అందరి దృష్టి ఐఐటీ ముంబైపైనే! | rankers of jee advanced students aim to study in IIT mumbai! | Sakshi
Sakshi News home page

అందరి దృష్టి ఐఐటీ ముంబైపైనే!

Published Fri, Jun 20 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

rankers of jee advanced students aim to study in IIT mumbai!

సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన అందరు విద్యార్థుల లక్ష్యం ముంబై ఐఐటీలో చేరడమే. అందులోనూ కంప్యూటర్ సైన్స్‌లో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అందులోనూ చాలామంది సాఫ్ట్‌వేర్ కంపెనీలను పెడతామని పేర్కొనగా కొంతమంది సివిల్స్ సర్వీసెస్, రొబోటిక్స్‌లో పరిశోధన తమ లక్ష్యాలని తెలిపారు. ఐఐటీలో ర్యాంకు సాధించడానికి తాము రోజూ 10 నుంచి 12 గంటలు చదివామని వివరించారు. పలువురు ర్యాంకర్ల అభిప్రాయాలివీ..
 
 సివిల్స్ నా జీవిత లక్ష్యం
 
 సివిల్ సర్వీసెస్ సాధించడమే నా జీవిత లక్ష్యం. మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని కొందుర్గు మండలంలోని ముత్పూర్ గ్రామం. చాలా వెనుకబడిన ప్రాంతం. సివిల్స్ సాధించడం వల్ల మా గ్రామాల్లాంటివాటిని అభివృద్ధి చేయవచ్చు. అయితే ముందు గా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. తరువాత సివిల్స్‌పై దృష్టి పెడతా. నాన్న సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అమ్మ నిర్మల టీచర్.
 - చింతకింది సాయిచేతన్, రెండో ర్యాంకర్, మహబూబ్‌నగర్
 
 రొబోటిక్స్‌లో పరిశోధన చేస్తా
 
 రొబోటిక్స్‌లో పరిశోధన చేయడమే జీవిత లక్ష్యం. ముందుగా ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. మాది చిత్తూరు జిల్లా తిరుపతి పక్కనున్న పుత్తూరు. నాన్న సురేష్ ఎయిర్‌ఫోర్స్‌లో వారెంట్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ సుధారాణి టీచర్.      
 - రావూరు లోహిత్, 4వ ర్యాంకర్, చిత్తూరు
 
 ప్రతిభావంతులకు ఉపాధి కల్పిస్తా
 
 సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతా. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో చేరుతా. నాన్న సురేష్‌బాబు పారిశ్రామికవేత్త. అమ్మ రాధ కూడా వ్యాపారం చేస్తారు.
 - సి.జయత్ శంకర్, 5వ ర్యాంకర్, హైదరాబాద్
 
 సాఫ్ట్‌వేర్ కంపెనీనే లక్ష్యం
 
 ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదువుతాను. సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపిస్తా. ఆ రంగంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నదే లక్ష్యం. నాన్న నారాయణరావు సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు. అమ్మ దీప గృహిణి.
 - నందిగం పవన్‌కుమార్, 9వ ర్యాంకర్, రంగారెడ్డి
 
 ఉపాధి అవకాశాలు పెంచుతా
 
 సొంతంగా కంపెనీ స్థాపించాలన్నదే నా లక్ష్యం. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతాను. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరుతా. నాన్న వెంకట్‌రెడ్డి వ్యాపారవేత్త. అమ్మ వనిత గృహిణి.
 - వి.యశ్వంత్‌రెడ్డి, 10వ ర్యాంకర్, నల్లగొండ(హైదరాబాద్‌లో స్థిరపడ్డారు)
 
 మంచి పేరు తెచ్చుకుంటా
 
 ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాను. త్వరలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటా. నాన్న తిరుపాల్‌రెడ్డి డాక్టర్. అమ్మ ఉమాదేవి కూడా డాక్టరే.
 - కె.ఉదయ్, 11వ ర్యాంకర్, కర్నూలు
 
 సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తా
 
 సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తా. తద్వారా ప్రతిభావంతులకు ఉపాధి కల్పించాల న్నదే నా లక్ష్యం. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. నాన్న ఆదినారాయణరెడ్డి దూరదర్శన్‌లో ఉద్యోగి. అమ్మ సుభద్రాదేవి గృహిణి.
 - ఎన్.దివాకర్‌రెడ్డి, 12వ ర్యాంకర్, కర్నూలు
 
 ముందుగా జాబ్ చేస్తా
 
 బీటెక్ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగం చేస్తా. ఆ అనుభవంతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభిస్తా. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే నా లక్ష్యం. మాది తూర్పుగోదావరిజిల్లా ప్రత్తిపాడు. నాన్న వెంకటరమణ ఫ్యాన్సీ స్టోర్స్ చూస్తారు. అమ్మ విజయలక్ష్మి గృహిణి.
 - కె.వీరవెంకటసతీష్, 14వ ర్యాంకర్, తూర్పుగోదావరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement