ఫస్ట్ ఏఐ మామ్ – పవర్డ్ బై రియల్ మామ్స్
ఒకరోజు... హాయ్ ఫ్రెండ్స్... నేను మీ కావ్య మెహ్రాని మాట్లాడుతున్నాను. ప్రెగ్నెన్సికి సంబంధించి నా గత జ్ఞాపకాలను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మరో రోజు...మీ పిల్లవాడు బడికి వెళ్లనని మారాం చేస్తున్నాడా? హోంవర్క్ చేయడానికి భయపడుతున్నాడా? ఈ సమస్యలను ఒక తల్లిగా ఎలా పరిష్కారం కనుగొన్నానో ఈరోజు మీకు చెబుతాను.
ఇంతకీ ఎవరీ కావ్య మెహ్రా?
కాల్పనికత, వాస్తవికతకు మధ్య హద్దును చెరిపేస్తూ వర్చువల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ‘వావ్’ అనిపిస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు తాజా సంచలనం... కావ్య మెహ్రా.
మన దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత మామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కావ్య మెహ్రా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా అవతరించింది. టెక్నాలజీ, మాతృత్వం కలగలిసిన ఈ మామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను ‘కలెక్టివ్ ఆర్ట్స్ నెట్‌వర్క్’ కంపెనీ రూపొందించింది.
మాతృత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఏఐ డిజైన్ మోడల్‌గా కావ్య మెహ్రాను తీర్చిదిద్దారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కావ్య మెహ్రా బయోలో ‘భారతదేశపు మొట్ట మొదటి ఏఐ మామ్. పవర్డ్ బై రియల్ మామ్స్’ అనే పరిచయ వాక్యం ఉంటుంది.
మన దేశంలోని వివిధ రంగాలకు చెందిన తల్లులు ఎదుర్కొనే దైనందిన జీవిత అనుభవాలు, భావోద్వేగాలకు కావ్య మాటలు అద్దం పడతాయి. వంట, కుటుంబ జీవితం, వ్యక్తిగత శ్రేయస్సు, మాతృత్వానికి సంబంధించిన అనేక అంశాలు కావ్య కంటెంట్‌లో ఉంటాయి. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)
ఆధునిక కోణంలో మాతృత్వానికి సంబంధించిన తన ఆలోచనలను ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్‌లతో షేర్ చేసుకుంటుంది. స్కిన్‌కేర్ రొటీన్స్‌ను ఫాలో అయ్యే కావ్య కుకింగ్‌ను, పెయింటింగ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
ఫేవరెట్ ఫుడ్ తయారు చేయడం నుంచి పండగ సంతోషం వరకు రకరకాల విషయాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంది. ప్రెగ్నెన్సీ, చైల్డ్స్ డెవలప్‌మెంట్... మొదలైన ఫ్లాష్‌బ్యాక్ ఇమేజ్‌లను కూడా షేర్ చేస్తుంది.
తాను ఎలాంటి తల్లి కావాలనుకుంటోందో ఒక పోస్ట్‌లో చర్చించింది కావ్య. ఎవరి ప్రేమ నీడలో అయితే పిల్లలు చల్లగా, భద్రంగా ఉండగలుగుతారో... అలాంటి తల్లి తాను కావాలని అనుకుంటుంది. ‘కావ్య కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు. సమాజానికి సంబంధించి నిజజీవిత అనుభవాల ప్రతిబింబం’ అంటున్నాడు ‘కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్’ వ్యవస్థాపకుడు విజయ్ సుబ్రమణ్యం.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫస్ట్ ఏఐ మామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కావ్య మెహ్రపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం మాతృత్వం గురించి డిజిటల్ అవతార్ చెప్పడం ఏమిటో అని పెదవి విరిచారు.
కావ్య మెహ్రా ఏఐ పవర్డ్ మామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయినప్పటికీ... ఎంతోమంది నిజజీవిత తల్లుల అనుభవాల నుంచి ఈ డిజిటల్ అవతార్‌ను సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment