నిట్‌కు వెళ్లే దారేది
► ప్రధాన రహదారి కోసం అన్వేషణ
► రహదారి ఏర్పాటుకు ఆక్రమణల అడ్డంకి
► హైవే బైపాస్ నుంచీ దారి కరువు
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శాశ్వత భవనాల నిర్మాణాలకుగాను మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యింది. ఏ భవనం ఎక్కడ ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి. ఎలా నిర్మించాలి అనే విషయాలకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధమవుతోంది. అన్నీ కుదిరితే మరో రెండు నెలల తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కానీ ఇప్పుడు నిట్‌కు ఎలా వెళ్లాలి అనేది పరిష్కారం దొరకని సమస్యగా మారింది. నిట్ ఎక్కడ ఉన్నా జాతీయ రహదారికి ఆనుకుని గాని, 80 నుంచి 100 అడుగుల రోడ్డు పక్కన గాని భవనాల నిర్మాణం చేపడతారు.
తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో నిట్ కోసం కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తిచేశారు. అప్పారావుపేట రోడ్డులో జాతీయ రహదారి బైపాస్‌కు అభిముఖంగా వాస్తు రీత్యా ప్రధాన గేటును కూడా ఏర్పాటుచేస్తున్నారు. దీనికి గా ను ఇప్పటికే బాలికోన్నత పాఠశాల సమీపంలో పట్టణానికి దగ్గరగా గణేష్‌నగర్‌కు సమీపంలో ఉన్న నిట్ ప్రహరీ గోడను అధికారులు మూసివేశారు.
ప్రధాన రహదారి సమస్య
నిట్‌కు చేరుకోవాలంటే పట్టణం నుంచి అప్పారావుపేట రోడ్డు ఒక్కటే శరణ్యం. ఈ రోడ్డు ప్రస్తుతం 20 అడుగులకు మించి లేదు. ఈ రోడ్డు నుంచి పట్టణంలోకి రావాలంటే ఆర్టీసీ డిపో గోడ పక్కగా గణేష్ నగర్‌కు వచ్చే రహదారి మాత్రమే అందుబాటులో ఉంది. ఎఫ్‌ఎంబీ ప్రకారం ఇది రికార్డుల్లో 80 అడుగులు ఉంది. గతంలో ఇక్కడ విమానాశ్రయం ప్రతిపాదన ఉన్న సమయంలో ఈ రహదారిని ప్రధాన రహదారిగా గుర్తించి సర్వే చేశారు. ఆక్రమణల వివరాలను రెవెన్యూ అధికారులు నమోదుచేశారు.
ఎయిర్‌పోర్టు ప్రతిపాదన ఆగడంతో ఈ దారి గురించి విస్మరించారు. తాజాగా నిట్ కో సం ఇదే ర హదారిని పరిగణనలోకి తీసుకున్నా రు. 80 అడుగుల మేర ఉండాల్సిన ఈ మార్గం లో ఆర్టీసీ గేటుకు రెండో పక్కన దారిని ఆక్రమించి కొన్ని పూరి గుడిసెలు, మరికొన్ని బహు ళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. గతంలో ఈ ఆక్రమణల వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అభ్యంతరాల కారణంగా తొలగింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. తిరిగి నిట్ రహదారి కోసం ఈ రహదారిని ఎంచుకోడానికి గాను ఆక్రమణదారుల వివరాలను అధికారులు సేకరించారు.