
తిరుపతి ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశానికి యేటా జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఆదివారం మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది. దీనికోసం తిరుపతి, సమీప ప్రాంతాల్లో 13 కేంద్రాలను ఏర్పాటుచేశారు. తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు మొత్తం 8,160మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ ఏడాది నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఎడిఫై పాఠశాలకు అప్పగించారు. నీట్ సిటీ కోఆర్డినేటర్‌గా ఆ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి ఎస్.నాయర్ వ్యవహరించనున్నారు.
తిరుపతికి చేరుకున్న విద్యార్థులు
చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి విద్యార్థులు తిరుపతిలో పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే విద్యార్థులు చేరుకుని రిపోర్ట్ చేయాలనే నిబంధన ఉంది. అలాగే మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. 1.30 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో సుదూర ప్రాంత విద్యార్థుల్లో అధిక మంది ముందస్తుగానే శనివారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు.
అడ్మిట్ కార్డు, డ్రెస్ కోడ్ తప్పనిసరి
నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో వెంట తెచ్చుకోవాలి. అలాగే అధికారులు సూచించిన డ్రెస్ కోడ్ పా టించాల్సి ఉంటుంది. షూస్(బూట్లు) ధరించకూడదు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, హ్యాండ్ బ్యాగులు, స్మార్ట్ వాచ్, సెల్‌ఫోన్, పెన్నులను అనుమతించరు. గత ఏడాది బాలికల బంగారు ఆభరణాలు, చెవిపోగులు, ముక్కుపుడకలు, గాజులు, కాళ్ల పట్టీలు వంటివి తీయించివేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షకు హాజరవ్వాలని సిటీ కో–ఆర్డినేటర్ సూచించారు. డయాబెటిస్ ఉన్న వారు మందులు, కట్‌చేసిన పండ్లు కాకుండా పూర్తిగా ఉన్న పండ్లను అనుమతించనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూసుకుని అందులో ఇచ్చిన సూచనల మేరకు పరీక్ష కేంద్రాలకు రావాలని సిటీ కో–ఆర్డినేటర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment