రోజురోజుకు సరికొత్తగా మారుతూ వస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్–ఏఐ) అసెంబ్లీ రాజకీయ సమరాంగణంలోకి కూడా అడుగుపెట్టింది. ఎక్స్(ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలను వడపోసి ఓటర్ల నాడి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ పార్టీల నాయకుల పట్ల ప్రజల మనోగతాన్ని విశ్లేషించబోతోంది. ముంబై ఐఐటీ విద్యార్థులు ఈ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.
కృత్రిమ మేధపై అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన విద్యార్థులు, హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి.. ఒక ప్రాజెక్టు వర్క్‌గా దీనిని చేపట్టాలని నిర్ణయించారు. విద్యార్థుల ప్రయోగ ఫలితాలను సీనియర్ ప్రొఫెసర్లు విశ్లేషించనున్నారు. వివిధ సర్వేల మాదిరిగానే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా ఓటర్ల మూడ్‌ను గుర్తించి ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి దీన్ని ప్రయోగ స్థాయిలోనే చూడాలని.. ఎన్నికల ఫలితాలతో ఏఐ పరిశీలన సమాచారాన్ని సరిపోల్చిచూడాలని ముంబై ఐఐటీ విద్యార్థులు నిర్ణయించారు. ఇది విజయవంతమైతే వివిధ ఎన్నికల్లో మరింతగా పరిశీలన జరిపే ఆలోచనలో ఉన్నారు.
బహిరంగ సభల నుంచి కూడా..
ఆన్‌లైన్ విద్యావిధానంలో ఆయా విద్యార్థులు క్లాసులు సరిగా వింటున్నారా, లేదా? అన్నది పసిగట్టేందుకు కృత్రిమమేధను ఉపయోగిస్తుంటారు. ఆకస్మికంగా అనుబంధ ప్రశ్నలు వేయడం, వచ్చే సమాధానాల ద్వారా విద్యార్థి ఏకాగ్రతను గుర్తించడం చేస్తుంటారు. వైద్యరంగంలోనూ రోగి అందుకున్న వైద్యసేవల ఆధారంగా, తీసుకున్న మందుల ద్వారా భవిష్యత్ వ్యాధులను ఏఐ అంచనా వేస్తోంది.
ఇలాంటి విజయాలను ఆధారంగా చేసుకుని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రజల మానసిక ధోరణిని తెలుసుకునే కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసేందుకు ప్రయోగాలు చేపట్టింది. దీని ఆధారంగానే ఇప్పుడు ముంబై ఐఐటీ విద్యార్థులు ఎన్నికల్లో ప్రజల మూడ్‌ను తెలుసుకునే ప్రయోగానికి సిద్ధమయ్యారు. ముఖ్యనేతల సభలకు హాజరయ్యే ప్రజల ఫొటోలు, వీడియోలను సదరు సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు.
అందులోని జనం హావభావాలను కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్ నిశితంగా పరిశీలిస్తుంది. కోడ్ భాషలో కొన్ని సంకేతాలు పంపుతుంది. వీటిని విశ్లేషించడం ద్వారా ఆ సభలో ఓటరు తీరు ఎలా ఉంది? అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది పరిశీలిస్తారు. నాయకుడు మాట్లాడిన అంశాలపై ప్రజలు ఏరకంగా స్పందించారనేదానిపై అంచనా వేస్తారు.
సోషల్ మీడియాలో పసిగట్టేలా..
ఫేస్‌బుక్,ఎక్స్(ట్విట్టర్),ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి పోస్టులు సాధా రణంగా వారి పొలిటికల్ మూడ్‌ను స్పష్టం చేస్తాయని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ఓ పరిశీలనలో గుర్తించింది.యువత సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలో ఐఐటీ విద్యార్థులు కొన్ని నియోజకవర్గాల్లో యువత సామాజిక పోస్టులను ఏఐ ప్రోగ్రామ్‌కు జోడించి, మెజారిటీ యూత్ మనోభావాలను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు.
ఇది వ్యక్తిగత సమాచారం కిందకు ఏమీ రాదని న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రయోగాన్ని యువత వరకే పరిమితం చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, వాటిపై సానుకూల, ప్రతికూల ఫలితాలను కూడా ఏఐ విశ్లేషించే వీలుందని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు ఏదైనా పథకంపై వివిధ వర్గాల నుంచి మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్‌ను ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్ ద్వారా విశ్లేషించి.. ఆపథకం ప్రభావంపై అంచనా వేసే అవకాశం ఉంటుందన్నారు.
భవిష్యత్‌లో ఏఐతోనే ప్రధాన సర్వేలు
అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. పైథాన్‌తోపాటు పలు రకాల సాంకేతిక లాంగ్వేజీల ఆధారంగా నిపుణులు ఏఐ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. యూట్యూబ్‌లో మనం ఓ వీడియో చూస్తున్నప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటో అంచనా వేసి, అదే తరహా వీడియోలు వరుసగా వస్తుండటానికి అలాంటి ప్రోగ్రామ్‌లే కారణం.
ఇంతగా అభివృద్ధి చెందిన ఏఐ.. ఇప్పుడు రాజకీయంగా ఓటర్ల నాడిని వందశాతం విశ్వసనీయతతో పసిగడుతుందని చెప్పవచ్చు. ఈ తరహా ప్రయోగాల్లో ఐఐటీ విద్యార్థులు చూపిస్తున్న ఆసక్తిని అభినందించాల్సిందే. స్టాన్‌ఫర్డ్‌లో ఈ తరహా ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలి.
– ఎన్‌వీ రమణారావు, ఎన్‌ఐటీ డైరెక్టర్, రాయ్‌పూర్
వివిధ టూల్స్ క్రోడీకరణతో కచ్చితమైన ఫలితాలు
క్లౌడ్ థింకింగ్ ఇప్పటికే విస్తరించింది. అనేక రకాల సమాచారం నిక్షిప్తమైంది. కృత్రిమ మేధ కూడా ఒక టూల్. రాజకీయ సర్వేల్లో దీని భాగస్వామ్యం ఇప్పటికిప్పుడు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కాకపోతే క్లౌడ్ ఆధారిత డేటా విశ్లేషణతో భవిష్యత్‌లో దీని ప్రాధాన్యత ఉందనేది సుస్పష్టం. – ఎస్‌జీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్, ఎంవీఎస్‌ఆర్ కాలేజీ
- వనం దుర్గాప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment