నిట్‌కు నూతన బ్యాచ్
నిట్‌కు నూతన బ్యాచ్
Published Wed, Aug 16 2017 12:55 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM
నేడు ఓరియంటేషన్
నాలుగు కొత్త లోగోలు తయారీ
ఈ ఏడాది 480కు 438 సీట్లు భర్తీ
మొత్తం విద్యార్థులు 1,224
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్)లో కొత్తబ్యాచ్ బుధవారం రానుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు రానున్నారు. ఏపీ నిట్ ఇక్కడ ఏర్పాటుచేసిన తర్వాత అధిక శాతంలో విద్యార్థులు ఈ ఏడాది చేరారు. మొత్తం సీట్లు 480కు 438 సీట్లు భర్తీకాగా 42 మిగిలాయి. హోం స్టేట్ కోటా కింద 240 సీట్లు, ఇతర కోటా కింద 240 సీట్లు నిట్‌లో ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు సీటు పొందే విషయంలో ప్రాధాన్యతను ఏపీ నిట్‌కు ఇచ్చారు. నిట్ ఏర్పాటుచేసిన మొదటి రెండేళ్లలో 960 (480+480) సీట్లకు 786 మంది విద్యార్థులు చేరారు. అయితే ఈఏడాది 480 సీట్లకు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఈసారి సీట్ల భర్తీకి సీశాబ్ పేరిట ప్రత్యేక రౌండ్ కేటాయించడంతో నిట్‌లో చేరాలనుకున్న విద్యార్థుల ఆశలు నెరవేరాయి. దీంతో మరికొందరు ఇక్కడ చేరడానికి మార్గం సుగమమయ్యింది. మొత్తంగా కొత్త బ్యాచ్‌తో కలుపుకుని నిట్‌లో విద్యార్థుల సంఖ్య 1,224 (786+438)కు చేరింది. బాలికలకు వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో, బాలురకు పెదతాడేపల్లి, నల్లజర్ల, వాసవీ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న డీఎడ్ కళాశాలలో వసతి ఏర్పాటుచేశారు. కొత్త విద్యార్థుల కోసం వారం రోజుల్లో పూర్తి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమంలో ముఖ్య అతి«థిగా మెంటర్ డైరెక్టర్ జీఆర్‌పీ రెడ్డి పాల్గొంటారు. నిట్‌లో కోర్సులు, వాటి ప్రాధాన్యతలను వివరించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
బాలారిష్టాలను అధిగమిస్తూ ఏపీ నిట్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వసతిలోనే పరిశోధనశాలల, వసతి, తరగతి గదులు అవసరాలను తీర్చుకుంటోంది. కేంద్ర మానవవనరుల శాఖ ఏపీ నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తూ అంగీకారం తెలిపింది. ఈ నిధుల ద్వారా వచ్చే విద్యాసంవత్సరానికి వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. నిట్‌కు ఇంతవరకు ఎలాంటి లోగో లేదు. నిట్‌ను అధికారికంగా గుర్తిస్తూ ఇటీవల గెజిట్ విడుదలైంది. దీంతో పాటు నిట్‌కు నాలుగు రకాల లోగోలను ఏపీ నిట్ అధికారులు రూపొందించారు. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం, పచ్చని పొలాలు, గోదావరి వంతెన, పూర్ణకలశం వంటివి లోగోలో వచ్చేలా నాలుగు రకాల లోగోలను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , దేవాదాయశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్‌కు పంపించారు. వీటిలో ఏదో ఒకదానికి అధికారిక ముద్ర పడాల్సి ఉంది. నిట్‌లో డే స్కాలర్ పద్ధతిని ప్రవేశపెట్టడానికి గతంలో అధికారులు ప్రతిపాదించారు. అయితే విద్యార్థులకు ఆటపాటలతో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విద్య అందించాలన్నది నిట్ ఉద్దేశం కావడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుని రెసిడెన్షియల్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిట్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాసు తెలిపారు.
Advertisement
Advertisement