివిధ పాయలతో ఏర్పడ్డ కడెం నదీ ప్రవాహం కుంటాల వద్ద ఎత్తయిన గుట్టల మీదనుంచి దిగువకు పడుతూ ఈ అద్భుత ప్రకృతి సౌందర్యం రూపుదిద్దుకుంది. అక్కడి నుంచి నీళ్లు కడెం రిజర్వాయర్‌లోకి చేరతాయి. ఈ జలపాతం ఎగు వన కుప్టి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రెండు గుట్టల మధ్య నీటి నిల్వకు అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. త్వరలో దాని పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు 6 టీఎంసీల సామర్థ్యంతో దాన్ని నిర్మించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఆ రిజర్వాయర్ నుంచి కుంటాలకు అవసరమైనప్పుడల్లా నీటిని విడుదల చే యాలని నిర్ణయించారు. వానాకాలం ముగి సిన తర్వాత కొంతకాలం పాటు నీటి ప్రవా హం ఉండేలా చూస్తారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే సందర్భాల్లో నీటిని విడుదల చేసి జలపాతాన్ని సృష్టిస్తారు. నీటి విడుదలను ముందే ప్రకటించటంతో ఆయా రో జుల్లో పర్యాటకులు వచ్చేలా చూసేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
దిగువన సరస్సు... సస్పెన్షన్ బ్రిడ్జి..
జలపాతం దిగువన నీటిధారల ఉధృతికి ఏర్పడ్డ గుంతలు పర్యాటకుల పాలిట ప్రాణాంతకంగా మారాయి. జలపాతం దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తూ సందర్శకులు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీన్ని నివారించి పర్యాటకులు జలపాతం దగ్గరగా వెళ్లి చూసేలా ప్రత్యేక ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సస్పెన్షన్ బ్రిడ్జిని వంపు తిరిగేలా నిర్మిస్తారు. ఆ వంపు జలపాతానికి చేరువగా ఉంటుంది. దీంతోపాటు అక్కడ ప్రత్యేకంగా ఫొటోలు దిగే ఏర్పాటు కూడా చేస్తారు. వీలైతే చైనా తరహాలో గ్లాస్ వంతెనకు ప్లాన్ చేస్తున్నారు. అంటే వంతెన అడుగు భాగం దళసరి అద్దంతో ఏర్పాటు చేస్తారు. దాని నుంచి దిగువ అందాలనూ చూడొచ్చు. ఇక దిగువన ఉన్న విశాలమైన స్థలంలో ప్రత్యేక సరస్సును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో నిలిచే నీటిలో బోటింగ్ ఏర్పాటు చేస్తారు. బోటింగ్ చేస్తూ జలపాతం అందాలను వీక్షించటం పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని అంటున్నారు.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం..
‘తెలంగాణలో ప్రముఖ జలపాతం ఎక్కువకాలం కనువిందు చేయటంతోపాటు యాత్ర మధురస్మృతిగా మిగిలేందుకు చర్యలు చేపట్టాం. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఆ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇది దోహదం చేస్తుంది. త్వరలో పనులు ప్రారంభించాలని నిర్ణయించాం’ అని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ‘సాక్షి’తో చెప్పారు.