
‘ఎంసెట్’లో మిగులు మిస్టరీ!
ఎంసెట్-2015లో 2000 లోపు ర్యాంకు సాధించిన ఒక విద్యార్థికి మొదటి విడత కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు అలాట్ అయ్యింది.
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2015లో 2000 లోపు ర్యాంకు సాధించిన ఒక విద్యార్థికి మొదటి విడత కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు అలాట్ అయ్యింది. అయితే అతనికి ఎన్‌ఐటీలో కూడా సీటు రావడంతో అక్కడకు వెళ్లిపోయాడు... కానీ ఎంసెట్‌లో అతనికి కేటాయించిన సీటు ఇప్పటికీ అతని పేరుపైనే ఉండిపోయింది. ఇలాంటి అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. క్యాంపస్ పరిధిలో ఉన్న కళాశాలల్లో ఇలాంటి సీట్లు ఎన్నో ఉన్నాయి. ఈ సీట్లను మలివిడత కౌన్సెలింగ్‌లోకి చేర్చకపోవడంతో మెరిట్‌లో తదుపరి ఉన్న వారికి అవి దక్కడంలేదు.
మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యి మూడో విడత కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించినా మిగులు సీట్లపై ఉన్నత విద్యామండలికి, అడ్మిషన్ల కమిటీకి ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోవడం విశేషం. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల కన్వీనర్ కోటాలోని 1,12,525 సీట్లలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో 73,817 మందికి సీట్లు అలాట్ కాగా 64,417 మంది రిపోర్టు చేశారు. రెండో విడతతో అలాట్‌మెంటు సీట్ల సంఖ్య 76,928కి పెరిగింది.
ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి అయ్యాకా మొత్తం కన్వీనర్ కోటాలోని సీట్లలో 38,708 మిగల గా రెండో విడత కౌన్సెలింగ్‌కు 38,870 సీట్లు చేరాయి. అంటే 162 సీట్లే పెరిగాయి. ఈ సీట్లు కూడా కొత్తగా కొన్ని కాలేజీలకు అదనంగా కేటాయించినవి. అంటే ఐఐటీ వంటివాటిల్లో చేరిన విద్యార్థులు ఖాళీ చేసిన సీట్లు చేరలేదు.
వెబ్‌జాయినింగ్ రిపోర్టుతోనే సమస్య...
గతం మాదిరిగా కాకుండా ఈమారు కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు వెబ్‌సైట్లోనే తమ లాగిన్ ద్వారా ‘వెబ్ జాయినింగ్ రిపోర్టు’ను సమర్పించాలని, అది తెలీని వారు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని నిబంధన పెట్టారు. తరువాత ట్యూషన్ ఫీజులు, ఒరిజినల్ ధ్రువపత్రాలను కాలేజీల్లో సమర్పించాలని సూచించారు. మలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనదలిచే వారు అది పూర్తయ్యాకనే కాలేజీల్లో చేరవచ్చని సడలింపునిచ్చారు. ఇదే ప్రస్తుత సమస్యకు మూలంగా మారింది. ఇలా వారెవ్వరూ కాలేజీల కు వెళ్లి జాయినింగ్ రిపోర్టు ఇవ్వలేదు.
మొత్తంగా కన్వీనర్ కోటాలో మెరిట్ విద్యార్థులు ఖాళీ చేస్తున్న వందలాది సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో చేర్చకపోవడంతో తదుపరి స్థానాల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు అవి దక్కకుండా పోయాయి. తాజాగా అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆయా కాలేజీలకు వెళ్లి రిపోర్టు చేయాలని చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్ తెలిపారు. ఆ వివరాలను ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో యాజమాన్యాలు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేయాలి. దాన్ని అనుసరించి మూడో విడత కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.